APPSC Website: నరకం చూపిస్తున్న ఏపీపీఎస్సీ వెబ్ సైట్, ఉద్యోగార్థుల ఆందోళన!
APPSC Website Issues: గ్రూప్-2 దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరిస్తున్నారు. గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ జనవరి-1 నుంచి మొదలవుతుంది.
![APPSC Website: నరకం చూపిస్తున్న ఏపీపీఎస్సీ వెబ్ సైట్, ఉద్యోగార్థుల ఆందోళన! APPSC website getting so many problems while enrolling names and applying for jobs APPSC Website: నరకం చూపిస్తున్న ఏపీపీఎస్సీ వెబ్ సైట్, ఉద్యోగార్థుల ఆందోళన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/2b14e0b7b13137ee3fd58f81ed53f80f1703853087373473_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
APPSC Website Problems: ఎన్నికల ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం రెండు కీలక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో గ్రూప్-2 కి సంబంధించి దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరిస్తున్నారు. గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ జనవరి-1 నుంచి మొదలవుతుంది. అయితే ఈ దరఖాస్తులు అప్ లోడ్ చేసే క్రమంలో ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
OTPR తో సమస్య..
అభ్యర్థులెవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు నింపాలంటే ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో పోటీ పరీక్షలు రాసినవారు ఆల్రడీ ఈ OTPR పూర్తి చేసి ఉంటారు. కొత్తగా అప్లై చేసేవారు వారి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ని తొలిసారి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వర్ స్లో అవుతోంది. ఫొటో, సంతకం అప్ లోడ్ చేసేందుకు కూడా ఎక్కువ సమయం పడుతోంది.
OTPR పూర్తయ్యాక మరో సమస్య..
OTPR పూర్తి చేసిన తర్వాత అసలు అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. ఆ వివరాలను అప్లికేషన్ లో సరిపోల్చుకుంటూ స్థానికత ఖాళీ నింపాల్సి ఉంటుంది. జోన్ పరిధి కూడా ఇక్కడే డిక్లేర్ చేయాలి. వివిధ పోస్ట్ లకు సంబంధించి విద్యార్హతలను కూడా ఇక్కడే పేర్కొంటారు. ఈ తతంగం పూర్తయ్యాక ఫైనల్ గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు కట్టే సమయంలో పదే పదే సర్వర్ స్లో అవుతోంది. ఆన్ లైన్ లో ఫీజు ట్రాన్సాక్షన్ పేజ్ ఓపెన్ అయ్యేలోపు సైట్ స్లో అవడంతో అప్లికేషన్ పూర్తి చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
10నిమిషాల పని.. 3 గంటలైనా ఫలితం లేదు..
వాస్తవానికి OTPR పూర్తిచేసేందుకయినా, ఆ తర్వాత అప్లికేషన్ నింపేందుకయినా 10 నిమిషాల సమయం సరిపోతుంది. అన్ని సర్టిఫికెట్లు మన దగ్గర ఉంటే.. 10 నిమిషాల్లో అప్లికేష్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. కానీ దాదాపు 3 గంటల సమయం పడుతుందని కొంతమంది అభ్యర్థులు చెబుతున్నారు. రాత్రి వేళ రద్దీ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ రాత్రి వెబ్ సైట్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో రాత్రి కూడా సర్వర్ సమస్య తీరడంలేదు. బాగా పొద్దుపోయిన తర్వాత మాత్రమే సర్వర్ దరఖాస్తు నింపడానికి అనుకూలంగా ఉంటోంది.
ఏపీపీఎస్సీపై జోకులు..
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఆలస్యం. అందులో అప్లికేషన్ ప్రాసెస్ మరీ ఆలస్యం అవుతోందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. కొంతమంది బహిరంగంగానే సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ కామెంట్లు చేయడంలేదు. టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందినా ప్రభుత్వానికి సంబంధించిన సర్వర్లు స్పీడ్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన ఏపీపీఎస్సీ సర్వర్ అయినా స్పీడ్ గా ఉండాలి కదా అంటున్నారు.
ఇకనైనా వెబ్ సైట్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందని అంటున్నారు ఉద్యోగార్థులు. గ్రూప్-2 దరఖాస్తుల సమర్పణకు జనవరి 10 చివరి తేదీ. దీంతో చివరి రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశముంటుందనే అంచనా ఉంది. ఇకనైనా అధికారులు ఈ సమస్యకి పరిష్కారం చూపించాలంటున్నారు నిరుద్యోగులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)