బలవంతంగా మతం మారిస్తే పదేళ్ల జైలుశిక్ష, ఛత్తీస్‌గఢ్‌లో కొత్త బిల్లు!
Conversion Bill: మత మార్పిడిని అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురానుంది.
Chhattisgarh Conversion Bill: ఛత్తీస్‌గఢ్‌లో మత మార్పిడిపై కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు Conversion Bill ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం...ఏ వ్యక్తైనా మతం మార్చుకోవాలంటే కచ్చితంగా 60 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఓ ఫామ్‌లో వ్యక్తిగత వివరాలన్నీ నింపి దాన్ని జిల్లా మెజిస్ట్రేట్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మతం మారడానికి కారణాలేంటో ఆరా తీస్తారు. ఆ తరవాతే అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది అధికారులు నిర్ణయిస్తారు. ఇలా ఈ ప్రక్రియను కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్ తయారైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే...అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. మత మార్పిడిలో కీలక పాత్ర పోషించే వ్యక్తి కూడా నెల రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకునేలా నిబంధన తీసుకురానుంది ప్రభుత్వం. బలవంతంగానో, బెదిరించో, ఇంకేదో ఆశ చూపించో మతం మారేందుకు ప్రోత్సహించడాన్ని అరికట్టడానికే ఈ బిల్లు తీసుకురానున్నట్టు స్పష్టం చేస్తోంది. ఇలా బలవంతంగా మతాన్ని మారిస్తే మాత్రం జిల్లా మెజిస్ట్రేట్ దాన్ని చట్ట విరుద్ధం అని ప్రకటిస్తారు. ఈ డ్రాఫ్ట్‌కి Chhattisgarh Prohibition of Unlawful Religious Conversion Bill అనే పేరు పెట్టింది.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన తరవాతే మత మార్పిడికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మత మార్పిడులపై జిల్లా మెజిస్ట్రేట్ ప్రత్యేకంగా ఓ రిజిస్టర్ మెయింటేన్ చేస్తారు. ఎవరెవరు మతం మారారన్న వివరాలన్నీ అందులో ఉంటాయి. బలవంతంగా మైనర్‌లు, మహిళలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారి మతం మార్చేయాలని చూస్తే కనీసం రెండేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశముంటుంది. దీంతో పాటు రూ.25 వేల జరిమానా కూడా కట్టాల్సిందే. ఇక భారీ ఎత్తున మత మార్పిడులకు పాల్పడితే కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. రూ.50 వేల జరిమానా చెల్లించాలి. ఇలాంటి కేసుల్లో బాధితులకు రూ.5 లక్షల వరకూ పరిహారం అందిస్తారు. గతంలో సుప్రీంకోర్టు మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్బు ఆశ చూపించి, గిఫ్ట్‌లు ఇస్తామని, బెదిరించి మత మార్పిడి చేయించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
" బలవంతపు మత మార్పిడిపై నిర్లక్ష్యం వహించకూడదు. ఇది ఎంతో కీలకమైన విషయం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని...దీన్ని కట్టడి చేసే మార్గాలు చూడాలి. ఈ బలవంతపు మత మార్పిడులు ఆగకపోతే భవిష్యత్‌లో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. జాతీయ భద్రతనూ ఇది దెబ్బకొట్టే ప్రమాదముంది. మత స్వేచ్ఛకూ భంగం కలిగిస్తుంది. "