Pravin Togadia: జనాభా నియంత్రణ లేకపోతే అయోధ్య రామ మందిరానికి భద్రత ఉండదు - హిందూ నేత సంచలన వ్యాఖ్యలు
Pravin Togadia: జనాభాను నియంత్రించకపోతే రామ మందిరానికి భద్రత ఉండదని హిందూ నేత ప్రవీణ్ తోగాడియా అన్నారు.
Pravin Togadia on Ram Mandir:
తోగాడియా కామెంట్స్..
అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాను నియంత్రించకపోతే...ఓ 50 ఏళ్ల తరవాత అయోధ్య రామ మందిరం కనిపించకుండా పోతుందని అన్నారు. అందుకే దేశంలో జనాభా నియంత్రణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేసిన తోగాడియా..
రామ మందిర నిర్మాణానికి హిందువులందరూ ఏకమయ్యారని అన్నారు. గ్రామగ్రామానికి తిరుగుతూ ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించారని తెలిపారు. హిందువుల ఐక్యతకు, భద్రతకు ఇదో మంచి పరిణామమని చెప్పారు. ఇదే సమయంలో జ్ఞానవాపి మసీదు అంశంపైనా వ్యాఖ్యలు చేశారు తోగాడియా. ఆ మసీదులో ఆలయం ఉందన్న నిజం నిర్ధరణ అయిందని తేల్చి చెప్పారు. విశ్వనాథ్ బాబా
ఆ మసీదులో కొలువు దీరారని, అందులో శివలింగాన్ని పూజించకపోతే పాపం చుట్టుకుంటుందని హెచ్చరించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి శివలింగానికి పూజలు జరిపించే విధంగా అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. "బుల్‌డోజర్లు శాంతికి, అభివృద్ధికి ప్రతీకలు" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల్నీ తోగాడియా సమర్థించారు. వాటితో పాటు కత్తులు, మిజైల్స్ కూడా
శాంతికి చిహ్నమే అంటూ తేల్చి చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్ వ్యాఖ్యలు..
RSS లీడర్ దత్తాత్రేయ హోసబేల్ మత మార్పిడి, జనాభాపై చేసిన కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. "ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడి పెరిగిపోతోంది. అందుకే..హిందువుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీనికి పరిణామాలు మనమంతా అనుభవిస్తున్నాం. మతమార్పిడి అనేది పెద్ద కుట్ర. కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని ఈశాన్య ప్రాంతాల్లోకి కొందరు అక్రమంగా చొరబడుతున్నారు.
ఇది కూడా మన జనాభాపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి ఈ చొరబాటుని అడ్డుకునే చర్యలు చేపడుతున్నా..మిగతా రాష్ట్రాల్లోనూ ఇది కనిపిస్తోంది. బిహార్ సహా పలు రాష్ట్రాల్లో సామాజికంగా సమస్యలు తలెత్తుతున్నాయి" అని వ్యాఖ్యానించారు దత్తాత్రేయ. మతమార్పిడిపై దృష్టి సారించి "anti-conversion" చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. నాలుగు రోజుల ఆల్ ఇండియా RSS మీటింగ్‌లో పాల్గొన్న ఆయన...ఈ కామెంట్స్ చేశారు. మత మార్పిడిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను RSS ఎప్పటి నుంచో చేస్తోందని గుర్తు చేశారు. "Ghar Wapsi" ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, చాలా మంది మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశారని చెప్పారు.
మత మార్పిడితోనే హిందూ జనాభాపై ప్రభావం పడుతోందనుకుంటే...అక్రమంగా దేశంలోకి చొచ్చుకుని వస్తున్న వాళ్లతోనూ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు దత్తాత్రేయ. "జనాభా అసమతుల్యత" కు కారణమవుతోందని వెల్లడించారు. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్ వర్తించకుండా నిబంధన తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోహన్ భగవత్ కూడా జనాభాపై కామెంట్స్ చేశారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు.