Little Hearts Review - 'లిటిల్ హార్ట్స్' రివ్యూ: ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లవ్ స్టోరీ... బాహుబలి కనెక్షన్ ఏంటి?
Little Hearts Review Telugu: 'నైంటీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. శివానీ నాగరం హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
సాయి మార్తాండ్
మౌళి తనూజ్ ప్రశాంత్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, సత్య కృష్ణన్, తదితరులు
ETV WIN
Mouli Tanuj Prasanth's Little Hearts Review Telugu: యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులరైన యంగ్‌స్టర్, 'నైంటీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఇందులో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫేమ్ శివానీ నాగరం హీరోయిన్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. 'నైంటీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాత. 'బన్నీ' వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల చేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Little Hearts 2025 Story): అఖిల్ (మౌళి తనూజ్ ప్రశాంత్)ను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి చేయాలనేది తండ్రి (రాజీవ్ కనకాల) కోరిక. అయితే కుర్రాడికి అంతగా చదువు పట్టదు. ఎంసెట్ రాంక్ రాదు. కాదు కాదు... ఎగ్జామ్ హాల్‌లో చేసిన ఓ సిల్లీ పని వల్ల కనీసం క్వాలిఫై కాడు. దాంతో లాంగ్ టర్మ్ కోచింగ్‌లో జాయిన్ చేస్తాడు తండ్రి. అక్కడ కాత్యాయనీ (శివానీ నాగరం)ను చూసి ప్రేమిస్తాడు అఖిల్.
అఖిల్ ప్రేమకు కాత్యాయనీ పడుతుంది. కానీ, అంతకు ముందు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు? ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలిశాక ఏం జరిగింది? ఇంటర్ వయసులో ప్రేమ కథకు బ్రేకులు పడ్డాయా? లేదా రయ్ రయ్ మంటూ జెట్ స్పీడులో ముందుకు వెళ్ళిందా? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Little Hearts 2025 Review Telugu): యూట్యూబర్‌గా పేరొచ్చిన మౌళికి ఓటీటీలో 'నైంటీస్' వెబ్ సిరీస్ విజయం ఇచ్చింది. అది తీసిన దర్శకుడు ఆదిత్య హాసన్, ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్'లో మౌళికి హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఇదీ ఓటీటీని టార్గెట్ చేస్తూ తీసిన వెబ్ సినిమా. 'బన్నీ' వాస్ & కోకి నచ్చడంతో థియేటర్లలోకి వచ్చింది. మరి, హాలులో ఎంటర్‌టైన్ చేసే ఫన్ ఉందా? అంటే...
'నైంటీస్' సిరీస్ కనెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఎమోషన్స్. ఆ తర్వాతే 90లలోని జీవితాల్లోకి తొంగి చూసినట్టుండే కుటుంబ సన్నివేశాలు, ఆయా సందర్భాలకు తగ్గట్టు కుదిరిన వినోదం! నిర్మాతగా 'లిటిల్ హార్ట్స్'తో 'నైంటీస్' తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన పెను మార్పు ఎంసెట్ కోచింగ్ సెంటర్ మేజిక్ రిపీట్ చేయడానికి ట్రై చేశారు ఆదిత్య హాసన్. ఈ కథలో ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ, 'నైంటీస్' టైపులో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఆ మాటకొస్తే కథలో పెద్దగా విషయం లేదు, వినోదం తప్ప.
కాలేజీలో లెక్చరర్లను ఆట పట్టించడం, ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలిశాక అమ్మాయిలను బయటకు పంపించకుండా ఉండటం, వాళ్ళను కలిసేందుకు కుర్రాళ్లు ట్రై చేయడం... ఈ మూమెంట్స్ కొత్త కాదు. 'కొత్త బంగారు లోకం' వంటి సినిమాల్లో చూసినవే. అయితే ప్రేక్షకులకు గత సినిమాలు ఏవీ గుర్తు రాకుండా వినోదంతో సన్నివేశాలు నింపేశారు దర్శకుడు సాయి మార్తాండ్. కథలో ఇంటర్వెల్ ట్విస్ట్ కీలకం. అది కూడా నవ్విస్తుంది. అప్పటి వరకు సాఫీగా సాగిన వినోదానికి సెకండాఫ్‌లో కథ సెంటర్ సీటు తీసుకోవడంతో మధ్యలో కాస్త భారంగా బండి ముందుకు వెళ్ళింది. క్లైమాక్స్ కాస్త సాగదీశారు. చివరకు హ్యాపీ ఎండింగ్‌తో చిరునవ్వు ఇస్తుంది.
మౌళి, అతని స్నేహితుడు మీద రాసిన సీన్లలో ఫన్ ఉంది. అది బండిని ముందుకు నడిపింది. కథ, కాన్‌ఫ్లిక్ట్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. మూమెంట్స్ ఎంజాయ్ చేయడం, ఎంసెట్ బ్యాచ్ అందరికీ ఆ రోజులు గుర్తు చేయడం కోసం తీసిన చిత్రమిది. కాస్త నవ్వుకోవడానికి వెళితే ఎటువంటి లోటు ఉండదు. అంతకు మించి ఎక్కువ ఆశిస్తే కష్టం. సింజిత్ సంగీతంలో యూత్ రిలేట్ అయ్యే వైబ్ ఉంది. కథకు అవసరమైన ట్యూన్స్ ఇచ్చారు. 'కాత్యాయనీ... కాత్యాయనీ' పాట ఇలా ఉందేంటి? అనిపించడంలో అతను సక్సెస్ అయ్యాడు. అక్కడ కథకు ఆ సాంగ్ అవసరం. నేపథ్య సంగీతం బావుంది. నవ్వించడంలో హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.
అఖిల్ పాత్రలో మౌళి జీవించాడు. బాహుబలి టైంలో ఇంటర్ పూర్తి చేసి ఇప్పుడు జాబ్ చేసే యువత అందరూ అతనిలో తమని తాము చూసుకుంటారు. అఖిల్ ఒక్కరే కాదు... స్నేహితుడు మధు పాత్రతోనూ కనెక్ట్ అవుతారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ బావుంది. నిఖిల్ అబ్బూరి చక్కగా నటించారు. ఫ్రెండ్ రోల్స్‌కు మంచి ఆప్షన్ అవుతారు. శివానీ నాగరం పాత్రకు తగ్గట్టు అమాయకంగా, అందంగా కనిపించారు. హీరో తండ్రిగా రాజీవ్ కనకాల పాత్ర, ఆయన నటన బాగా చేశారు. హీరోయిన్ తల్లిదండ్రులుగా ఎస్ఎస్ కాంచి, సత్యకృష్ణన్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో చక్కగా చేశారు.
యువతను టార్గెట్ చేస్తూ తీసిన చక్కటి వినోదాత్మక చిత్రమ్ 'లిటిల్ హార్ట్స్'. ఉద్యోగ ఒత్తిడిలు, కుటుంబ బరువు బాధ్యతలు అంటూ ఉరుకుల పరుగుల జీవితాల్లో పడ్డ ఇప్పటి యువత (2015 టీనేజర్లు, ఆ టైములో 20లలోకి అడుగు పెట్టిన స్టూడెంట్స్)లోని చిట్టి మనసులను నవ్వించే సినిమా. నో ఎమోషన్స్, జస్ట్ ఫన్... అంతే! అంతకు మించి ఎక్కువ ఆశిస్తే కష్టం సుమా!





















