(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు- సభ రేపటికి వాయిదా
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
LIVE
Background
దాదాపు ౩ దశాబ్దాలుగాా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ (సెప్టెంబర్ 19) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు సభలో ఆమోదం లభించి చట్టంగా మారితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని ప్రతిపాదిస్తుంది. దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీనిని లోక్ సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఆ సమయంలో బిల్లు రద్దు అయింది. ఆ తర్వాత్ 1999, 2002, 2003 లో ఈ బిల్లును తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మద్దతు లభించలేదు. యూపీఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగా లోక్‌సభలో మాత్రం పరిశీలనకు తీసుకోలేదు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలిరోజే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది ఈ బిల్లు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకావానికి ముందు రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష కూటమికి చెందిన పార్టీల నుంచి ఈ బిల్లుకు మద్దతు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును... ఐదు రోజుల ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వ అజెండా జాబితాలో చేర్చనప్పటికీ... తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లాప్ కాలేదు. దీంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడమే మిగిలింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?
దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు కలిగి ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్ర్యం సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదిస్తుంది. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనికి ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు సభ ఆమోదం పొందలేదు. లోక్‌సభలో బిల్లు రద్దయ్యింది. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అప్పుడూ బిల్లు పాస్ కాలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ-1 హయాంలో రాజ్యసభ ఆమోదం పొందినా.. లోక్ సభ పరిశీలనకు తీసుకోలేదు.
పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ఎంత?
17వ లోక్‌సభలో ఇప్పటివరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2022లో ప్రభుత్వ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో, పురుషుల భాగస్వామ్యం కంటే 67.18 శాతం మహిళా ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్నాక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రెండు రోజుల్లో తీర్పు వెల్లడించనున్న హైకోర్టు. చంద్రబాబు రిమాండ్ స్కాష్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 21 కి వాయిదా.
రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2010లోనే రాజ్యసభ ఆమోదించిందని, ఈ బిల్లులో తమకు క్రెడిట్ దక్కుతుందన్నారు మల్లికార్జున ఖర్గే.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు
కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ ఈ బిల్లుకు నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు.
'మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారు, కానీ దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు'
కొత్త పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, కానీ దేవుడు నన్ను అనేక పవిత్ర పనులకు ఎంపిక చేశాడని అన్నారు.
మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు: మోదీ
మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదున్నారు ప్రధానమంత్రి మోదీ. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి మోదీ కృతజ్ఞత తెలిపారు.