Meghalu Cheppina Prema Katha Movie Review - మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమా రివ్యూ: థియేటర్లలో చివరి వరకూ కూర్చోగలమా?
Meghalu Cheppina Prema Katha Review In Telugu: నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వం వహించిన సంగీతభరిత ప్రేమకథా చిత్రమ్ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
విపిన్
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, సుమన్, ఆమని, తులసి తదితరులు
Naresh Agastya's Meghalu Cheppina Prema Katha Review: హిట్ ఫిలిమ్స్ 'మత్తు వదలరా', 'పంచతంత్రం'తో పాటు 'పరువు', 'వికటకవి' వెబ్ సిరీస్ ఫేమ్ నరేష్ అగస్త్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించారు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రబియా ఖతూన్ కథానాయిక. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Meghalu Cheppina Prema Katha Story): వరుణ్ (నరేష్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని ఇండియా వస్తాడు. గాయకుడిగా, సంగీతకారుడిగా ఉన్నత స్థాయికి వెళ్లాలనేది అతని లక్ష్యం. ఆ విషయాన్ని తండ్రి మహేంద్ర (సుమన్)కి చెబితే కోప్పడతాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. కొన్నాళ్ళు రిలీఫ్ కోసమని తమిళనాడులోని వాల్పరైకి వెళతాడు. అక్కడ చిన్నప్పుడు నాయనమ్మ 'కాంచీపురం' కామాక్షి శంకరమూర్తి (రాధికా శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎస్టేట్ ఉన్నాయి. అక్కడికి మేఘన (రబియా ఖాతూన్) వస్తుంది.
వాల్పరైలో వరుణ్, మేఘన ప్రేమలో పడతారు. అయితే ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగింది? హైదరాబాద్‌లోని మేఘన ఇంటి ముందు వరుణ్ ఎందుకు పడిగాపులు కాచాడు? గాయకుడిగా, సంగీతకారుడిగా వరుణ్ పేరు తెచ్చుకున్నాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Meghalu Cheppina Prema Katha Review Telugu): మేఘం చినుకుగా మారితే వర్షం వస్తుంది. వర్షాన్ని వరుణుడు అంటాం. వరుణ్, మేఘన... 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లో పేర్లు ఎంత కవితాత్మకంగా పెట్టారో కదా! టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టు హిల్ స్టేషన్ వాల్పరైలో ఎక్కువ శాతం సినిమా తీశారు. ఆ టైటిల్, హీరో హీరోయిన్ల పేర్లలో ఉన్న కవితాత్మకత సినిమాలో కనిపించదు.
సంగీతభరిత ప్రేమకథా చిత్రానికి పాటలు ప్రతి ఒక్కటినీ ఆకట్టుకునేలా ఉండటం చాలా అంటే చాలా అవసరం. 'జస్టిన్' ప్రభాకరన్ స్వరపరిచిన పాటలు బాలేదని కాదు... వినసొంపుగా ఉన్నాయి. కానీ సంగీతభరిత సినిమాకు అవసరమైన స్థాయిలో లేవు. పబ్‌లో వాతావరణానికి, 'నాలోన... నీలోన' పాటకు సింక్ కాలేదు. సంగీతం పక్కన పెడితే సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి.
'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లో ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు కథ ఏమిటి? అంటే... మూడు ముక్కల్లో చెప్పవచ్చు. అంతలా సినిమాను సాగదీశారు. తన కొడుకు మ్యుజీషియన్ కావడం ఓ మల్టీ మిలీనియర్‌కు ఇష్టం లేదు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా కొడుకు నాయనమ్మ ఇంటికి వెళతాడు. అక్కడ వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు - అదీ ఫస్టాఫ్ కథ. సెకండాఫ్ ఏమిటంటే... హీరో హీరోయిన్స్ మధ్య బ్రేకప్ కావడం, హీరో పెద్ద మ్యుజీషియన్ కావడం! ఇటువంటి కథల్లో పెద్ద పాయింట్ ఉండదు. అటువంటి సమయంలో సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉండాలి. ఆ దిశగా దర్శక రచయితలు అసలు కృషి చేయలేదు.
సాఫ్ట్‌వేర్ ఆఫీసులో కొలీగ్స్ చెప్పిన నాలుగు మాటలకు హీరోయిన్ ఓ అబ్బాయికి ప్రపోజ్ చేయడం ఏమిటో అర్థం కాదు. సీన్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. హీరో కంపోజ్ చేసిన పాటలు రెండు నిమిషాలు విని తనికెళ్ళ భరణి ఎక్స్‌లెంట్ అని చెప్పడం మరీ కామెడీగా ఉంది. ఆమనికి రాసిన డైలాగుల్లో ఎంతో డెప్త్ ఉంది. అయితే సీన్ టేకాఫ్ సరిగా లేదు. హీరో మీద హీరోయిన్ కోప్పడటానికి చెప్పే కారణం కూడా సరిగా లేదు. సహేతుకంగా అనిపించలేదు. ఫస్టాఫ్ పర్వాలేదని అనిపిస్తే... ఎండింగ్ మరీ బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వ్యూ చూసి హీరోయిన్, హీరో తల్లిదండ్రుల్లో రియలైజేషన్ వచ్చినట్టు చూపించడం మరీ డ్రమాటిక్‌గా ఉంది. 'హమ్మయ్య. ఎండ్ కార్డు పడింది' అని బయట రావాల్సి వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని మంచి మాటలు, రెండు మూడు పాటలు తప్ప సినిమాలో సరుకు లేదు.
Also Read: 'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?
నరేష్ అగస్త్య, రబియా ఖతూన్... వాళ్లిదరి జోడీతో పాటు నటన కూడా బావుంది. కానీ నిస్సారమైన సన్నివేశాలను తమ భుజాల మీద మోయడం వాళ్ళకూ కష్టమైంది. ఈ కథలో కీలకమైన నాయనమ్మ పాత్రలో రాధికా శరత్ కుమార్ నటించారు. ఆవిడను ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తరహాలో చూపించారు. కానీ, వర్కవుట్ కాలేదు. సుమన్, ఆమని, తులసి వంటి సీజనల్ యాక్టర్లు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. రాజా చెంబోలు, విధ్యులేఖ రామన్, హర్షవర్ధన్ సీన్లు నవ్వించలేదు.

'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లో పాయింట్ చాలా చిన్నది. మ్యూజిక్ స్కోప్ ఎక్కువ ఉన్నది. ఇటువంటి కథతో సినిమా తీసేటప్పుడు ఒక్క సాంగ్, ఒక్క సీన్ బాలేదంటే ఆడియన్స్ జేబుల్లోంచి మొబైల్స్ తీసి చూసే రోజులు ఇవి. అంత నిదానంగా కథ, సన్నివేశాలు కదిలితే థియేటర్లలో జనాలు కూర్చుకోవడం కష్టం. 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' నిడివి 2.20 గంటలే అయినా మూడున్నర గంటలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బోర్ కొడుతుందీ సినిమా.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?





















