Bihar New Cabinet : 16 ఆర్జేడీకి మిగతావి నితీష్ పార్టీకి - బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ !
బీహార్‌లో మంత్రివర్గాన్ని విస్తరించారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.
Bihar New Cabinet : బిహార్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాట్నాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్‌లో లాలూ యాదవ్ మరో కుమారుడు.. తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్‌ప్రతాప్‌కు మరోసారి చోటు దక్కింది. ఆయన మరో నలుగురితో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. మొదట మంత్రులుగా విజయ్‌కుమార్ చౌదరి (జేడీయూ), విజేందర్ యాదవ్ (జేడీయూ), అలోక్ మెహత (ఆర్‌జేడీ), తేజ్ ప్రతాప‌్ (ఆర్‌జేడీ), అఫాక్ ఆలం (కాంగ్రెస్)తో గవర్నర్ ప్రమాణం చేయించారు.
Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO
— ANI (@ANI) August 16, 2022
తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు
జేడీయూ నుంచి తేజస్వి యాదవ్‌తో కలిసి మొత్తం ప్రభుత్వం 16 మంత్రి పదవులు దక్కాయి. ఆర్‌జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, సమీర్ మహాసేత్, వీరేంద్ర , అక్తరుల్ షాహీన్, అలోక్ మెహతా, అనితా దేవి, రామానంద్ యాదవ్, లలిత్ యాదవ్, సురేంద్ర యాదవ్, చంద్రశేఖర్, సుధాకర్ సింగ్, సర్వజిత్ కుమార్, సురేంద్ర రామ్, షానవాజ్, భరత్ భూషణ్ మండల్.. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, సంజయ్ ఝా, సునీల్ కుమార్, శ్రవణ్ కుమార్, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, షీలా మండల్, జమా ఖాన్, లేషి సింగ్, జయంత్ రాజ్, మదన్ సాహ్ని.. కాంగ్రెస్ నుంచి అఫక్ ఆలం, మురారీ, ప్రసాద్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీజేపీతో బంధం తెంపుకుని ఆర్జేడీతో కలిసి నితీష్ ప్రభుత్వం ఏర్పాటు
2020 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ.. ఈ నెలలో కమలం పార్టీతో బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కూడిన కూటమితో జట్టుకట్టింది. ఎనిమిదో సారి నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మంత్రివర్గంలోకి తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ చేరారు. నీతీశ్ కుమార్ మునుపటి మంత్రులను దాదాపుగా కొనసాగించారు. అలాగే హోం శాఖను తన చెంతే ఉంచుకోగా.. ఉపముఖ్యమంత్రి తేజస్వీకి వైద్యం, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. బిహార్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది సభ్యులకు స్థానం ఉంది. తదుపరి విస్తరణలో ఆ స్థానాలు నిండనున్నాయి.
ఐదుగురు ముస్లింలకు కేబినెట్‌లో చోటు
ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురు ముస్లింలకు స్థానం ఇవ్వగా.. ఆర్జేడీ తమకు పట్టున్న యాదవ సామజిక వర్గానికి ఏడు మంత్రి పదవులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత కూటమి బలం 163గా ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నీతీశ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల ఆ సంఖ్య 164కు చేరింది. ఆగస్టు 24న ప్రభుత్వం బలం నిరూపించుకోనుంది.