Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
Raheja Group investments | విశాఖపట్నంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభానికి కె.రహేజా కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి రహేజా సంస్థ పెట్టుబుడలపై ప్రతిపాదన చేసింది.

Raheja investments in Visakhapatnam | విశాఖపట్నం: విశాఖలో ఇదివరకే గూగుల్, టీసీఎస్ డేటా సెంటర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. పలు కొత్త సంస్థలు, ఐటీ కంపెనీలు నగరానికి వస్తే త్వరలోనే విశాఖ రూపురేఖలో మారనున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ విశాఖలో ఇన్వెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. విశాఖలో త్వరలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు రహేజా సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
ఈ ప్రాజెక్టు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి, ఉత్పాదకత పెరుగుదలకు, అలాగే ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి వీలుంటుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.2,172.26 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. మధురవాడ ఐటీ హిల్ నంబరు-3లో 27.10 ఎకరాలు భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని రహేజా సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొంది.
ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న రహేజా గ్రూప్
విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇటీవల ఢిల్లీలో సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గూగుల్ సంస్థ ఏపీలో ఏకంగా 1.33 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో పలు ఐటీ, దాని అనుబంధ సంస్థలు నగరానికి రాబోతున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుకు ఆఫీసు స్థలాలు కావాలి. ప్రస్తుతం మిలీనియం టవర్ 1, 2లో సుమారు 6 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలకు కేటాయించారు. విశాఖకు కొత్తగా రాబోతున్న కంపెనీలకు కార్యాలయ స్థలాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రహేజా సంస్థ చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఆఫీసు కార్యాలయాల కోసం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి, ఉత్పాదకత పెరుగుదలకు, అలాగే భారీ ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి దోహదపడనుంది.
రహేజా ప్రాజెక్టు పనుల వివరాలు
మొదటి దశలో 2028 నాటికి వాణిజ్య భవనాలను, నివాస సముదాయాలను 2030 నాటికి పూర్తి చేయాలని రహేజా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం రూ.663.42 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు పనులతో 9.59 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.
రెండో దశలో 2031 నాటికి వాణిజ్య భవనాలను, 2035 నాటికి నివాస సముదాయాలను పూర్తిచేసేందుకు రహేజా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో రూ.1,418.84 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తెస్తామని సంస్థ ఏపీ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనల్లో పేర్కొంది.






















