Air India: ఒకేసారి అన్ని విమానాలు కొంటున్నారా, ఎయిర్ ఇండియా డీల్ వాల్యూ ఎంతో తెలుసా
ఎయిర్ ఇండియా 300 ఎయిర్ బస్ జెట్‌లను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. బోయింగ్‌ల డామినేషన్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
300 విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందా..?
టాటా గ్రూప్ గూటికి చేరుకున్నాక ఎయిర్ ఇండియాలో సంస్కరణలు మొదలయ్యాయి. నష్టాల బాటలో ఉన్న సంస్థను తిరిగి దక్కించుకుంది టాటా గ్రూప్. ప్రస్తుతానికి విమానాల సంఖ్యను పెంచుకునే పనిలో పడింది. 300 వరకూ నారో బాడీ జెట్స్‌ని కొనుగోలు చేయనుందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో విమానాలు కొనుగోలు చేయటం ఇదే తొలిసారి అని తెలిపింది. ఎయిర్‌బస్ A320నియో ఫ్యామిలీ జెట్స్ ని కొనే అవకాశాలున్నాయని పేర్కొంది. వీటి కొనుగోలు విలువ దాదాపు 40.5 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది. అయితే డిస్కౌంట్‌లు పోను ఎంత ఖర్చు అవుతుందన్నది తెలియాల్సి ఉంది.
బోయింగ్‌ల ఆధిపత్యం తగ్గించేందుకే..
విమానయాన రంగంలో ఎయిర్‌బస్‌లు, బోయింగ్‌లకూ ఎప్పుడూ పోటీ వాతావరణమే ఉంటుంది. ఎయిర్ ఇండియా పెద్ద ఎత్తున ఎయిర్ బస్‌లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా బోయింగ్‌ల డామినేషన్‌ని తగ్గించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. నిజానికి కరోనాకు ముందు పౌర విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. కానీ కొవిడ్ తరవాత పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ రంగానికి పునర్వైభవం రావాలంటే మార్పులు చేర్పులు చేయక తప్పదని భావిస్తోంది ఎయిర్ ఇండియా. అందుకే అంత పెద్ద డీల్‌కి సిద్ధమైంది.
పోటీ తట్టుకుని నిలబడేదెలా..
నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేయటం ఇదే మొదటి సారి కాదు. ఇండిగో, విస్తారా, గో ఎయిర్‌లైన్స్ ఇండియా, ఎయిర్ ఏసియా లాంటి సంస్థలు వీటినే వినియోగిస్తున్నాయి. ఇండిగో 700కిపైగా ఆర్డర్ పెట్టి, వాటినే నడుపుతోంది. ఐరోపా సంస్థ ఈ నారో బాడీ క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇక ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసిన 300 విమానాలు అందుబాటులోకి రావాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. ఎయిర్ బస్ నెలలో 50 విమానాలు తయారు చేస్తుంది. అయితే ప్రస్తుత ఆర్డర్ నేపథ్యంలో ఈ సంఖ్యను 2023 నాటికి 65కి పెంచాలని చూస్తోంది. 2025 నాటికి నెలవారీ సంఖ్యను 75కి పెంచుతామని అంటోంది ఎయిర్‌బస్. ఈ డీల్‌కి సంబంధించి ఎయిర్ బస్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అంశంపై ఆరా తీసేందుకు ప్రయత్నించినా..అంతర్గత వ్యవహారాలను అలా బయటపెట్టటం సరికాదని తేల్చి చెప్పారు ఎయిర్ బస్ ప్రతినిధులు. అంతర్జాతీయ సర్వీసులనూ నడుపుతున్నప్పటికీ ల్యాండింగ్ స్పేస్ విషయంలో ఎయిర్ ఇండియాకు సమస్యలు తప్పటం లేదు. పైగా పలు అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ భారత్‌కు నాన్‌స్టాప్ విమానాలు నడుపుతుండటం వల్ల ఎయిర్ ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతోంది.