Young India Residential schools: తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ వేగవంతం చేయడంతో పాటు ఎల్ అండ్ టీ నుంచి మెట్రో టేకోవర్ సాధ్యాసాధ్యాలు, ఖర్చు వివరాలపై తెలంగాణ కేబినెట్ గురువారం చర్చించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల అర్హతలపై సైతం మంత్రి మండలి ఫోకస్ చేసింది. రైతులనుంచి మొత్తం ధాన్యం సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 78 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల కాంప్లెక్సులను నిర్మించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది, దీంతో మొత్తం రూ.15,600 కోట్లు ఖర్చు చేయడానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చేందుకు అంగీకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్వారా, సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయానికి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యంగ్ ఇండియా గురుకుల స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణాల ఫైల్ పంపించారు. ఈ నిర్మాణ ప్రతిపాదనల్ని తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదించింది.
ప్రాథమిక పాఠశాలల విస్తరణ
2025-26 ఏడాదికి వెయ్యి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరంలో 250 పాఠశాలల్లో ఈ తరగతులు ప్రారంభించగా, ఈ ఏడాది మరో 210 పాఠశాలల్లో విస్తరించాయి. మొత్తం పాఠశాలల సంఖ్య 460కి చేరుకుంది. అదనంగా పీఎంశ్రీ పథకంలో 112 పాఠశాలలు ఉన్నాయి. ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందనను పొందుతూ, ఎర్లీ చైల్డ్‌హుడ్ విద్యకు పునాదులు వేయడంలో సహాయపడుతున్నాయి.
ఈ పాఠశాలలతో పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక తరగతుల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం స్థానిక సంస్థల పరిధిలో 1,000 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక సెక్షన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఒక్కో పాఠశాలకు సమగ్రశిక్ష ద్వారా మానవ వనరుల కోసం రూ.2 లక్షలు, పిల్లలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు మరొక రూ.1 లక్ష కేటాయించేందుకు మంత్రిమండలి అనుమతించింది. ఈ మొత్తం ఖర్చు రూ.32 కోట్లు అవుతుందని ప్రభుత్వం గుర్తించింది.
నూతన ఎర్త్ యూనివర్సిటీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎర్త్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణకు దివంగత మాజీ ప్రధాని డాక్టర్. మన్మోహన్‌సింగ్ పేరును పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు "డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ" అనే పేరుతో బిల్లును ఆమోదించింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి కొత్త దిశలో దోహదపడనున్నాయి.






















