Honeymoon Express Movie Review - 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?
Honeymoon Express Review In Telugu: చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. థియేటర్లలో ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
బాల రాజశేఖరుని
చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు
Chaitanya Rao and Hebah Patel's Honeymoon Express Movie Review: చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతో పాటు ఈ సినిమా ప్రచారంలో అమల అక్కినేని, రాఘవేంద్ర రావు, అడివి శేష్ తదితరులు ప్రముఖులు విడుదల చేయడంతో ప్రేక్షకుల దృష్టి 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' మీద పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Honeymoon Express Movie Story): ఇషాన్ (చైతన్య రావు), సోనాలి (హెబ్బా పటేల్)ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్! తొలి చూపులోనే ప్రేమలో పడతారు. ఆరు నెలల్లో ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళతారు. అయితే... ఆరు నెలల్లోనే కాపురంలో గొడవలు మొదలు అవుతాయి. రిలేషన్షిప్ కౌన్సిలర్స్ దగ్గరకు వెళతారు. ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ రిలేషన్షిప్ కౌన్సిలర్ నుంచి తిరిగి వస్తుండగా... రోడ్డులో ఓల్డ్ కపుల్ బాల (తనికెళ్ల భరణి), త్రిపుర సుందరి (సుహాసిని) పరిచయం అవుతారు. ఆ పరిచయం ఇషాన్, సోనాలి జీవితాలను మారుస్తుంది.
బాల, త్రిపుర సుందరి సలహాతో ఓ రిసార్టు (హనీమూన్ ఎక్స్‌ప్రెస్)కు వెళతారు. అందులో సోనాలికి ఇషాన్ రూపురేఖలతో ఉన్న మరొక వ్యక్తి పరిచయం అవుతాడు. అతడికి ఆమె రూపురేఖలతో మరొక మహిళ పరిచయం అవుతుంది. ఆ రిసార్టులో ఏం జరిగింది? అసలు బాల - త్రిపుర సుందరి ఎవరు? రిసార్టులో సోనాలి ఎందుకు ఫీలయ్యింది? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Honeymoon Express Movie Review): ప్రతి భార్య తన కోసం భర్త కొన్ని పనులు చేయాలని కోరుకుంటుంది. ఆమెకూ కొన్ని ఆశలు ఉంటాయి. భర్త కూడా భార్య నుంచి కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఆశలు పెట్టుకుంటాడు. తమ ఆశలకు అనుగుణంగా జీవిత భాగస్వామి లేనప్పుడు భార్య భర్తల మధ్య కలహాలు మొదలు అవుతాయి. కలహాలు పోయి కాపురం సంతోషంగా సాగాలంటే ఏం చేయాలి? అనేది ఈ సినిమా కాన్సెప్ట్.
కథగా వింటే 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓ మాదిరిగా అనిపిస్తుంది. కానీ, స్క్రీన్ మీద చూస్తే రకరకాలుగా ఉంటుంది. సినిమాలోని సంభాషణల మధ్యలో క్రియేటివిటీ, వల్గారిటీ గురించి చెబుతారు. నిజమే... ఆ రెండిటి మధ్య తేడా ఉంది. 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' స్క్రిప్ట్ చదివినప్పుడు రొమాంటిక్ సన్నివేశాలను చాలా క్రియేటివిటీగా రాశారని నటీనటులు, సాంకేతిక నిపుణులు భావించి ఉంటారు. కానీ, స్క్రీన్ మీద సీన్లు చూస్తుంటే... వల్గారిటీ ఎక్కువ కనబడుతుంది. హెబ్బా పటేల్ గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ... స్క్రీన్ మీద ఆవిడ ఎలా (అందాల ప్రదర్శన) కనిపించాలని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోరుకుంటారో? అంతకు మించి అన్నట్టు దర్శకుడు బాల రాజశేఖరుని చూపించారు. ఓ పాటలో హెబ్బా పటేల్, చైతన్య రావు సన్నివేశాల్లో వల్గారిటీ మరీ ఎక్కువ అయ్యింది.
'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ప్రారంభమే పెద్ద షాక్ ఇస్తుంది. సైక్లింగ్ సన్నివేశాలకు వరస్ట్ సీజీ వర్క్ చూసి 'ఏంటిది?' అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది. ఆ తర్వాత కార్ డ్రైవింగ్ సీన్లలో సీజీ దారుణంగా ఉంది. బడ్జెట్ లేకపోవడంతో సీన్లు చుట్టేశారని అడుగడుగునా తెలుస్తుంది. ఆ నిర్మాణ విలువల సంగతి పక్కన పెడితే... తనికెళ్ల భరణి, సుహాసిని వంటి సీనియర్ టాలెంటెడ్ ఆర్టిస్టుల చేత ఓవర్ యాక్షన్ చేయించిన ఘనత 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'కు దక్కుతుంది. ఇద్దరి నటన ఓవర్ ది బోర్డు ఉంది. చైతన్య రావు తన వరకు కొంత డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, అతడితో ఇంగ్లీష్ యాక్సెంట్ ట్రై చేస్తూ చేయించిన సీన్లు బాలేదు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన తప్ప నటన గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. అయితే బాత్ రూమ్ నుంచి టవల్ కట్టుకుని బయటకు రావడం లేదంటే థైస్, క్లీవేజ్ చూపించడం తప్పితే ఆవిడ చేసింది ఏమీ లేదు.
Also Read: నింద ఆడియన్స్ రివ్యూ - వరుణ్ సందేశ్ సినిమా టాక్ ఎలా ఉందంటే?
'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' దర్శకుడు బాల రాజశేఖరుని ప్రేక్షకులకు ఏం చెప్పాలని అనుకున్నారో క్లారిటీ లేదు. సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, ఫాంటసీ, మల్టీవర్స్... ఇది ఏ జానర్ సినిమా అనేది అర్థం కాదు. పతాక సన్నివేశాలకు ముందు చిన్న డైలాగ్ చెప్పించి జానర్ విషయంలో 'మమ' అనిపించారు. ఒకవేళ ముందు నుంచి ఆ క్లారిటీ ఇస్తే ప్రేక్షకులకు కనీసం కొన్ని సన్నివేశాలైనా అర్థం అయ్యేవి. టెక్నికల్ వేల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
పేరుకు ఇది రొమాంటిక్ సినిమా కానీ... ఆ సన్నివేశాలు, వాటిని తీసిన విధానం ప్రేక్షకులను భయపెడుతుంది. ఈ సినిమాలో కాస్త రిలీఫ్ ఏమైనా ఉందంటే... అది కల్యాణీ మాలిక్ సంగీతం ఒక్కటే. పాటలు బావున్నాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సాంగ్ బిగ్గెస్ట్ రిలీఫ్. ఆ పాటలు లేకపోతే ప్రేక్షకులు ఏమైపోయేవారో? మనసు ప్రశాంతంగా ఉండటానికి 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'కు దూరంగా ఉండటం మంచిది. కథ, కథనం, సన్నివేశాలు అర్థం కాకుండా ముందుకు సాగుతాయి. వాటితో సంబంధం లేకుండా హెబ్బా పటేల్ (Hebah Patel)ను కామ కాంక్షతో చూసి ఆనందించే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా.
Also Read: యేవమ్ రివ్యూ: అపరిచితుడు క్రిమినల్ అయితే? చాందిని చౌదరి సినిమా హిట్టా? ఫట్టా?