Paradha Movie Review - 'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?
Paradha Review In Telugu: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పరదా'. 'శుభం' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
ప్రవీణ్ కాండ్రేగుల
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, హర్షవర్ధన్, రాగ్ మయూర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజేంద్రన్ ప్రసాద్ తదితరులు
Anupama Parameswaran's Paradha Review In Telugu: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పరదా'. మలయాళ హిట్స్ 'హృదయం', 'జయ జయ జయ జయహే' ఫేమ్ దర్శన రాజేంద్రన్ నటించిన తొలి తెలుగు చిత్రమిది. సంగీత మరో ప్రధాన పాత్ర చేశారు. అనుపమ జంటగా రాగ్ మయూర్ కనిపించారు. 'శుభం' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన చిత్రమిది. మహిళా ప్రాధాన్య కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Parada Movie Story): సుబ్బు అలియాస్ సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ఊరు పేరు పడతి. అక్కడ ఓ వింత ఆచారం ఉంది. ఊరిలో మహిళలు అందరూ పరదా వేసుకుని తిరగాలి. తండ్రి, సోదరులు, భర్తకు తప్ప పరాయి పురుషుడికి ఆ ఊరిలో మహిళలు ముఖం చూపించరు. ఒకవేళ చూపిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ బావిలో ఆత్మాహుతి చేసుకోవాలి. సుబ్బు కూడా ఆ ఆచారాన్ని నమ్ముతుంది. తూచా తప్పకుండా పాటిస్తుంది. అయితే తాను నమ్మిన ఆచారం తన ప్రాణాలను తీసే పరిస్థితి తీసుకు వస్తుంది.
చిన్నప్పటి నుంచి ప్రేమించిన అబ్బాయి రాజేష్ (రాగ్ మయూర్)తో పెళ్లికి సిద్ధమైన వేళ... సుబ్బు ముఖం ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీకి ఎక్కుతుంది. సుబ్బు పరదా ఎప్పుడు తీసింది? ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నది? ఆ ఫోటో కవర్ పేజీపై పబ్లిష్ కావడంలో తన తప్పు లేదని నిరూపించుకోవడంలో సుబ్బుకు అత్తమ్మ (సంగీత), ఢిల్లీలోని అమిష్టా (దర్శన రాజేంద్రన్) ఎటువంటి సాయం చేశారు? ఆ ముగ్గురూ ఢిల్లీ నుంచి ధర్మశాలకు ఎందుకు వెళ్లారు? అనేది సినిమా.
విశ్లేషణ (Paradha Review Telugu): మూఢ నమ్మకాలు, ఆచారాల పేరుతో మహిళల స్వేచ్ఛను పురుషాధిక్య సమాజం హరించిన ఘటనలు కోకొల్లలు. ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకీ ఆంక్షలు? అని ప్రశ్నించిన సినిమాలు తక్కువ. అటువంటి సినిమాలను ఆర్ట్ కేటగిరీలో వేసిన సందర్భాలు ఉన్నాయ్. అయితే ఇప్పుడు మన ప్రేక్షకుల అభిరుచితో పాటు దర్శక రచయితల్లో మార్పు వచ్చింది. అందుకని, ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో సమానమైన ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరదా ఆచారం లేదు. కానీ, ఉత్తరాదిలో మహిళలు మేలిముసుగు వేసుకోవడం ఒక ఆచారం. ఆ నేపథ్యంలో సినిమా కావడం, అనుపమ - దర్శన - సంగీత నటించడంతో 'పరదా' మీద ఆసక్తి ఏర్పడింది.
'పరదా' ప్రచార చిత్రాలతో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించారు. 'శుభం' రిజల్ట్ ఎఫెక్ట్ ఏమీ పడలేదు. అయితే థియేటర్ల నుంచి వచ్చే సమయంలో డిజప్పాయింట్ చేశారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ళకూ సమాన హక్కులు కల్పించాలని చెప్పడంలో తప్పేం లేదు. కానీ, అందుకు ఎంపిక చేసుకున్న కథ - కథనాల్లో బలం ఉండాలి. 'పరదా'కు ప్రధాన సమస్య - రైటింగ్. మంచి పాయింట్ ఎంపిక చేసుకుని పేలవమైన కథనం, సన్నివేశాలతో ముందుకు తీసుకు వెళ్లారు.
మహిళా సాధికారిత అంటే మహిళలకు పురుషులు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే కాదు... సాటి మహిళను మరో మహిళా గౌరవించడం, మహిళలు బలంగా ఆలోచించడంతో పాటు తమ కోసం తాము నిలబడటం! ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకోవడం తప్పు కాదు... ఆ క్రమంలో సాటి మహిళా ఇబ్బందిని గుర్తించాలి కదా! పీరియడ్ పెయిన్ కోసం లీవ్ అడిగితే లేదని ఉన్నత స్థాయిలోని ఉద్యోగిని కోప్పడటం ఎంత వరకు సబబు? పరదా ఆచారాన్ని ప్రశ్నిస్తూ సంగీత చెప్పిన తర్వాత గానీ సుబ్బులో ఆలోచన వచ్చినట్టు చూపించలేదు. అంటే ఆ ఊరిలో మహిళలు అందరూ దద్దమ్మలు అన్నట్టు చూపించడం ఏమిటి? 'యత్ర నార్యస్తు పూజ్యంతే' అని నేపథ్య సంగీతంలో వినిపించడం తప్ప నిజంగా దర్శక రచయితలు మహిళలను పూజించలేదు. లేకుంటే తమకు తోచిన రీతిలో స్వేచ్ఛ తీసుకుని కథనం, సన్నివేశాలు రాసేవారు కాదు.
సినిమా ప్రారంభంలో జ్వాలమ్మ కథను చెప్పిన తీరు బావుంది. అయితే పరదా తప్పనిసరిగా వేసుకోవాలని సుబ్బు (అనుపమ) బలంగా నమ్మడానికి సరైన సీన్ ఒక్కటి పడలేదు. ఆత్మాహుతి చేసుకున్న మహిళల ఇళ్లలో మనుషుల మానసిక స్థితిని చూపించిన సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి లేదు. పడతి నుంచి ధర్మశాల ప్రయాణంలో ముగ్గురిలో ఎటువంటి మార్పు వచ్చింది? అనేది సరిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సుబ్బులో ప్రశ్నించే తత్వం వచ్చింది. మరి అప్పటి వరకు తాను కోల్పోయినది ఏమిటో తెలుసుకుందా? జ్వాలమ్మ అంత బలంగా మారిందా? అమిష్టా ఏం తెలుసుకుంది? సంగీత భర్త పాత్రలో నటించిన హర్షవర్ధన్ ఏం అర్థం చేసుకున్నాడు? క్లారిటీ కొరవడింది.
జ్వాలమ్మ ఎపిసోడ్... ధర్మశాల ప్రయాణంలో అనుపమపై నలుగురు అత్యాచారం చేసేందుకు తెగబడిన ఎపిసోడ్... రాజేంద్రప్రసాద్ స్వేచ్ఛను వివరించే ఎపిసోడ్... మూడింటిని కనెక్ట్ చేయడం, అక్కడ సంభాషణల్లో దర్శక రచయితలు నేర్పు - ఓర్పు చూపించారు. పతాక సన్నివేశాల్లో జ్వాలమ్మ కళ్లకు పరదా తీయడాన్ని బాగా చూపించారు. సినిమా అంతా ఆ టెంపో మైంటైన్ చేయలేదు. అందువల్ల రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మెప్పిస్తే మరికొన్ని నిరాశ కలిగిస్తాయి. ఇటువంటి సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇంపార్టెంట్. మృదుల్ సేన్ ప్రతి సన్నివేశంలో సహజత్వాన్ని చూపించగా... గోపిసుందర్ ఓవర్ ది బోర్డు వెళ్ళలేదు కానీ నేపథ్య సంగీతంలో 'యత్ర నార్యస్తు పూజ్యంతే' ఎక్కువ సేపు వినిపించి విసిగించారు. పాటలు బావున్నాయి. నిర్మాణ విలువల కథకు తగ్గట్టు ఉన్నాయి. ఒరిజినల్ లొకేషన్లలో కొన్ని సన్నివేశాలు తీశారు. జ్వాలమ్మ విగ్రహంతో పాటు పల్లెలో కొన్ని తీశారు. ఆర్ట్ వర్క్ పరంగా మంచి వర్క్ చేశారు.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?
సుబ్బు పాత్రలో అనుపమ జీవించారు. పల్లెటూరి అమ్మాయి రూపం తప్ప ఆవిడ గత సినిమాలు ఏవీ గుర్తు రానంతగా పాత్రలో లీనమై కనిపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. పరదా తీసి ఊరిలో అడుగుపెట్టినప్పుడు తండ్రి కొట్టిన సన్నివేశంలో ధృడ సంకల్పాన్ని, అత్యాచారానికి నలుగురు ప్రయత్నించిన సన్నివేశంలో నిస్సహాయతను చక్కగా చూపించారు. తన పాత్ర వరకు దర్శన చక్కగా నటించారు. ఆవిడ కంప్లీట్ పొటెన్షియల్ వాడుకోలేదు. సగటు గృహిణి వేదనను సంగీత ఆవిష్కరించిన తీరుకు క్లాప్స్ కొట్టకుండా ఉండలేం. ఆమె భర్తగా హర్షవర్ధన్ నవ్వించారు. రాగ్ మయూర్ నటన ఓకే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ రెండు సన్నివేశాల్లో కనిపించారు.
మహిళల కోసం మహిళలపై తీసిన సినిమా 'పరదా'. మహిళలకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పే సినిమా. దర్శక రచయితలు ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం వల్ల మంచి పాయింట్ కాస్త డైల్యూట్ అయ్యింది. ఆలోచనలను అందరికీ అర్థం అయ్యే రీతిలో ఆవిష్కరించడంలో తప్పులు దొర్లాయి. అయితే అనుపమ - దర్శన - సంగీత... ముగ్గురూ తమ నటనతో చాలా సన్నివేశాలను నిలబెట్టారు. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఓకే అనిపిస్తుంది.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















