సీఎంని బాంబు పెట్టి చంపేస్తా, కాల్ చేసి బెదిరించిన యువకుడు - అరెస్ట్
Ankit Mishra Arrested: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌ను చంపేస్తానంటూ కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ankit Mishra Arrested:
బిహార్ సీఎంకి బెదిరింపులు..
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. 36 గంటల్లో బాంబు దాడి చేసి సీఎంను చంపేస్తానంటూ బెదిరించాడో గుర్తు తెలియని వ్యక్తి. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. బిహార్ పోలీసులతో పాటు సూరత్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కూడా గాలించింది. చివరకు సూరత్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు ఆ నిందితుడు. లస్కానా ప్రాంతంలో అరెస్ట్ చేసి..బిహార్ పోలీసులకు అప్పగించారు. అయితే...ఆ నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా...అక్కడి నుంచి పరిగెత్తాడు. ఫలితంగా పూర్తి వివరాలు బయటకు రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం...నిందితుడి పేరు అంకిత్ మిశ్రా. ఈ 28 ఏళ్ల యువకుడు మార్చి 20న ఓ మీడియా ఛానల్‌కు కాల్ చేశాడు. 36 గంటల్లో సీఎం నితీష్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఆ న్యూస్ ఛానల్ వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించింది. ప్రస్తుతం బిహార్ పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. పట్నా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఎందుకు ఈ పని చేశాడన్నది మాత్రం ఇంకా తేలలేదు.
రాజకీయ వేడి...
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు విషయమై మరోసారి స్పష్టతనిచ్చారు. చావడానికై సిద్ధం కానీ...బీజేపీతో కలిసి పోటీ చేసేది మాత్రం లేదని తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు పట్నాకు వచ్చిన నితీష్‌పై మీడియా పలు ప్రశ్నలు సంధించింది.
"ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు ఆ ప్రశ్నే వద్దు. చనిపోవడానికైనా వెనకాడం. కానీ...వాళ్లతో మాత్రం కలిసి ముందడుగు వేసేదే లేదు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయో తెలీదు"
-నితీష్ కుమార్, బిహార్ సీఎం
అటు బీజేపీ కూడా జేడీయూతో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని వెల్లడించింది. పొరపాటున కూడా అది జరగదని తేల్చి చెప్పింది. మైనార్టీ ఓటు బ్యాంకుపైనా నితీష్ కుమార్ స్పందించారు. బీజేపీ మాటల దాడి చేశారు. మైనార్టీల ఓట్లను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని, కలిసి పోటీ చేసినప్పుడు తమ ఓటు బ్యాంకుతోనే కాషాయ పార్టీ గెలిచిందని వెల్లడించారు. వాజ్‌పేయీ, అడ్వాణి నాటి బీజేపీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పుడు ఆ పార్టీ రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. బిహార్ ఊహించని ప్రగతిని సాధించిందని నితీష్ కుమార్ ఇటీవలే ఓ కార్యక్రమంలో అన్నారు. తమ చిరకాల డిమాండ్ ప్రత్యేక హోదా తిరస్కరణకు గురైన తర్వాత కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉన్న వనరులతోనే అభివృద్ధి చేసుకుంటు న్నామన్నారు. వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాల పురోగతి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమంలో RSS పోరాటం చేయలేదని, దేశానికి స్వతంత్రం లభించడంలో ఆ సంస్థ చేసిన కృషి ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలే విమర్శించారు.
Also Read: TikTok Ban: ఉద్యోగులకు BBC కీలక ఆదేశాలు, టిక్‌టాక్ యాప్ వాడొద్దని వార్నింగ్