Breaking News Live Telugu Updates: యువగళం ముగింపు సభకు పవన్ దూరం- టీడీపీకి సమాచారం ఇచ్చిన జనసేనాని
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Background
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేశారు.
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీలుగా నమోదైంది. 72 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రం మీద ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య లేదా తూర్పు గాలులు వీయనున్నట్లు తెలిపారు.
దక్షిణ కోస్తా ఆంధ్రలో నేడు రేపు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని.. ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.
యువగళం ముగింపు సభకు పవన్ దూరం- టీడీపీకి సమాచారం ఇచ్చిన జనసేనాని
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ప్రస్తుతం చేస్తున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ 20న జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరవుతారని ముందుగా ప్రకటించారు. ఈ సభకు హాజరుకావాలని పవన్‌ను ఆహ్వానించారు టీడీపీ నేతలు. అయితే తాను ఈ సభకు హాజరుకాలేనని వారికి పవన్ చెప్పేశారు.
తెలంగాణ నీటిని ఏపీ తరలించుకుపోతోంది- అసెంబ్లీలో జీవన్‌రెడ్డి ఆరోపణలు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాదిరిగానే తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో సీరియస్‌గా వ్యవహరించలేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపై అలా వద్దని... రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా సీరియస్‌గా దృష్టి పెట్టాలని సూచించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేక మద్దతు తెలిపారు. అనంతరం చర్చ మొదలైంది.
ఏపీలో ఐదో రోజుకు చేరిన అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె
అంగన్‌వాడీలతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బందిని శాంతింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు వలంటీర్లతో సెంటర్లు తెరిపిస్తూనే అంగన్‌వాడీ సిబ్బందితో చర్చలు జరుపుతోంది. శుక్రవారం జరిగిన మూడో విడత చర్చలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.
అంగన్‌వాడీ సిబ్బంది పట్టువీడటం లేదు. ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. దీంతో సమ్మె కొనసాగుతోందని అంగన్‌వాడీ యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వాళ్లు ప్రతిపాధించిన చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. కానీ జీతాల విషయంలో మాత్రం హామీ ఇవ్వడం లేదు. దీంతో సమ్మె విరమణకు అంగన్‌వాడీ సిబ్బంది సుముఖత చూపడం లేదు.