All Party Meeting: మోదీతో ప్రత్యేక భేటీ ఏం లేదు: సీఎం మమతా బెనర్జీ
All Party Meeting: దిల్లీ పర్యటనలో ఉన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ప్రత్యేక భేటీ ఏమీ లేదని స్పష్టం చేశారు.
All Party Meeting: తన దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశం ఏమీ లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. భారత్.. జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విడుదల చేసిన లోగోలో కమలం పువ్వు వాడటంపై మమతా బెనర్జీ విమర్శలు చేశారు.
ఎలక్షన్ కమిషన్‌పై
గుజరాత్ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ర్యాలీలు నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.
మమతా బెనర్జీ మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్, పుష్కర్ దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. సోమవారం జీ20 సమావేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా దీదీ.. దిల్లీ చేరుకున్నారు.
అఖిల పక్ష భేటీ
జీ20 అధ్యక్ష బాధ్యతలను 2022 డిసెంబరు 1న భారత్ స్వీకరించింది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ 20 సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తే బావుంటుందని చర్చించడానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను.. కేంద్రం.. దిల్లీకి ఆహ్వానించింది. భాజపా అధ్యక్షుడు జే పీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బిజు జనతా దళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ సహా ఇతర పార్టీల అధ్యక్షులు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి హాజరు కానున్నారు.
Also Read: Elon Musk On Trump: 'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్