Andhra News: దుప్పటికి చలి మంటలంటుకొని వ్యక్తి సజీవ దహనం - వివాహేతర సంబంధంతో ఇద్దరు, ఏపీలో విషాద ఘటనలు
AP News: ఏపీలో వరుస ఘటనల్లో ఓ చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చలి మంట అంటుకుని ఓ వృద్ధుడు, పాముకాటుకు చిన్నారి, వివాహేతర సంబంధంతో ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Man Burnt Alive in Vizianagaram: ఏపీలో శుక్ర, శనివారాల్లో కొన్ని విషాద ఘటనలు కలకలం రేపాయి. విజయనగరం (Vijayanagaram) జిల్లాలో ఓ వ్యక్తి చలి మంటలు దుప్పటికి అంటుకొని సజీవదహనం కాగా, కర్నూలు (Kurnool) జిల్లాలో వివాహేతర సంబంధం ఓ ఇద్దరి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్టీఆర్ (NTR) జిల్లాలో ఓ చిన్నారికి పాముకాటుకు బలవ్వగా, కడప జిల్లా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
వ్యక్తి సజీవదహనం
విజయనగరం జిల్లా వేపాడ (Vepada) మండలంలోని బొద్దాం గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదం జరిగింది. చలి కాచుకునేందుకు మంటలు వేసుకోగా దాని నుంచి నిప్పురవ్వలు ఎగిసి పశువుల పాక దగ్ధమైంది. ఈ క్రమంలో పాకలో నిద్రిస్తోన్న తిమ్మ నాగమయ్య (75), అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. అనారోగ్యంతో మంచం పట్టిన వృద్ధుడు, చలి కాచుకునేందుకు కుంపటి పెట్టగా, మంటలు అంటుకుని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధంతో ఇద్దరు
కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో (Nandikotkuru) శనివారం ఉదయం దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి సదరు మహిళను హతమార్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ (35) ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. తని ఇంటికి సమీపంలో నివాసం ఉండే రుక్సానా (45) అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రుక్సానా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శుక్రవారం విజయ్ కుమార్, రుక్సానాతో కలిసి కర్నూలులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం వరకూ ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది, తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విజయ్ కుమార్, రుక్సానాను కత్తితో పొడిచి చంపి, అనంతరం అతను విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుతో బాలుడు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) మండలం పాతకంచలకు చెందిన ఓ మూడున్నరేళ్ల బాలుడు పాముకాటుకు బలయ్యాడు. గ్రామానికి చెందిన నాగకృష్ణ, మౌనిక దంపతుల కుమారుడు చైతన్ ఇంట్లో ఆడుకుంటుండగా, తాచుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకూ ఇంట్లో ఆడుకుంటూ సందడి చేస్తున్న బాలుడు, విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
రోడ్డు ప్రమాదంలో
కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం వద్ద ఓ పెళ్లి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. మృతుడు కొండాపురం మండలం ముచ్చుమర్రికి చెందిన కొండు నాగసుబ్బారెడ్డిగా గుర్తించారు. బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.