Budget 2024: గత వ్యవసాయ బడ్జెట్‌లోని ప్రధానాంశాలు ఇవి, ఓ లుక్కేయండి
Budget 2024: 2023-24 బడ్జెట్‌లో ఈ రెండు విభాగాలకు వరుసగా 5 శాతం & 10 శాతం ఎక్కువ కేటాయించారు.
Budget 2024 Expectations: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం, ఫిబ్రవరి 01న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. వరుసగా ఆరోసారి ఆమె సమర్పించే బడ్జెట్ అది. మోదీ 2.0 ప్రభుత్వంలో చివరి బడ్జెట్ కూడా అదే. ఇందిరాగాంధీ తర్వాత దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మల సీతారామన్ ఘనత సాధించారు.
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో.. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద పద్దు రాసింది. కేటాయింపుల మొత్తాన్ని పెంచింది. వ్యవసాయం రంగం కోసం 2023 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రధాన ప్రకటనలు, కేటాయింపుల గురించి తెలుసుకుంటే.. 2024 వ్యవసాయ బడ్జెట్‌ను అంచనా వేయడానికి వీలవుతుంది.
2023 బడ్జెట్‌లో, కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 1,25,036 కోట్లు కేటాయించారు. 2022 బడ్జెట్‌లో సవరించిన అంచనాలు (revised estimates -RE) రూ. 1,18,913 కోట్ల కంటే ఇది దాదాపు ఐదు శాతం ఎక్కువ. ఇందులో రూ. 1,15,532 కోట్లను వ్యవసాయం & రైతుల సంక్షేమం కోసం కేటాయించారు. వ్యవసాయ పరిశోధన & విద్య కోసం రూ.9,504 కోట్లు ఇచ్చారు. 2022-23 బడ్జెట్ సవరించిన అంచనాలతో పోలిస్తే, 2023-24 బడ్జెట్‌లో ఈ రెండు విభాగాలకు వరుసగా 5 శాతం & 10 శాతం ఎక్కువ కేటాయించారు.
2023 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక విషయాలు:
- గోధుమలు, వరి పండించే రైతులకు కనీస మద్దతు ధర (MSP) ద్వారా రూ. 2.37 లక్షల కోట్ల ప్రత్యక్ష చెల్లింపులు
- అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ అంకుర సంస్థలకు మద్దతు
- పాడి పరిశ్రమ, చేపల పెంపకం, పశుపోషణ రైతులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని.. వ్యవసాయ రుణాలు రూ. 20 లక్షల కోట్లకు పెంపు
- కోటి మంది రైతులను సహజ వ్యవసాయంలోకి మార్చి, సాధికారత కల్పించడానికి ప్రణాళిక
- కిసాన్ డ్రోన్‌ల వినియోగం ద్వారా పంటలపై నిఘా, దిగుబడి అంచనా, పురుగుల మందుల పిచికారీ, భూ రికార్డులను డిజిటలైజేషన్
- ఉత్పత్తులను నిల్వ చేసి, సరైన సమయంలో అమ్మడం ద్వారా రైతులు మంచి ధరలు పొందేందుకు నిల్వ సామర్థ్యాలు ఏర్పాటు
2023 బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం కొత్త పథకాలు, పెట్టుబడులు:
- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ఒక కొత్త ఉప పథకం. చేపల విక్రేతలు, మత్స్యకారులు, సూక్ష్మ & చిన్న వ్యాపారాల (MSMEలు) సాధికారత దీని లక్ష్యం.
- వ్యవసాయం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల సృష్టి. వ్యవసాయ రంగ అంకుర సంస్థలకు పెట్టుబడి సాయంతో పాటు, రైతులు మార్కెట్ సమాచారం తెలుసుకోవడం, మార్కెటింగ్ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం దీని లక్ష్యం.
- ప్రత్యామ్నాయ ఎరువులను వినియోగించేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడానికి పీఎం ప్రణామ్ (PM PRANAM) ప్రారంభం.
- 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల (PACS) కంప్యూటరీకరణ కోసం రూ.2,516 కోట్ల పెట్టుబడి. దీనివల్ల రుణాల ప్రక్రియ సులభం అవుతుంది.
- హైదరాబాద్‌లోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్'కు "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"గా గుర్తింపు. 'శ్రీ అన్న'గా పిలిచే తృణధాన్యాల సాగులో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడం దీని లక్ష్యం.
వ్యవసాయ రంగానికి మధ్యంతర బడ్జెట్ 2024 అంచనాలు:
- ప్రస్తుత పథకాలను 2024 మధ్యంతర బడ్జెట్‌లో కంటిన్యూ చేస్తారని భావిస్తున్నారు.
- పేద వర్గాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడు, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇస్తారని అంచనా వేస్తున్నారు.
- ఉపాధి హామీ పథకం (MGNREGA), గ్రామీణ రహదారులు, PM కిసాన్ సమ్మాన్ నిధి, PM విశ్వకర్మ యోజన వంటి సంక్షేమ నిధులకు అధిక కేటాయింపులు కంటిన్యూ కావచ్చు.
మరో ఆసక్తికర కథనం: పన్నుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు - ఇండస్ట్రీ కోర్కెలు చాలా ఉన్నాయి!