Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
Telangana News: ఆదిలాబాద్ జిల్లా మాలేపూర్ ఘాట్లో యాత్రికుల వాహనం బోల్తా పడిన ఘటనలో 47 మంది భక్తులకు గాయాలయ్యాయి. పోలీసులు వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Piligrims Vehicle Over Turned In Adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) యాత్రికుల వాహనం ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 47 మంది భక్తులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్‌లో యాత్రికులు ప్రయాణిస్తోన్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు గాయపడగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108, ప్రైవేట్ వాహనాల్లో రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో 60 మంది భక్తులు ఉన్నట్లు చెప్పారు. వీరంతా గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు పుష్యమాసంలో నియమ నిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువుదీరింది. ఈ మాసంలో జంగుబాయి జాతరను ఆదివాసులు నిర్వహిస్తారు. ఈ జాతర కోసం పలు రాష్ట్రాల్లో భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
మరో ప్రమాదం
అటు, వరంగల్ హైవేపై బ్రేకులు ఫెయిలై ఓ డీసీఎం వాహనం బోల్తా పడింది. ఘటకేసర్ దగ్గర్లో ఈ ఘటన జరగ్గా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. భక్తులంతా ఉప్పనూతల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Also Read: Crime News: మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ - అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన తమ్ముడు, మెదక్ జిల్లాలో దారుణం





















