China's Workforce: మూడేళ్లలో కోట్లాది మంది రిటైర్, పని చేసే వాళ్లు లేక చైనా తిప్పలు
China's Workforce: చైనాలో వర్క్‌ఫోర్స్ గణనీయంగా పడిపోతోంది.
China's Workforce:
4 కోట్ల మంది రిటైర్..
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ స్తబ్దుగానే ఉంది. ఎకానమీ చాలా మెల్లగా ముందుకెళ్తోంది. లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కొవిడ్ పుట్టినిల్లైన చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లలో 4.1 కోట్ల మంది రిటైర్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం కరోనా. మరో కారణమూ ఉంది. వయసైపోయిన వాళ్లు ఎక్కువ మంది ఉండడం. Bloomberg ప్రకారం.. 2022లో చైనాలో 73 కోట్ల మందిని రిక్రూట్ చేసుకున్నారు. 2019లో ఈ సంఖ్య 77 కోట్లకు పైగానే ఉంది. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏటా రిక్రూట్‌మెంట్ తగ్గుతోందని. కోట్లాది మంది రిటైర్ అవుతున్నారు. వాళ్లను రీప్లేస్ చేయడం కష్టమవుతోంది. రిటైర్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలూ ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. రిటైర్‌మెంట్ ఏజ్‌ను పెంచితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు కొందరు నిపుణులు. కరోనా సంక్షోభం తరవాత ఎకానమీ డల్ అవ్వడం, యువతకు పెద్దగా ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల ఉన్న వాళ్లు రిటైర్ అవుతున్నారే తప్ప కొత్త వాళ్లు పనుల్లో చేరడం లేదు. పని చేసే వాళ్ల సంఖ్య తగ్గడం వల్ల మొత్తంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతోంది. ఆర్థిక వ్యవస్థనూ దెబ్బ తీస్తోంది.
రిటైర్‌మెంట్ ఏజ్ పెంచుతారా..?
2012 నుంచి లెక్కలు చూస్తే..16-59 ఏళ్ల వయసున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. గత మూడేళ్లలోనే వీరి సంఖ్య 3కోట్లకు పైగా తగ్గిపోయింది. గతేడాది ఎంప్లాయ్‌మెంట్ కూడా భారీగా తగ్గిపోయింది. ఈ మధ్యే కరోనా ఆంక్షల్ని తగ్గించింది చైనా. ఫలితంగా ఈ ఏడాది ముగిసే నాటికి కొంత మేర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. చైనాలో రిటైర్‌మెంట్ ఏజ్‌ని పురుషులకు 60 ఏళ్లుగా, మహిళలకు 55 ఏళ్లుగా నిర్ణయించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. అయితే...ఆయుర్దాయం పెరుగుతున్నందున ఈ రిటైర్‌మెంట్ వయసుని పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ మార్పు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మరో నెల రోజుల్లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేయనుంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే...చైనా అని అందరం ఠక్కున సమాధానం చెప్పేస్తాం. ఆ తరవాత భారత్‌లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది. పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...
సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది.
Also Read: Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి అంబానీ ఎంట్రీ - చౌక ధరల దండయాత్రకు మళ్లీ రెడీ