Bhale Unnade Movie Review - 'భలే ఉన్నాడే' రివ్యూ: రాజ్ తరుణ్‌కు హిట్ వచ్చిందా? భలే ఉందనే సినిమాయేనా?
Bhale Unnade Review In Telugu: రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'భలే ఉన్నాడే' థియేటర్లలోకి వచ్చింది. 'పురుషోత్తముడు', 'తిరగబడరసామి' ఫ్లాపుల తర్వాత ఆయనకు విజయం వచ్చిందా? లేదా?
జె శివసాయి వర్ధన్
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, సింగీతం శ్రీనివాస్, లీలా శాంసన్, వీటీవీ గణేష్, 'హైపర్' ఆది, గోపరాజు రమణ, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, సుదర్శన్ తదితరులు
Raj Tarun's Bhale Unnade Movie Review In Telugu: జూలై 26న 'పురుషోత్తముడు' విడుదలైతే... 'తిరగబడరసామీ' ఆగస్టు 2న థియేటర్లలోకి వచ్చింది. ఆ రెండూ అంతగా ఆకట్టుకోలేదు. ఈ రోజు (సెప్టెంబర్ 13న) 'భలే ఉన్నాడే' విడుదలైంది. నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు రాజ్ తరుణ్. మారుతీ టీమ్ సమర్పణలో రూపొందిన 'భలే ఉన్నాడే' ప్రచార చిత్రాలు, పాటలు ప్రామిసింగ్‌గా అనిపించాయి. మరి, సినిమా సంగతి ఏంటి?
కథ (Bhale Unnade Movie Story): గౌరీ (అభిరామి) బ్యాంకు ఉద్యోగి. ఆమె కొడుకు పేరు రాధ (రాజ్ తరుణ్). చీర కట్టుకోవడం రాని మహిళలకు అందంగా చీర కట్టి పెట్టడం అతని వృతి. Saree Draper అన్నమాట. ఓ పెళ్లి పనుల్లో కృష్ణ (మనీషా కంద్కూర్) పరిచయం అవుతుంది. చిన్నపాటి గొడవతో మొదలైన ప్రయాణం ప్రేమలో పడుతుంది. మహిళలకు చీర కట్టినా టచ్ చేయకుండా పని చేయడం రాధ స్టైల్. దాంతో అతని మగతనం మీద కృష్ణ మదిలో సందేహాలు మొదలవుతాయి. అప్పుడు ఏం చేసింది? భర్తగా పనికిరాడని రాధపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? మహిళలకు రాధ ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతని గతం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Bhale Unnade Review Telugu): డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (కవర్ పేజీ చూసి పుస్తకం మీద ఓ అంచనాకు రావొద్దు) అని ఓ సామెత. లోపల ఏముందో ఎవరికీ తెలియదు. అదే విధంగా ఓ మనిషిని దూరం నుంచి చూసి అతడి క్యారెక్టర్ మీద ఓ అంచనాకు రాకూడదని చెప్పే సినిమా 'భలే ఉన్నాడే'. స్టోరీ పాయింట్ బావుంది, అందులో విషయం ఉంది. అయితే... కమర్షియాలిటీ పేరుతో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు కొన్ని వికటించాయి.
అమ్మాయిలు ఎంత మీద పడుతున్నా, ప్రేమించిన అమ్మాయి ముద్దులు, హగ్గుల కోసం తహతహలాడుతున్నా సరే కథానాయకుడు నిగ్రహంతో ఉంటాడు. నిజంగా అతనిలో విషయం లేదా? లేదంటే మరో కథ ఉందా? అంటే... బరువైన గతం ఉంది. హీరో తల్లి కథలో భావోద్వేగం మనసుల్ని కదిలిస్తుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఆ ఫ్లాష్‌బ్యాక్ బావుంది. అయితే అక్కడి వరకు వచ్చిన సినిమాలో తడబాట్లు కనిపించాయి.
శారీ డ్రెపర్ క్యారెక్టర్, అమ్మాయిలకు దూరంగా ఉండే రాజ్ తరుణ్ మీద ఇరుగు పొరుగుతో పాటు కథ వింటున్న వీటీవీ గణేష్ వేసే సెటైర్లు, హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు సరదాగా సాగుతాయి. అయితే... ఇంటర్వెల్ తర్వాత వచ్చే కామెడీ అంతగా ఆకట్టుకోలేదు. ఆశ్రమంలో 'రచ్చ' రవి ఎపిసోడ్ టూమచ్ అనిపిస్తుంది. కథలో కీలకమైన 'సింగీతం' శ్రీనివాసరావు, లీలా శాంసన్ ట్రాక్ నిడివి ఎక్కువైంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన సురద్శన్ ట్రాక్ రొటీన్‌గా ఉంది తప్ప అంతగా నవ్వించలేదు. అయితే... అమ్మ గతం గుండెలు బరువెక్కేలా చేసింది.
కథనం పరంగా కొత్తదనం లేదు కానీ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తీరులో దర్శక రచయితలు చక్కటి ప్రతిభ కనబరిచారు. అమ్మ పాత్రకు, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో డైలాగులు బావున్నాయి. హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాల్లో మాటలు కూడా! అయితే... హీరో ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడు? అనేది బలంగా చెప్పాల్సిన చోట తల్లి గొప్పదనం, తండ్రి లేని లోటు గురించి హీరోతో చెప్పించి అసలు విషయం కొసరున పడేశారు. ప్రేక్షకుడి ఊహకు ఆ విషయం వదిలేశారు. అర్థం చేసుకోమని వదిలేశారీ తప్ప చెప్పలేదు. దాంతో మెయిన్ పాయింట్ కాస్త సైడ్ ట్రాక్ అయ్యి కథ మరో యాంగిల్ తీసుకుని రొటీన్ అయ్యింది.
శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్ బావుంది. విశాఖను, హీరో హీరోయిన్లను అందంగా చూపించారు. రాజ్ తరుణ్ రీసెంట్ సినిమాల్లో బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ 'భలే ఉన్నాడే' అని చెప్పాలి. ప్రొడ్యూసర్ ఎన్వీ కిరణ్ కుమార్ కాంప్రమైజ్ కాలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తోంది. రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ కనిపించాయి.
రాధ పాత్ర కోసం రాజ్ తరుణ్ తన హుషారు, ఎనర్జీని పక్కన పెట్టేశారు. కామ్ అండ్ కంపోజ్డ్ యాక్టింగ్ చేశారు. నటనలోనే కాదు, మాటలోనూ స్పష్టమైన మార్పు మనకు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా తల్లి గురించి చెప్పే సన్నివేశాల్లో రాజ్ తరుణ్ నటన బావుంది. కొత్తగా కనిపించారు. కృష్ణగా మనీషా కంద్కూర్ మిస్ మ్యాచ్ అనిపించారు. ఆమె నటనలో మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ తరహాలో కొన్ని సన్నివేశాల్లో కనిపించారు.
రాజ్ తరుణ్ కంటే సినిమాలో ఎక్కువ ఆకట్టుకునే పాత్ర అభిరామిది. తల్లిగా ఆమె అద్భుతంగా నటించారు. మోడ్రన్ మదర్ అనొచ్చు. తన కొడుకు చేసే వంట నచ్చి సహోద్యోగి ప్రేమలో పడుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఇష్టపడిన వాళ్లిద్దరి మధ్య రాయబారం చేసే సన్నివేశాల్లో అభిరామి భలే నటించారు. అమ్ము అభిరామి నటన ఆయా సన్నివేశాలకు హుందాతనం తీసుకొచ్చింది. సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్ కీలక పాత్రల్లో కనిపించారు.
'హైపర్' ఆది, సుదర్శన్, వీటీవీ గణేష్, కృష్ణ భగవాన్, పటాస్ ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, 'రచ్చ' రవితో పాటు కొందరు హాస్య నటులు సినిమాలో ఉన్నారు. కొన్ని పంచ్ డైలాగ్స్ పేలాయి. కొన్ని కుదరలేదు. అందరి కంటే రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్ ఎక్కువ నవ్విస్తుంది. హీరోయిన్ తండ్రిగా శ్రీనివాస్ వడ్లమాని, హీరో మావయ్యగా గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. వాళ్లిద్దరూ ఆయా పాత్రలకు హుందాతనం తీసుకొచ్చారు.
రాజ్ తరుణ్ లాస్ట్ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే 'భలే ఉన్నాడే' చాలా అంటే చాలా బెటర్ ప్రోడక్ట్. ఇదొక డీసెంట్ సినిమా. కామెడీ సీన్లు కొన్ని నవ్విస్తాయి. ఆ మదర్ ఫ్లాష్‌బ్యాక్ బావుంది. హీరో క్యారెక్టరైజేషన్, అందులో రాజ్ తరుణ్ నటన కూడా!
Also Read: ఏఆర్ఎమ్ రివ్యూ: టోవినో థామస్ ట్రిపుల్ ధమాకా - అదరగొట్టిన మలయాళ స్టార్... సినిమా ఎలా ఉందంటే?