(Source: Poll of Polls)
Annamalai vs Tamilisai: తమిళనాడులో అన్నామలైతో క్లాష్, ఏపీలో అమిత్ షా క్లాస్ - తమిళసై చుట్టూ నడుస్తున్న వివాదమిదే
Annamalai vs Tamilisai: తమిళనాడులో అన్నామలై వర్సెస్ తమిళసై సౌందర రాజన్ విభేదాలు హైకమాండ్‌కి కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి.
Annamalai vs Tamilisai Controversy: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది బీజేపీ. కానీ ఓట్ల శాతం మాత్రం పెంచుకోగలిగింది. విజయం సాధించలేకపోయినా భవిష్యత్‌లో ఉనికి నిలుపుకునేందుకు ఈ మాత్రం చాలని భావిస్తోంది కాషాయ దళం. ఈ ఓటు శాతం పెంచుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్టేట్ చీఫ్ అన్నామలైకి పిలిచి మరీ కేంద్ర కేబినెట్‌లో అవకాశమిచ్చారు మోదీ. ఇదంతా జరుగుతుండగానే అక్కడ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితాల తరవాత రాష్ట్ర బీజేపీ వర్గంలో చిచ్చు మొదలైంది. తమిళనాడు గవర్నర్ పదవికి రాజీనామా చేసి అక్కడ సౌత్ చెన్నై నుంచి పోటీ చేశారు తమిళసై సౌందరరాజన్. కానీ ఓటమి చవి చూశారు. ఆమెకి, అన్నామలైకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్ట్‌లూ పెడుతున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా గతంలో పని చేశారు తమిళసై. ఆ తరవాత ఆమెని తెలంగాణ గవర్నర్‌గా పంపారు. అయితే...ఇప్పుడు అన్నామలైకి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండడం సౌందరరాజన్‌కి నచ్చడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి సౌందర రాజన్ వర్గానికి, అన్నామలై వర్గానికి మధ్య వాగ్వాదం మొదలైంది.
సీనియర్ వర్సెస్ జూనియర్
సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నేతలు "పార్టీ బలం పుంజుకుంటున్నప్పుడు ఇవన్నీ సహజమే" అని కొట్టి పారేస్తున్నా..గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే మాత్రం ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలు బయటకు పొక్కడంపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎప్పటి నుంచో తమిళనాడు బీజేపీలో ఉంటున్న సీనియర్ నేతలు నిన్న గాక మొన్న వచ్చిన అన్నామలైకి అంత ప్రాధాన్యత దక్కడాన్ని సహించలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. సీనియర్ నేత అయిన సౌందరరాజన్‌కి అన్నామలై ఆదేశాలు ఇవ్వడం, సూచనలు చేయడమేంటన్న అసహనమూ అంతర్గతంగా మొదలైంది. పార్టీ ఓటమికి అన్నామలై కారణమంటూ సౌందరరాజన్ వర్గం ఆరోపిస్తోంది. కాకపోతే..ఇది సోషల్ మీడియాకి ఎక్కడం వల్ల అదో రచ్చగా మారింది. ఇక AIDMKతో కలిసి వెళ్లుంటే బీజేపీకి సీట్లు వచ్చేవని సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. AIDMKతో తెగదెంపులు చేసుకోవడానికి కారణం అన్నామలై అని సౌందరరాజన్ వర్గం ఆరోపిస్తోంది. అంతకు ముందు ఎల్ మురగన్, తమిళసై సౌందరరాజన్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని కొందరు నేతలు తేల్చి చెబుతున్నారు. AIDMKతో బీజేపీ వెళ్లుంటే DMK ఆ స్థాయిలో సీట్లు సాధించి ఉండేది కాదని అన్న నేతలకు సౌందరరాజన్ మద్దతు పలుకుతున్నారు.
అంతే కాదు. అన్నామలై హైకమాండ్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. ఓటు శాతాన్ని డబుల్ డిజిట్‌కి పెంచుకోగలిగినా కనీసం 14%కి పైగా వచ్చే అవకాశముందని, అన్నామలై వల్లే అది తగ్గిపోయిందని వాదిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌందరరాజన్ పరోక్షంగా అన్నామలైపై విమర్శలు చేయడమూ దుమారం రేపింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి సౌందర రాజన్ కూడా వచ్చారు. అమిత్ షా వేదికపైనే సౌందర రాజన్ పిలిచి మరీ మందలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నామలైపై విమర్శలు చేయడంపై ఆమెని మందలించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తమిళనాడు బీజేపీలో లుకలుకలు మొదలైనట్టు మాత్రం స్పష్టమవుతోంది. మరి ఈ సమస్యని హైకమాండ్ ఎలా దాటుతుందో చూడాలి.
Also Read: Kuwait Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఐదుగురు భారతీయులు సహా 35 మంది మృతి