Bun Butter Jam Telugu Review - 'బన్ బటర్ జామ్' రివ్యూ: బ్రేకప్, ఎఫైర్స్ తెలిసీ ప్రేమిస్తారా? యూత్‌ఫుల్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Bun Butter Jam Review In Telugu: తమిళ 'బిగ్ బాస్ 5' విన్నర్ రాజు జయమోహన్ హీరోగా పరిచయమైన సినిమా 'బన్ బటర్ జామ్'. నెల ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
రాఘవ్ మిర్దత్
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ, చార్లి, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని తదితరులు
Raju Jeyamohan's Bun Butter Jam Movie Review In Telugu: తమిళ సీరియళ్లు, శివకార్తికేయన్ 'డాన్'లో రాజు జయమోహన్ నటించారు. ఆయన తమిళ 'బిగ్ బాస్ 5' విన్నర్ కూడా! 'బన్ బటర్ జామ్'తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. జూలై 17న తమిళంలో విడుదలైంది. తెలుగులో నెల ఆలస్యంగా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన శరణ్య, దేవదర్శిని నటించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Bun Butter Jam Movie Story): ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు... రెండింటిలోనూ విడాకులు ఎక్కువ అవుతున్నాయని లలిత (శరణ్య), ఉమ (దేవదర్శిని) ఓ పథకం వేస్తారు. లలిత కుమారుడు చంద్రు (రాజు జయమోహన్)ను తన అల్లుడు చేసుకోవాలని ఉమ... ఉమ కుమార్తె మధుమిత (ఆధ్య ప్రసాద్)ను తన కోడలు చేసుకోవాలని లలిత నిర్ణయించుకుంటారు. అది పెద్దలు కుదిర్చిన వివాహంగా ఉండకూడని, వాళ్లిద్దరూ ప్రేమలో పడాలనేది వాళ్ళ ప్లాన్. అందుకని లలిత ఇంటి పై పోర్షన్‌లో ఉమ కుటుంబం అద్దెకు దిగుతుంది.
మధుమితతో చంద్రు ప్రేమలో పడాలని తల్లి కోరుకుంటే... అతను ఏమో కాలేజీలో వేరే అమ్మాయి నందిని (భవ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు. మధుమిత సైతం వేరే అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. ఒకరి ప్రేమ గురించి మరొకరికి తెలిసిందా? చివరకు ఎవరెవరు ప్రేమలో పడ్డారు? ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు? అనేది సినిమా.
విశ్లేషణ (Bun Butter Jam Review Telugu): గతం అనేది ఓ డెడ్ బాడీ లాంటిదని, గతాన్ని తలచుకుంటూ ఉండటం వల్ల శవంలా ఉండటం తప్ప జీవితంలో ముందుకు వెళ్లలేమని, గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సందేశం ఇచ్చే సినిమా 'బన్ బటర్ జామ్'. ఆ సందేశానికి షుగర్ కోటింగ్ తరహాలో యూత్ ఫుల్ సీన్స్ దట్టించారు. ఈ సినిమా ప్రారంభమైన తీరుకు, శుభం కార్డు వేసిన విధానానికి అసలు సంబంధం ఉండదు.
ఇంటర్ చదివే పిల్లలు, బీటెక్ జాయినైన యువత ఎలా ఉన్నారో చూపిస్తూ 'బన్ బటర్ జామ్' మొదలైంది. అప్పుడు ఇదొక రెగ్యులర్ రొటీన్ యూత్‌ఫుల్ సినిమా టైపులో ఉంటుంది. అయితే పిల్లల్ని ప్రేమలో పడేయాలని తల్లులు ట్రై చేయడం కొత్తగా ఉంటుంది. కొన్ని సీన్స్ ఓవర్ ది బోర్డు వెళ్లినా కామెడీ వర్కవుట్ అయ్యింది. కథ గురించి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. కొత్తదనం లేదు. ఫ్రెండ్ లవర్ మీద కన్నేయడం వంటి క్యారెక్టర్లను నెగిటివ్ షేడ్‌లో చూపించకుండా పాజిటివ్ వేలో రాయడం సంథింగ్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా! ఈ సినిమాలో లూప్ హోల్స్ లేవని కాదు. ప్రేమించిన అమ్మాయిని అంత ఈజీగా ఫ్రెండ్ కోసం త్యాగం చేయడం సులువా? ప్రేమించిన అబ్బాయి హ్యాండ్ ఇస్తే వెంటనే కోలుకోగలమా? వంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు.
క్యారెక్టరైజేషన్స్, సిట్యువేషన్స్ మీద ఫన్ జనరేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులరైన అమ్మాయిలు అని కాదు గానీ... ప్రజెంట్ జనరేషన్ యూత్ మైండ్ సెట్ ఎలా ఉంది? అనేది రీసెర్చ్ చేసి కొన్ని సీన్స్ రాసినట్టు ఉన్నాయి. లవర్ కోసం అని వెళ్లి తండ్రికి దొరికే సీన్ హిలేరియస్‌గా నవ్విస్తుంది. కథలో మైనస్ పాయింట్స్ చాలా వరకు మ్యూజిక్ కవర్ చేసింది. నివాస్ కె ప్రసన్న పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ జస్ట్ ఓకే. తెలుగు డబ్బింగ్ కుదిరింది.
Also Read: మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమా రివ్యూ: థియేటర్లలో చివరి వరకూ కూర్చోగలమా?
తల్లి చాటు బిడ్డగా, అమాయకుడైన కొడుకుగా... మంచి స్నేహితుడిగా... ప్రేమలో ఫెయిల్యూర్ కింద... డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు రాజు జయమోహన్. తొలి సినిమాకు చక్కటి నటన కనబరిచారు. ఇతర హీరోలను ఇమిటేట్ చేయకుండా నటించడం మంచి విషయం. భవ్య త్రిఖ అందంగా కనిపించడంతో పాటు ఆ పాత్రకు తగ్గట్టు నటించారు. ఆద్య ప్రసాద్, శరణ్య, దేవదర్శిని తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు.

ప్రజెంట్ జనరేషన్ యూత్‌కు మంచి సందేశం ఇచ్చే సినిమా 'బన్ బటర్ జామ్'. ఆ సందేశం పేరుతో హెవీ లెక్చర్లు వంటివి ఇవ్వకుండా వినోదాత్మకంగా తీశారు. కథ, కథనం గురించి ఆలోచించకుండా కామెడీ కోసం హ్యాపీగా వెళ్ళవచ్చు. చక్కగా నవ్వుకోవచ్చు. సినిమా స్టార్టింగ్ రెండు మూడు సన్నివేశాలు కొన్ని కుటుంబంతో చూసేందుకు ఇబ్బంది పెడతాయి. అవి తప్పిస్తే ఫ్యామిలీతో చూసే చిత్రమిది. అబ్బాయి లేదా అమ్మాయి గతం... ఆ గతంలో లవ్ ఫెయిల్యూర్స్ / ఎఫైర్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కొత్త జీవితం స్టార్ట్ చేయవచ్చని చెప్పే చిత్రమిది.
Also Read: 'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?





















