Covid Vaccine: హమ్మయ్యా, బూస్టర్ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది- ధర ఎంతంటే?
Covid Vaccine: ప్రపంచంలోనే తొలి ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది.
Covid Vaccine: కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్ 'iNCOVACC' (ఇన్కోవాక్) ధరను భారత్ బయోటెక్ మంగళవారం ప్రకటించింది. ఇది CoWinలో అందుబాటులో ఉంటుంది. దీని ధర ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గా నిర్ణయించింది.
iNCOVACC వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను జనవరి నాలుగో వారంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ బయోటెక్ iNCOVACC.. హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌ల ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి డిసెంబర్ నెల మొదట్లో ఆమోదం పొందింది. ఈ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా ఇవ్వనున్నారు.
Nasal Vaccine ₹ 800 For Private Hospitals, ₹ 325 For Government
— Puja Bhardwaj (@Pbndtv) December 27, 2022
to be rolled out in the 4th week of Jan as booster dose for 18+
iNCOVACC®️ is the world’s first Intranasal vaccine for COVID to receive approval for the primary 2-dose schedule,and as a heterologous booster dose pic.twitter.com/djcNQEcISG
ఇక భయం వద్దు
కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడే వారికి ముక్కు ద్వారా వేసుకొనే ఈ టీకా ఉపశమనం కలిగించనుంది. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ముక్కు ద్వారా వేసే ఈ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో గల భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' కరోనా టీకాను ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ప్రస్తుతం ఈ టీకాను సిరంజీ ద్వారా అందిస్తున్నారు.
ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా వేసుకోవాలి
ఈ వ్యాక్సిన్‌ను పోలియో చుక్కల తరహాలోనే ముక్కు పుటల్లో వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండానే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌తో కరోనాను 99.9 శాతం చంపేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, కెనడా యూకేల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
Also Read: Viral Video: నీటిలో నుంచి ఎగిరి డ్రోన్‌ను పట్టేసిన మొసలి- వైరల్ వీడియో!