Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Vadhuvu Web Series Review In Telugu: అవికా గోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'వధువు'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.
పోలూరు కృష్ణ
అవికా గోర్, నందు, అలీ రెజా తదితరులు
Vadhuvu Web Series Review
వెబ్ సిరీస్ రివ్యూ: వధువు
రేటింగ్: 2.75/5
నటీనటులు: అవికా గోర్, నందు, అలీ రెజా, రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం: రామ్ కె మహేశ్
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు: శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని
దర్శకత్వం: పోలూరు కృష్ణ
విడుదల తేదీ: డిసెంబర్ 8, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
Avika Gor and Nandu's Vadhuvu Web Series Review: 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా అవికా గోర్ తెలుగు బుల్లితెరకు వచ్చారు. కథానాయికగా కూడా కొన్ని సినిమాలు పెళ్లి కూతురుగా కనిపించారు. ఇప్పుడు 'వధువు' అంటూ వెబ్ సిరీస్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నందు, అలీ రేజా ప్రధాన పాత్రధారులు. బెంగాలీ వెబ్ సిరీస్ 'ఇందు' రీమేక్ ఇది (Indu Bengali Web Series Remake).
కథ (Vadhuvu Web Series Story): ఇందు (అవికా గోర్)కు కాబోయే భర్తను సొంత చెల్లెలు లేవదీసుకుని వెళ్ళడంతో ఓసారి పెళ్లి ఆగిపోతుంది. రెండోసారి ఆనంద్ (నందు)తో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పత్రికతో చెల్లెలు దిగుతుంది. మరో వైపు అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటి నుంచి సారెలోని పనసపండును ఎవరో కోసి జిల్లేడు ఆకు పెట్టి కుడతారు. ఆనంద్, ఇందుల పెళ్లిని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
పెళ్లి ఆపాలని ప్రయత్నించింది ఎవరు? ఇందు అత్తారింటిలో అడుగు పెట్టిన తర్వాత ఆమె అనుకుని ఆడపడుచు మీద హత్యాప్రయత్నం చేసినది ఎవరు? ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రేజా) పెళ్లి పెటాకులు కావడానికి కారణం ఏమిటి? అతడి భార్య వైష్ణవి ఎక్కడ ఉంది? అతడి పెళ్లి విషయాన్ని, ఆనంద్ & ఆర్యల పెద్దమ్మ కుమార్తెకు మతిస్థిమితం లేని విషయాన్ని ఇందు దగ్గర ఎందుకు దాచారు? పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవకు, అనుమాస్పద ఘటనలకు కారణం ఎవరు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Vadhuvu Web Series Review): థ్రిల్లర్ సిరీస్ / సినిమాలకు ఓ ఫార్మటు ఉంటుంది. రొటీన్ టెంప్లేట్ ఉంటుంది. అయితే... కంటికి కనిపించని శత్రువు ఎవరు? అనేది తెలుసుకోవాలని ప్రేక్షకుడిలో ఓ ఆలోచన, ఆసక్తి, కుతూహలం రేకెత్తించగలిగితే.... దర్శకుడు, నటీనటులు సక్సెస్ అయినట్లే! 'వధువు' మేకర్స్ ఆ విషయంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యారు.
'వధువు' ప్రారంభం నుంచి కథతో పాటు ప్రేక్షకుడు సైతం ప్రయాణం చేసేలా దర్శక, రచయితలు సన్నివేశాలు రూపొందించారు. లాజిక్స్ గురించి వీక్షకుడు ఆలోచించకుండా స్క్రీన్ మీద మేజిక్ వర్కవుట్ అయ్యేలా చూశారు. రెగ్యులర్ & రొటీన్ టెంప్లేట్ సిరీస్ తరహాలో కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి ఎపిసోడ్‌లో కొత్త వ్యక్తి మీద అనుమానం కలిగేలా చేశారు. ఎంగేజ్ చేశారు. పెళ్లి మండపంలో అమ్మాయి బాబాయ్ వచ్చి 'అన్నయ్యా...' అన్న ప్రతిసారీ 'మళ్ళీ పెళ్లి ఆగింది' అని మనం ఓ నిర్ణయానికి వచ్చేలా తీసిన సన్నివేశాలు బావున్నాయి. స్క్రీన్ ప్లే బావుంది.
అక్క పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని చెల్లెలు లేవదీసుకుని వెళ్ళడానికి, పెళ్లి కొడుకు లేచిపోవడానికి చెప్పిన కారణం కన్విన్సింగ్‌గా లేదు. మధ్యలో కొన్ని రొటీన్ సీన్స్, ఎఫైర్స్ అంటూ చూపించినవి కథలో అతకలేదు. అసలు కథను అసంపూర్తిగా ముగించారు. తక్కువ నిడివిలో ఎక్కువ కథను చెప్పాలనే ప్రయత్నంలో కొన్ని విషయాలను పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లారు. నందు తల్లి పాత్రకు రాసిన సన్నివేశాలు సీరియల్ తరహాలో ఉన్నాయి.
'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా 'బాహుబలి 1' చిత్రాన్ని ముగించినట్టు... అసలు దోషి ఎవరో చెప్పకుండా 'వధువు' సీజన్ 1కు ఎండ్ కార్డు వేశారు. 'వధువు' కథ కంటే కథనం ఎక్కువ ఎంగేజ్ చేసింది. అందుకు ప్రధాన కారణం శ్రీరామ్ మద్దూరి సంగీతం! బీజీఎంతో సస్పెన్స్ బిల్డ్ చేశారు. సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా!
నటీనటులు ఎలా చేశారంటే: అవికా గోర్ స్క్రీన్ ప్రజెన్స్ 'వధువు'కు ప్లస్ అయ్యింది. పెళ్లి ఆగిపోతుందేమో అనే భయం నుంచి ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఆయా సన్నివేశాలకు తగ్గట్టు నటించారు. అవికాకు సవాల్ విసిరే పాత్ర కాదు. కానీ, ఆ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. కళ్ళతో ఎక్స్‌ప్రెషన్స్ పలికించారు.
యాంగ్రీ యంగ్ మేన్ తరహా పాత్రలో నందు చక్కగా చేశారు. మంచోడు, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా అలీ రేజా కనిపించారు. రూప లక్ష్మితో పాటు మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 'కోట బొమ్మాళి పీఎస్' తర్వాత మరోసారి శ్రీధర్ రెడ్డి పోలీస్ పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే.
చివరగా చెప్పేది ఏంటంటే: 'వధువు' కథ ఏంటి? అని అడిగితే ఒక్క ముక్కలో చెప్పలేం. ఎందుకంటే... అన్ని పాత్రలు, మలుపులు ఉన్నాయి. ఆఖరికి అసలు కథ, ట్విస్ట్ దాచేశారు. అయితే... నెక్స్ట్ ఏంటి? అనే క్యూరియాసిటీ కలిగించే కథనం 'వధువు'లో ఉంది. వీక్షకులు ఉత్కంఠగా చూసే గ్రిప్పింగ్ & థ్రిల్లింగ్ సిరీస్ ఇది. నిడివి తక్కువ కావడంతో ఒక్కసారి స్టార్ చేస్తే... రెండున్నర గంటల్లో కంప్లీట్ చేయవచ్చు. 'వధువు' చూస్తుంటే టైమ్ తెలియదు.
Also Read : హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?