Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Background
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. అధినాయకత్వంతో వరుస సమావేశాలు అవుతున్నారు. తన జట్టు ఎంపికపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ సీంపై సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని సూచించారు.
మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పెద్దలు కొందరు హైదరాబాద్ కు వచ్చి సీఎల్పీ నేతని ప్రకటించి సీఎంపై స్పష్టత ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎల్లా హోటల్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేసులో తామూ ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం పట్టు వీడలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ కొత్త సీఎంపై సస్పెన్స్ వీడింది.
తెలంగాణలో కాంగ్రెస్ ను కచ్చితంగా గెలిపిస్తానని హైకమాండ్ కు మాటిచ్చారు, అలాగే పార్టీని గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించారు రేవంత్ రెడ్డి. పార్టీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలున్నప్పటికీ, తన వాక్ చాతుర్యం, ప్రశ్నించేతత్వంతో పాటు సీనియర్లను కలుపుకునిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మరోసారి ఊపిరిపోశారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి నేతలను వెనక్కినెట్టి మరీ అధిష్టానంతో మా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించేలా చేసుకున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితం కాగా, ఎంఐఎం 7 సీట్లు, కాస్త పుంజుకున్న బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో విజయం సాధించింది. డిసెంబర్ 3న తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించి ఎట్టకేలకు తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
విద్యార్థి నేతగా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న రేవంత్ కు తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలతో అనుబంధం ఉంది. విద్యార్థిగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001-2002 మధ్య కాలంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2004లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2007లోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి చురుకుదనం, వాగ్దాటి చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్... కాంగ్రెస్ నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. ఆపై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 అక్టోబర్ 31న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. ఆరేళ్లకు సీఎం అయ్యారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, కేసీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం వెళ్తోంది. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కి కూడా ఆహ్వానం అందింది.
పార్లమెంట్ వద్దకు రేవంత్ రెడ్డి- సెల్ఫీలకు ఎగబడ్డ ఎంపీలు
తెలంగాణ సీఎంగా రేవంత్ ఎంపిక కావడంతో ఆయన అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. అనంతరం పార్లమెంట్‌కు వచ్చారు. అక్కడ తన సహచర ఎంపీలు ఆయనతో కలిసి మాట్లాడారు. కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
#WATCH | Delhi | Telangana CM-designate Revanth Reddy arrives at the Parliament.
— ANI (@ANI) December 6, 2023
The Congress MP from Malkajgiri is expected to tender his resignation as a Member of the Parliament, ahead of his swearing-in ceremony in Hyderabad tomorrow. pic.twitter.com/5Kllvj5fHx
సోనియా గాంధీతో ముగిసిన రేవంత్ సమావేశం
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తనకు సీఎంగా పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పారు. రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు.
7న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు - 11 నుంచి జిల్లాల పర్యటనలు
ఈనెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం వచ్చిన ఆయన 11 వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఈ నెల 11న శ్రీకాకుళంలో పర్యటిస్తారు. అనంతరం 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో చంద్రబాబు టూర్ ఉంటుంది.