(Source: Poll of Polls)
Space tour: అంతరిక్షంలోకి అమెజాన్ కింగ్.. 'న్యూ షెపర్డ్' విశేషాలివే
అమెజాన్ తో చరిత్ర సృష్టించిన జెఫ్ బెజోస్.. రోదసీ యాత్రతో మరో రికార్డ్ పై కన్నేశాడు. తన బ్లూ ఆరిజన్ కు చెందిన న్యూ షెపార్డ్ అనే వ్యోమనౌక జులై 20న మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనుంది.
జెఫ్ బెజోస్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. అమెజాన్ వ్యవస్థాపకుడైన బెజోస్ సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్ జులై 20న తొలిసారిగా మానవ సహిత రోదసీ యాత్ర చేపట్టనుంది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన వ్యోమ నౌక న్యూ షెపార్డ్ ఈ రోజు టెక్సాస్ నుంచి నింగికి ఎగరనుంది. జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. ఆ విశేషాలివే.
పది నిమిషాలపాటు ఈ యాత్ర సాగుతుంది. అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా నౌక తిరిగి వస్తుందో? లేదో పరిశీలించేందుకు 15 యాత్రలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసినట్లు మే నెలలో బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. ఈ యాత్ర ద్వారా అంతరిక్ష పర్యాటకానికి అడుగులు పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
రోదసిలోకి తీసుకెళ్లే 'న్యూ షెపర్డ్' వ్యోమనౌక యాత్ర ఆద్యంతం ఒక ప్రణాళిక ప్రకారం సాగుతుంది. పూర్తి స్వయంచాలిత ఈ నౌకకు పునర్‌వినియోగ సామర్థ్యం ఉంది.
ఇదే లక్ష్యం..
రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను బెజోస్ స్థాపించారు. అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, లక్షల మంది పని చేసుకుంటూ, జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూ ఆరిజిన్ ప్రస్తుతం 'న్యూ గ్లెన్' అనే భారీ రాకెట్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌నూ తయారుచేసి, అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చేపట్టే ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.
తొలి రోదసి యాత్ర మినహా రాబోయే రోజులకు సంబంధించిన ఇతర విశేషాలను బ్లూ ఆరిజిన్ సంస్థ పెద్దగా వెల్లడించలేదు. ఈ ఏడాది మరో రెండు యాత్రలను చేపట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. ఈ రోదసియానాలు బాగా రిస్కుతో కూడిన వ్యవహారం అయినందున తొలి యాత్ర ద్వారా పెరిగే ఆదరణపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తరహాలో అంతరిక్ష పర్యాటకం కోసం బుకింగ్‌ను బ్లూ ఆరిజిన్ ఇంకా ప్రారంభించలేదు.
బెజోస్ తో కలిసి..
జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహరించే అవకాశాన్ని 2.80 కోట్ల అమెరికన్ డాలర్లకు బిడ్ దాఖలు చేసి ఒకరు సొంతం చేసుకున్నారు.
అంతరిక్షంలో విహరించే అవకాశం కోసం 159 దేశాలకు చెందిన సుమారు 7500 మంది ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధిక ధరకు బిడ్ దాఖలు చేసిన 20 మంది బిడ్డర్లతో ప్రక్రియ నిర్వహించారు.