Sundarakanda 2025 Review - సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
Sundarakanda Review Telugu: నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'సుందరకాండ'. వినాయక చవితికి విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
వెంకటేష్ నిమ్మలపూడి
నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని, సత్య, సునైనా, వాసుకి, నరేష్, రూపాలక్ష్మి, అభినవ్ గోమఠం, వీటీవీ గణేష్ తదితరులు
Nara Rohith's Sundarakanda Movie 2025 Review In Telugu: నారా రోహిత్ హీరోగా నటించిన తాజా సినిమా 'సుందరకాండ'. పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి 2'ను పక్కన పెడితే... ఏడేళ్ల తర్వాత సోలో హీరోగా ఆయన నటించిన చిత్రమిది. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ ఓ హీరోయిన్. రవితేజ 'వీర' తర్వాత ఆవిడ నటించిన తెలుగు చిత్రమిది. వృతి వాఘాని మరొక హీరోయిన్. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తుందా? నారా రోహిత్ విజయం అందుకుంటారా? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Sundarakanda Movie 2025 Story): సిద్ధార్థ్ (నారా రోహిత్) వయసు 30 కంటే ఎక్కువ. జుట్టుకు రంగు వేసుకునే పరిస్థితి. అయినా పెళ్లి కాలేదు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఐదు లక్షణాలు ఉండాలని రూల్ పెట్టుకుని, అవి లేవని వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడతాడు. ఐదు లక్షణాలు పెట్టుకోవడానికి కారణం వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్). స్కూల్‌లో సిద్ధార్థ్ సీనియర్. ఆ ప్రేమ కథకు ఎవరి వల్ల ఫుల్ స్టాప్ పడింది? అనేది ఓ కథ.
ఎయిర్ పోర్టులో పరిచయమైన ఐరా (వృతి వాఘాని)లో సిద్ధార్థ్ కోరుకున్న ఐదు లక్షణాలు కనపడతాయి. ఆ అమ్మాయి స్టూడెంట్. అమెరికా వెళ్లడానికి సిద్ధమైన మనిషి... ఐరా కోసం కాలేజీలో లెక్చరర్ అవుతాడు. సిద్ధూను ఐరా సైతం ప్రేమిస్తుంది. అయితే... వాళ్ళిద్దరి పెళ్లికి వయసులో వ్యత్యాసం కాకుండా మరొక సమస్య ఎదురవుతుంది. అది మరొక కథ.
వైష్ణవి, ఐరా కథలు ఎలా కలిశాయి? సిద్ధూ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి),స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) ఎటువంటి సాయం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Sundarakanda Nara Rohit Review): 'సుందరకాండ'పై ప్రేక్షకుల దృష్టి పడటానికి ముఖ్యమైన కారణం... పెళ్లి విషయంలో అబ్బాయిలకు అమ్మాయిలు కండిషన్లు పెట్టే ఈ రోజుల్లో... అమ్మాయిలో ఓ అబ్బాయి ఐదు క్వాలిటీస్ కోరుకోవడం ఏమిటి? అసలు ఆ ఐదు క్వాలిటీస్ ఏమిటి? అనేది ఒకటి. అయితే పెద్దోళ్ళను లేదంటే చిన్నోళ్లను ప్రేమించడం ఏమిటి? అనే మరో డైలాగ్.
'సుందరకాండ'లో స్టోరీ చాలా సింపుల్. స్కూల్‌లో ఇష్టపడిన అమ్మాయిలో తాను గమనించిన ఐదు లక్షణాలు తనకు కాబోయే భార్యలో ఉండాలని కోరుకుంటాడు హీరో. ఆ ప్రయాణంలో అతనికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది సినిమా. కథతో పాటు స్క్రీన్ ప్లే సింపుల్‌గా కనిపించినా... ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చూపించని పాయింట్. డిస్కస్ చేయని టాపిక్. హీరోకి, అతనితో పాటు స్నేహితులకు ఎదురైన సిట్యువేషన్స్ మాత్రం స్క్రీన్ ముందున్న ప్రేక్షకులను నవ్విస్తాయి. కథకుడిగా, దర్శకుడిగా కంటే రచయితగా వెంకటేష్ నిమ్మలపూడి ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారు. క్వాలిటీస్ విషయంలో, ప్రేమ విషయంలో ఈ కథలో కాన్‌ఫ్లిక్ట్‌ను డీల్ చేయడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. దాన్ని చక్కగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. గీత దాటకుండా మంచి డైలాగులు రాశారు. ఎవరినీ నొప్పించకుండా సన్నివేశాలు తీశారు. తేలికైన పదాలతో భారమైన భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. క్లీన్ కామెడీ రాశారు. ఆయనకు సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ వర్మ నుంచి చక్కటి సహకారం లభించింది. పాటలు, విజువల్స్ ప్లజెంట్ ఫీల్ ఇచ్చాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా బావుంది.
'సుందరకాండ'కు మెయిన్ మైనస్ కథలో కాన్‌ఫ్లిక్ట్. ట్విస్ట్ ఊహించడం కష్టం కాదు. దర్శకుడు రివీల్ చేయడానికి ముందు అర్థం అయ్యేలా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయ్యాక అసలు పాయింట్ ఎప్పుడు వస్తుంది? అన్నట్టు ఎదురు చూడాల్సిన సన్నివేశాలు కొన్ని వస్తాయి. అయితే కామెడీ చాలావరకు కవర్ చేసింది. కథలో ఉన్న మెయిన్ ట్విస్టులు రెండు. పైన చెప్పినట్టు ఇంటర్వెల్ ముందు ఒకటి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత హీరో దాచిన నిజం హీరోయిన్లు ఇద్దరికీ ఎప్పుడు తెలుస్తుంది? అనేది మరొక ట్విస్ట్. అదీ అంతగా హుక్ చేసే పాయింట్ కాదు. కానీ రెండు ట్విస్టులు ఆధారం చేసుకుని రాసిన సన్నివేశాలు నవ్విస్తాయి. స్కూల్ ఎపిసోడ్‌లో శ్రీదేవి విజయ్ కుమార్ బదులు మరొక టీనేజ్ ఆర్టిస్ట్ ఎవరినైనా పెడితే బావుండేది. విజయ్ సేతుపతి '96' తరహాలో.
Also Read: 'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?
సిద్ధార్థ్ పాత్రకు నారా రోహిత్ న్యాయం చేశారు. నటనతో పాటు డైలాగ్ డెలివరీలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఫిజిక్ మీద వచ్చిన ఫీడ్ బ్యాక్ దృష్టిలో పెట్టుకుని వెయిట్ లాస్ అవుతున్నట్టు ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఐరాగా వృతి వాఘాని క్యూట్ లుక్స్, ఇన్నోసెంట్ నటనతో ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్ కుమార్ పక్కన ఆవిడ తేలిపోయింది. ఇద్దరూ ఉన్న సన్నివేశాల్లో శ్రీదేవి స్క్రీన్ ప్రజెన్స్ డామినేట్ చేసింది. వాసుకి, నరేష్, రూపాలక్ష్మి, అభినవ్ గోమఠం, వీటీవీ గణేష్... సపోర్టింగ్ కాస్ట్ అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరిలో సత్య - సునైనా జోడీ కామెడీ అదిరింది.
పండక్కి కుటుంబం అంతా కలిసి చూసే హాయిగా నవ్వుకునే చక్కటి వినోదాత్మక సినిమా 'సుందరకాండ'. సత్య, సునైనా, నరేష్, అభినవ్ గోమఠం స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ నవ్వుతారు. వెంకటేష్ నిమ్మలపూడి రాసిన మాటలు బావున్నాయి. సన్నివేశాలు హాయిగా నవ్విస్తాయి. శ్రీదేవి విజయ్ కుమార్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఫైనల్లీ... రోహిత్ నారాకు మంచి విజయం ఇది. హ్యాపీగా థియేటర్లకు వెళ్ళవచ్చు.
Also Read: 'బన్ బటర్ జామ్' రివ్యూ: బ్రేకప్, ఎఫైర్స్ తెలిసీ ప్రేమిస్తారా? యూత్‌ఫుల్ ఫిల్మ్ ఎలా ఉందంటే?





















