Viral News: వాచ్, ల్యాప్ టాప్ చోరీ - అవి కావాలంటే కాంటాక్ట్ చేయాలని నెంబర్ వదిలివెళ్లిన విచిత్ర దొంగ
Burglar in China Leaves Note : చైనాలోని షాంఘైలో ఓ దొంగ ల్యాప్ టాప్, వాచ్ దొంగతనం చేశాడు. అవి కావాలంటే తనకు ఫోన్ చేయాలంటూ నోట్ రాసి పారిపోయాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు.
![Viral News: వాచ్, ల్యాప్ టాప్ చోరీ - అవి కావాలంటే కాంటాక్ట్ చేయాలని నెంబర్ వదిలివెళ్లిన విచిత్ర దొంగ burglar in china leaves note for owner after stealing watch laptop improve your anti theft system Viral News: వాచ్, ల్యాప్ టాప్ చోరీ - అవి కావాలంటే కాంటాక్ట్ చేయాలని నెంబర్ వదిలివెళ్లిన విచిత్ర దొంగ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/f6b707370b19ada9962c2fccf43e0acc17193280622491037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
China Burglar Funny Note: చైనాలోని షాంఘైలో ఓ వింత చోరీ జరిగింది. ఓ దొంగ విలువైన వస్తువులను దొంగిలించి అవి కావాలంటే తనను సంప్రదించాలంటూ కార్డు మీద ఫోన్ నంబర్ రాసి వెళ్లాడు. అది చూసిన యజమాని షాక్ తో పాటు ఆశ్చర్యపోయాడు. దొంగతనం చేసే సమయంలో “డియర్ బాస్, నేను మీ చేతి గడియారం, ల్యాప్‌టాప్ తీసుకున్నాను. మీరు మీ యాంటీ థెఫ్ట్ సిస్టాన్ని అప్ గ్రేడ్ చేయాలి. మీ వ్యాపారం దెబ్బతింటుందని భయపడి నేను అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తీసుకోలేదు. మీ ల్యాప్‌టాప్, ఫోన్ మీకు తిరిగి కావాలంటే నన్ను సంప్రదించండి” అని దొంగ నోట్‌లో రాశాడు. ఈ సంఘటన మే 17 న షాంఘై నగరంలోని ఓ ఆఫీసు బిల్డింగులో జరిగింది.
ఈ చోరీ కేసులో దొంగ యజమానికి ఓ సూచన కూడా చేశాడు. తన కంపెనీలో ఏర్పాటు చేసిన యాంటీ థెఫ్ట్ సిస్టమ్(anti theft system)ను మెరుగుపరచమని యజమానిని కోరుతూ నోట్‌ను వదిలివెళ్లాడు. దొంగ కంపెనీ ఆవరణలోకి ప్రవేశించి ఒక వాచ్, ల్యాప్‌టాప్‌ను దొంగిలించాడు. దొంగతనం చేసి బయలు దేరే ముందు అతను వాటి యజమానికి ఒక నోట్ వదిలివేశాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు షాంఘై పోలీసులు తెలిపారు.
గంటల్లోనే దొరికిన దొంగ
షాంఘై పోలీసులు వేగంగా స్పందించడంతో చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే దొంగ దొరికిపోయాడు. పబ్లిక్ సర్వైలెన్స్ కెమెరాలు, అతను వదిలిపెట్టిన ఫోన్ నంబర్‌ను ఉపయోగించి అధికారులు అతనిని ట్రాక్ చేశారు. షాంఘై నుంచి రైలులో బయలుదేరుతుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ దొంగ సాంగ్ గా గుర్తించారు. అతడి వద్ద దొంగతనానికి గురైన వస్తువులు వాచ్, యాపిల్ మ్యాక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.
ఇదే మొదటిది కాదు
చైనాలో విచిత్ర దొంగతన ఘటన ఇదే మొదటిది కాదు. ఇలాంటి విచిత్రమైన చోరీ కేసులు ఆ దేశంలో సర్వ సాధారణం. గత సంవత్సరం చైనాలోని యునాన్‌లో ఒక దొంగ బ్రేక్-ఇన్ సమయంలో నిద్రపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని గుర్తించారు. అతడు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘‘అతడు దయగల దొంగ’’ అని కామెంట్ చేయగా.. మరొకరు "అతను చాలా ఆత్మవిశ్వాసంతో నేరం చేసాడు " అంటూ మరొకరు కామెంట్ చేశారు.
మూడు రోజుల్లో తిరిగి ఇస్తా..
అలాగే 2022లో చైనీస్ మునిసిపాలిటీ ఆఫ్ చాంగ్‌కింగ్ లో కూడా ఒక అసాధారణ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దొంగ ఓ కంపెనీ నుండి ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్‌లు, రెండు కార్టన్‌ల ఖరీదైన సిగరెట్లను దొంగిలించాడు. అయితే, తన కేవలం ఆ వస్తువులను అప్పుగా మాత్రమే తీసుకుంటున్నట్లు పేర్కొంటూ ఓ నోట్ వదిలి వెళ్లాడు. మూడు రోజుల్లో రూ.11వేలు ఇచ్చి వాటిని తిరిగి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దని ప్రాధేయపడ్డాడు.
తెలంగాణలో కూడా ఇలాంటి చోరీనే..
ఇండియాలోనూ ఒక విచిత్రమైన దొంగతనం ఆ మధ్య తెరపైకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో తెలంగాణలో నెన్నెల మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో మెయిన్ డోర్ తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించాడు. అతను క్యాషియర్ , క్లర్క్‌ల క్యాబిన్‌లలో వెతికితే డబ్బులు, ఖరీదైన వస్తువులు కనిపించలేదు. లాకర్లను తెరవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత న్యూస్ పేపర్ తీసుకుని దానిపై మార్కర్ పెన్ తో "నాకు ఒక్క రూపాయి రాలేదు.. నన్ను పట్టుకోవద్దు. నా వేలిముద్రలు ఉండవు. ఇది మంచి బ్యాంకు" అని రాసిపెట్టి వెళ్లాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)