Telangana News: బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల వాయిదా - ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కేటీఆర్
BRS Swedapatram: బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల కార్యక్రమం వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
BRS Swedapatram Relese Postponed: బీఆర్ఎస్ (BRS) తొమ్మిదన్నరేళ్ల పాలనపై 'స్వేద పత్రం' (Swedapartram) విడుదల కార్యక్రమం వాయిదా పడింది. 'స్వేద పత్రం' పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ను శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఇస్తామని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, పలు కారణాల రీత్యా ఈ కార్యక్రమం ఈ నెల 24కు (ఆదివారం) వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
శ్వేతపత్రం వర్సెస్ స్వేద పత్రం
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల పాటు శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వాటికి కౌంటర్ గా 'స్వేద పత్రం' ద్వారా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. 'తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి అనే తేడా లేకుండా, రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని చూస్తే భరించేది లేదు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమని అవమానిస్తే ఊరుకోం. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు సిద్ధం. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు, తెలంగాణ భవన్ వేదికగా, స్వేద పత్రాన్ని ప్రజల ముందు ఉంచనున్నాం.' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై కమిటీ
మరోవైపు, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా, తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ల సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకొనేందుకు కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.