AP Politics: చంద్రబాబుకు అంత సీన్ లేదు, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చెయ్: మంత్రి అంబటి
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా తన హయాంలో ప్రజలకు మేలు చేసి ఉంటే.. రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు అని టీడీపీ అధినేతను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తాడేపల్లి: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా తన హయాంలో ప్రజలకు మేలు చేసి ఉంటే.. రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు అని టీడీపీ అధినేతను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దశాబ్దంన్నర కాలం సీఎంగా చేసినా సొంతంగా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఎందుకు లేవో ప్రజలకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చెప్పుకోలేక, పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగే నేత అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. మీరు ఎందుకు జనసేన, పవన్‌కళ్యాణ్‌ను వెంట బెట్టుకుని రావాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు..
151 సీట్లలో అభ్యర్థుల్ని మార్చినా వైసీపీ గెలవదని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. అయితే మా సవాల్ స్వీకరించి దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సొంతంగా పోటీ చేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం లేవు కానీ, పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ దిగజారిపోతున్నారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి, ఆధారాలతో దొరికి చంద్రబాబు జైలుకెళ్లాడని ఆరోపించారు. 53 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఆయన రోగాల వల్లనో హెల్త్‌గ్రౌండ్ వల్లనో బెయిల్ పొంది బయటకొచ్చారు. ఆ తర్వాత పలు దేవాలయాల్లో మొక్కులు తీర్చుకుని.. ఇప్పుడు పక్కా రాజకీయాలు చేస్తున్నారు. మీరు జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు, కానీ మేం మా పార్టీలో సీట్ల సర్దుబాటు చేయడాన్ని తప్పుపట్టడం సబబు కాదన్నారు.
రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేస్తాం
వైసీపీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే అంతర్గతంగా కొన్ని సీట్లు మార్చుకుంటున్నాం. కొందరు సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వడం లేదు. కొంతమందిని వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తున్నాము. అన్ని సీట్లు నెగ్గడం మాత్రమే కాదు.. టీడీపీ, జనసేనను తుక్కుతుక్కుగా ఓడించి.. మీ రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేయడమే తమ వ్యూహం అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాయి. 50శాతానికి మించి ప్రజలు జగనే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు.
చంద్రగిరి నుంచి ఎందుకు పారిపోయావ్?
వైసీపీలో అభ్యర్థుల స్థానాల మార్పు పక్కనపెడితే.. రాజకీయంగా చంద్రబాబు ఆరంగేట్రం చేసింది కాంగ్రెస్ పార్టీలో.. అప్పుడు చంద్రగిరిలో పోటీచేసి గెలిచి మంత్రయ్యారు. ఎన్టీ రామారావు 1983లో టీడీపీ పార్టీ పెడితే చంద్రగిరిలో తుక్కు తుక్కుగా ఓడిపోయి.. కుప్పంకు వెళ్లడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు కుప్పం నుంచి పోటీ చేస్తారో.. లేదంటే, మరో చోట పోటీ చేస్తారో చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు.
మీది రాయలసీమ చిత్తూరు ప్రాంతం. మీ అబ్బాయి లోకేశ్‌ను మంగళగిరిలో పోటీకెందుకు నిలబెట్టావ్..? వైసీపీలో సీట్ల మార్పు తప్పయితే, మీరు సంబంధంలేని మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ స్వగ్రామం గుడివాడ కదా..? ఆయనెందుకు హిందూపురంలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు బావమరిది హరికృష్ణ అమ్మాయి కూకట్‌పల్లిలో ఎందుకు పోటీ చేశారు. మీ వదిన పురందేశ్వరి నియోజకవర్గమేంటో చెప్పాలంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మీ ఫ్యామిలీ ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు, కానీ వైసీపీ నేతలు వేరే చోట పోటీ చేస్తే ఎందుకు అంత కడుపు మంట అన్నారు.