Saranga Dariya Movie Review - సారంగ దరియా రివ్యూ: అమ్మాయిగా మారిన అబ్బాయి.... ట్రాన్స్‌జెండర్‌పై సినిమా ఎలా ఉందంటే?
Saranga Dariya 2024 Movie Review In Telugu: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించిన సినిమా 'సారంగ దరియా'. ఉమా దేవి, శరత్ చంద్ర నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందంటే?
పద్మారావు అబ్బిశెట్టి
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ కుమార్ రామచంద్రవరపు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ తదితరులు
Raja Ravindra's Saranga Dariya Movie Review In Telugu: నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సారంగ దరియా'. శ్రీకాంత్ అయ్యంగార్, శివ కుమార్ రామచంద్రవరపు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా ఇతర ప్రధాన తారాగణం. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఉమా దేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Saranga Dariya Movie Story): కృష్ణకుమార్ (రాజా రవీంద్ర) కాలేజీ లెక్చరర్. పెద్దబ్బాయి అర్జున్ (మొయిన్ మహమ్మద్) తాగుడుకు బానిస అవుతాడు. రోజంతా తాగడం తప్ప అతడికి మరొక పని ఉండదు. రెండో అబ్బాయి సాయి (మోహిత్ పేడాడ) ముస్లిం అమ్మాయి ఫాతిమా (మధులత)తో ప్రేమలో ఉంటాడు. అమ్మాయి అనుపమ (యశ్వస్విని శ్రీనివాస్)ను ప్రేమిస్తున్నానంటూ రాజ్ (శివ కుమార్) వెంట పడతాడు. అయితే... అనుపమ అమ్మాయి కాదని ట్రాన్స్ గాళ్ అని తెలుస్తుంది. ఈ పిల్లల ముగ్గురి వల్ల కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.
కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్ గడప మూడుసార్లు తొక్కడానికి కారణాలు ఏంటి? పిల్లల కోసం అతను ఏం చేశాడు? అబ్బాయి అమ్మాయిగా మారడంతో అతణ్ణి సమాజం ఎలా చూసింది? సమాజం నుంచి కృష్ణకుమార్ ఫ్యామిలీ ఎటువంటి అవమానాలు ఎదుర్కొంది? బ్యూటీ క్వీన్ కిరీటం గెలవాలని అందాల పోటీలకు వెళ్లిన అనుపమ (అమ్మాయిగా మారిన అబ్బాయి)కి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Saranga Dariya Review Telugu): ట్రాన్స్‌జెండర్స్ క్యారెక్టర్ బేస్ చేసుకుని వచ్చిన ఇండియన్ సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. చాలా అంటే చాలా అరుదు. అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉండటం లేదా అమ్మాయిగా మారిన అబ్బాయి కథలను వినోదాత్మకంగా చూపించడం, వారిపై జోకులు వేయడం తప్ప... ఆ జెండర్ కోరికలకు లేదా లక్ష్యాలకు విలువ ఇచ్చిన కథలు తెరపైకి తక్కువగా వచ్చాయి. అందువల్ల, సగటు సినిమాల మధ్య 'సారంగ దరియా' కథ కొత్తగా ఉందని చెప్పాలి.
'సారంగ దరియా'లో దర్శకుడు పండు అలియాస్ పద్మారావు అబ్బిశెట్టి స్పృశించిన అంశాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెలుగు తెరపై చూపించలేదు. అబ్బాయిగా జన్మించినప్పటికీ... అతనిలో కోరికలను గుర్తించి, గౌరవించి ఆపరేషన్ ద్వారా లింగ మార్పిడి తల్లిదండ్రులే చేయిస్తే, ఆ తర్వాత సమాజంలో స్పందనలు ఎలా ఉంటాయి? అనేది హృద్యంగా చూపించారు. ఆ అంశం చుట్టూ అల్లిన కథలో కొంత పాత వాసనలు ఉన్నాయి. మోహిత్, మధులత మధ్య ప్రేమ కథ గానీ... మొయిన్ ట్రాక్ గానీ కొత్త కాదు. అయితే... మోహిత్ సున్తీ చేయించుకోవడం, మొయిన్ పాత్రలో మార్పు బావున్నాయి. అందాల పోటీలో విజయం సాధించాలని అనుపమ చేసే ప్రయాణంలో అడ్డంకులు సైతం అంత ఆసక్తి కలిగించవు.
'సారంగ దరియా' ప్రారంభం సగటు కుటుంబ కథా చిత్రానికి ఏమాత్రం తీసిపోదు. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్టు సన్నివేశాలు ముందుకు వెళతాయి. మధ్యలో కొన్ని కామెడీ సీన్లు బావున్నాయి. హర్షవర్ధన్, అనంత్ బాబు, విజయమ్మ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ సడన్ షాక్ ఇస్తే... ఆ తర్వాత ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సినిమా ముందుకు వెళుతుంది. పాటలు ఓకే. బాలేదని కాదు, అలాగని థియేటర్ల నుంచి బయటకు వచ్చాక గుర్తుండేవి లేవు. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు.
Also Read: భారతీయుడు 2 రివ్యూ: శంకర్ మార్క్ మిస్ - కమల్, సిద్ధూ సూపర్ - సినిమా ఎలా ఉందంటే?
రాజా రవీంద్రలో ఇంత మంచి నటుడు ఉన్నాడా? సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇంత బాగా చేస్తాడా? అని ఆశ్చర్యపరిచే చిత్రమిది. పిల్లల మీద ప్రేమ, కుటుంబ బాధ్యతలు ఉన్న తండ్రిగా, సమాజం గురించి ఆలోచించే వ్యక్తిగా చక్కటి నటన కనబరిచారు. ఈ సినిమాలో ఎక్కువ ఆకట్టుకునే నటుడు మొయిన్. తాగుబోతుగా, ప్రేమలో ఉన్న వ్యక్తిగా రెండు వేరియేషన్స్ చక్కగా చూపించారు. ట్రాన్స్ గాళ్ రోల్ చేయడం అంత సులభం కాదు. ఆ పాత్రలో యశస్విని ఓకే. మోహిత్, మధులత, ఇతర తారాగణం తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
వృత్తి, సామాజిక స్థాయిని బట్టి కాకుండా ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే... ట్రాన్స్ గాళ్ / ట్రాన్స్‌జెండర్ నేపథ్యంలో వచ్చిన సినిమా 'సారంగ దరియా'. కథలో కొత్త పాయింట్ ఉంది. సన్నివేశాల్లో ఓల్డ్ స్టైల్ ఉంది. డిఫరెంట్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు థియేటర్లకు హ్యాపీగా వెళ్ళవచ్చు.
Also Read: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?