2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్లపై BBC డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
2002 Gujarat Riots BBC Documentary:
ప్రధాని మోడీపై డాక్యుమెంటరీ..
గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై చిత్రీకరించిన BBC డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఫిబ్రవరి 6వ తేదీన విచారణ జరుపుతామని వెల్లడించింది. అడ్వకేట్ ఎమ్‌ఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. ఈ ఏడాది జనవరి 21న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ BBC డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్డర్‌ను సవాలు చేస్తూ ఎమ్‌ఎల్ శర్మ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. BBC డాక్యుమెంటరీలోని రెండు భాగాలనూ పరిశీలించాలని కోర్టుని కోరారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిగారు. గుజరాత్ అల్లర్లపై నిజానిజాలు తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 19 (1) (2) ప్రకారం ఆ హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులతో కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛనూ అణిచివేయాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు ఎమ్‌ఎల్ శర్మ. ఆ డాక్యుమెంటరీలో ఎన్నో నిజాలు ఉండొచ్చని, అవే సాక్ష్యాధారాలుగానూ మారే అవకాశముందని అన్నారు. ఈ విషయాలు వెలుగులోకి వస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. జనవరి 21న కేంద్రం " India: The Modi Question"పేరిట ఉన్న యూట్యూబ్ వీడియోలు, ట్విటర్ వీడియోలను బ్లాక్ చేయాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ట్విటర్‌తో పాటు మరి ఏ సామాజిక మాధ్యమాల్లోనూ ఆ వీడియోలు లేకుండా నిషేధం విధించింది.
మోడీకి క్లీన్ చిట్..
2002లో గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీలు దగ్ధమై.. 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం.. గుజరాత్లో మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్ మోదీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే..దీన్ని సవాలు చేస్తూ గతేడాది జూన్‌లో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి సిట్ ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఈ పిటిషన్ వేశారు. అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఆ తరవాత గతేడాది జూన్‌లో తీర్పును వెలువరించింది. సిట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలనే సుప్రీం సమర్థించింది.
Also Read: Pravin Togadia: జనాభా నియంత్రణ లేకపోతే అయోధ్య రామ మందిరానికి భద్రత ఉండదు - హిందూ నేత సంచలన వ్యాఖ్యలు