China Population Decline: చైనాలో రికార్డు స్థాయిలో తగ్గిన జనాభా, ఇకపై ఫస్ట్ ప్లేస్ భారత్‌దేనా?
China Population Decline: చైనాలో రికార్డు స్థాయిలో జనాభా తగ్గినట్టు నివేదికలు వెల్లడించాయి.
China Population Decline:
రికార్డు స్థాయిలో తగ్గుదల..
ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే...చైనా అని అందరం ఠక్కున సమాధానం చెప్పేస్తాం. ఆ తరవాత భారత్‌లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది. పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...
సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది. సాధారణంగా భారత్‌లో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు వెల్లడిస్తారు. చివరిసారి 2011లో ఈ గణన జరిగింది. మళ్లీ 2021లో జరగాల్సి ఉన్నా...కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక చైనా విషయానికొస్తే...జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి కనీసం 11 కోట్ల మేర జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. "చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదు" అని స్పష్టం చేస్తున్నారు. శ్రామిక శక్తి తగ్గిపోతుండటం వల్ల మొత్తంగా దేశ తలసరి ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ముగ్గురు పిల్లల్ని కనండి: చైనా
జనాభా పెరిగిపోతుందన్న ఉద్దేశంతో మూడు దశాబ్దాల పాటు ఒక జంటకు ఒకే బిడ్డ అనే నిబంధనను చైనా అమలు చేసింది. కానీ జనాభాలో వృద్ధుల శాతం పెరిగిపోవడం... పని చేసేవారి సంఖ్య తగ్గిపోతూండటంతో ఆందోళనతో..ఏడేళ్ల క్రితం ఒకే సంతానం విధానాన్ని మార్చింది. ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది. కానీ ప్రజలు మాత్రం ఒక్కరు చాలని సరి పెట్టుకుంటున్నారు. దాంతో జనాభా వృద్ధి రేటులో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చివరికి ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రకటించారు. చైనా జనాభా వృద్ధి రేటుఅరశాతం కూడా లేదు. ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ ప్రకటన చేసినా.. ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేకపోవడంతో.. ముగ్గురు సంతానం నిర్ణయాన్ని తీసుకుంది. 2019 జనాభా లెక్కల సగటును పరిశీలిస్తే ప్రతి వెయ్యి మందికి 10.48 మంది మాత్రమే పిల్లలు జన్మనిస్తున్నట్లు నిర్దారణ అయింది. ఐదేళ్లుగా జననాల రేటు తగ్గుతూపోతుండడంతో తీవ్రంగా ఆందోలన చెందుతున్న చైనా ముగ్గురు పిల్లలకు అనుమతించింది. కానీ చైనా ప్రజలు ముగ్గురు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించడం లేదు.
Also Read: Assembly Election 2023 Date: ఆ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల తేదీలు వచ్చేశాయ్, ప్రకటించిన ఎన్నికల సంఘం