Alanaati Ramachandrudu Movie Movie Review - అలనాటి రామచంద్రుడు రివ్యూ: 'అర్జున్ రెడ్డి' జమానాలో ఇటువంటి చిత్రమా - కృష్ణ వంశీ సినిమా ఎలా ఉందంటే?
Alanaati Ramachandrudu Review In Telugu: కృష్ణ వంశీ, మోక్ష జంటగా నటించిన 'అలనాటి రామచంద్రుడు' ప్రచార చిత్రాలు, పాటలతో ప్రేక్షకుల్ని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
చిలుకూరి ఆకాష్ రెడ్డి
కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్, వెంకటేష్ కాకుమాను తదతరులు
కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన 'మురారి' సినిమాలో క్లైమాక్స్ సాంగ్ 'అలనాటి రామచంద్రుడు' ఇప్పటికీ వివాహాది శుభకార్యాల్లో వినబడుతుంది. అంత పాపులర్! ఇప్పుడు 'అలనాటి రామచంద్రుడు' అంటూ కృష్ణ వంశీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ కృష్ణ వంశీ, ఈ కృష్ణ వంశీ వేర్వేరు. ఎస్... హీరో కృష్ణ వంశీ, హీరోయిన్ మోక్ష జంటగా నటించిన సినిమా (Alanaati Ramachandrudu Movie) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, ప్రచార చిత్రాలు బావున్నాయి. మరి సినిమా? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Alanaati Ramachandrudu Story): సిద్ధు (కృష్ణ వంశీ) ఇంట్రావర్ట్. అందరితో కలవడు. ధరణి (మోక్ష) అంటే అతనికి ఇష్టం.అయితే, తన స్వభావం వల్ల ఆమెతో ఆ విషయాన్ని చెప్పడు. పలు ప్రయత్నాలు చేసి చేసి విఫలమైన తర్వాత కాలేజీ ఆడిటోరియంలో అందరి ముందు చెప్పడానికి రెడీ అవుతాడు. అప్పుడు ధరణి వేరే అబ్బాయిని ఇష్టపడుతుందని తెలిసి వెనక్కి వచ్చేస్తాడు.
ప్రేమించిన అబ్బాయితో మనాలి వెళ్లాలని ధరణి అనుకుంటుంది. అయితే, ఆ అబ్బాయి కాకుండా సిద్ధు ఎందుకు వెళ్లాడు? అక్కడ ధరణి గతం మర్చిపోవడానికి కారణం ఏమిటి? ధరణికి మళ్లీ గతం గుర్తుకు వచ్చిందా? లేదా? ధరణికి తన ప్రేమ సంగతి సిద్ధు చెప్పాడా? లేదా? వాళ్లిద్దరూ మళ్లీ కలిశారా? లేదా? సిద్ధు, ధరణిల పరిచయం ఎప్పటిది? చివరకు ఏమైంది? అనేది 'అలనాటి రామచంద్రుడు' చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Alanaati Ramachandrudu Review Telugu): 'అలనాటి రామచంద్రుడు' టైటిల్ కొంచెం ఓల్డ్, క్లాసిక్ స్టైల్‌లో ఉంది కదూ! సినిమానూ క్లాసీగా తీయాలని దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి ప్రయత్నించారు. ఆయనలో మంచి అభిరుచి ఉంది. చక్కటి సంగీతం తీసుకున్నారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా తీయడంలో తప్పటడుగులు పడ్డాయి.
'అలనాటి రామచంద్రుడు' టైటిల్‌లో క్లాసిక్ ఫీల్ ఉంది. సంగీతంలోనూ ఆ క్లాసిక్ స్టైల్ వినిపించింది. ఒక్కటని కాదు, సినిమాలో ప్రతి పాట బావుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీలు ఉన్నాయి. నేపథ్య సంగీతం సైతం బావుంది. సంగీత దర్శకుడు ఫీలైనట్టు... ప్రేక్షకులు ఫీలయ్యేలా సన్నివేశాలు అన్నీ లేవు. సంగీత దర్శకుడు, గేయ రచయితల నుంచి మంచి పాటలు తీసుకున్న ఆకాష్ రెడ్డి, ఆ స్థాయిలో సన్నివేశాలను మలచలేదు.
'అలనాటి రామచంద్రుడు' కథలో, హీరో క్యారెక్టరైజేషన్‌లో నావెల్టీ కొంత వరకు బావుంది. తర్వాత తర్వాత బోర్ కొట్టింది. కాలేజీ సన్నివేశాలు, అమ్మాయికి తన ప్రేమ చెప్పలేక అబ్బాయి పడే పాట్లు నవ్విస్తాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలై 'పడి పడి లేచే మనసు' తరహాలో ముందుకు సాగి సాగి శుభం కార్డుకు చేరుకుంది. ముందు చెప్పినట్టు సంగీతం బావుంది. కెమెరా వర్క్ కూడా! కథ, కథనంలో కొత్తదనం గానీ, ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసే 'వావ్' ఫ్యాక్టర్ గానీ లేవు. వీఎఫ్‌ఎక్స్ బాలేదు. కొండల్లో సీన్లు గ్రీన్ మ్యాట్‌లో తీసినట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.
సినిమా పేరుకు తగ్గట్టు హీరోది రామచంద్రుడి లాంటి క్యారెక్టర్. కానీ, ఈ కాలంలో అటువంటి అబ్బాయిలు ఉంటారా? అంటే... 'అవును' అని చెప్పడం కష్టమే. రీల్ కెమెరాల్లో ఫోటోలు తీయడం, జ్ఞాపకాలను క్యాసెట్టుల్లో భద్రంగా దాచుకోవడం ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? అందువల్ల, ఆ పాత్రలో ఓ నావెల్టీ, నోస్టాల్జియా ఉన్నాయి. కానీ... ఆ హీరో పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేయడం కష్టమే. డెప్త్ ఉన్న డైలాగులు రాశారు. కానీ, అందుకు తగ్గట్టు సీన్లు, డైరెక్షన్ లేవు. సెకండాఫ్ కంప్లీట్ గ్రాఫ్ తప్పింది. త్వరగా శుభం కార్డు వేస్తే ఇంటికి వెళ్లిపోతామనేలా ఉంది.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?
హీరోయిన్ మోక్షది ఎక్స్‌ప్రెస్సివ్ ఫేస్. స్వీట్, క్యూట్, బబ్లీ అమ్మాయిగా ధరణి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేసింది. హీరో కృష్ణ వంశీ మొదటి సినిమాకు బరువైన పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రేమను చెప్పలేక ఇబ్బంది పడేటప్పుడు ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. ఎమోషనల్ సీన్లు వచ్చేసరికి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి కామెడీ నవ్విస్తుంది. సుధ, బ్రహ్మజీ, ప్రమోదిని, కేశవ్ దీపక్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
ఇటువంటి మంచి అబ్బాయిలు, స్వచ్ఛమైన ప్రేమ కథలు ఉంటాయా? అని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చేసే సినిమా 'అలనాటి రామచంద్రుడు'. కథ, ఆ హీరో క్యారెక్టరైజేషన్‌లో నావెల్టీ ఉంది. కానీ, అది ఆడియన్స్ ఫీల్ అయ్యేలా డైరెక్షన్ లేదు. స్క్రీన్ మీద నుంచి సీట్స్ వరకు కన్వర్ట్ కాలేదు. సంగీతం మాత్రం సూపర్బ్. పాటల కోసం థియేటర్లకు వెళ్లాలని అనుకునే ప్రేక్షకులు హ్యాపీగా వెళ్ళవచ్చు. ఈ రోజుల్లో తీయాల్సిన సినిమా కాదేమో!? 'అర్జున్ రెడ్డి' జమానాలో ఈ తరహా సినిమాలకు, అందులోనూ కొత్తవాళ్లతో తీసిన సినిమాలను ఎంత మంది ఆదరిస్తారు? థియేటర్లకు ఎంత మంది వస్తారు? అనేది చెప్పలేం.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?