Miss Universe Buenos Aires: 60 ఏళ్ల అందానికి మిస్ యూనివర్స్ కిరీటం దాసోహం - చరిత్రలో ఇదే తొలిసారి
Miss Universe: అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని ఆ కిరీటాన్ని దక్కించుకున్నారు.
Miss Universe Alejandra Marisa: అందాల పోటీలో పాల్గొనడానికీ పనికొస్తానా..అని అనుకోలేదు. ఈ వయసులో ఈ పనేంటని వెనక్కి తగ్గలేదు. పోటీ చేసింది. కిరీటాన్ని సాధించింది. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ (Alejandra Marisa Rodriguez) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో (Miss Universe Buenos Aires) పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ (Buenos Aires)లో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసు 60 ఏళ్లే అయినా చూడడానికి మాత్రం చాలా యంగ్‌గా ఉన్నారామె. ఇప్పటి వరకూ జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఇదే ఎంతో అరుదైందిగా చరిత్ర సృష్టించింది. ఆమెకి వ్యక్తిగతంగానూ పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అలెజండ్రా పేరు మారు మోగుతోంది. "ఈ వయసులోనూ ఎంత అందంగా ఉన్నారో" అని అందరూ తెగ పొగిడేస్తున్నారు. లా పల్టా నగరానికి చెందిన అలెజండ్రా ఓ జర్నలిస్ట్, న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో అందాల పోటీపైనా దృష్టి పెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న స్టీరియోటైప్ ఆలోచనలను చెరిపేస్తూ ధైర్యంగా ముందుకొచ్చి పోటీ చేశారు. ఈ వయసులో ఈ కిరీటాన్ని దక్కించుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె ర్యాంప్‌పై నడుస్తుంటే ప్రేక్షకులతో పాటు జడ్జ్‌లూ ఆశ్చర్యపోయారు.
View this post on Instagram
రికార్డులన్నీ బద్దలు..
ఈ అందాల పోటీలో పాల్గొనే ముందు ఆమె ఎలాంటి కసరత్తు చేశారో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో Miss Universe World పోటీలు జరగనున్నాయి. అందులోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అలెజండ్రా మరిసా. మహిళలంటే కేవలం శారీరక అందం మాత్రమే కాదని,అంతకు మించి అని నిరూపించడానికే ఈ పోటీల్లో పాల్గొన్నట్టు ఆమె చెబుతున్నారు. ఈ పోటీలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని అంటున్నారు. అయితే... అలెజండ్రా ఈ పోటీల్లో పాల్గొనడానికి మరో కారణం కూడా ఉంది. గతేడాది Miss Universe organization కీలక ప్రకటన చేసింది. ఇకపై ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఎలాంటి వయసు పరిమితి విధించడం లేదని వెల్లడించింది. 18 ఏళ్లుపై బడిన వాళ్లు ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చని తెలిపింది. ఈ ప్రకటన చేసిన తరవాతే అలెజండ్రా పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ ఈ కిరీటం దక్కించుకున్న వాళ్లలో 18-28 ఏళ్ల వయసున్న వాళ్లే ఉన్నారు. ఈ రికార్డునీ చెరిపేశారు అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసీ.
Also Read: Brain Size: మనిషి మెదడు పరిమాణం పెరుగుతోందట, ఆ రోగులకు ఇది శుభవార్త? స్టడీలో ఏం తేలింది?