Citadel Review: ప్రియాంక చోప్రా హై బడ్జెట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
ప్రియాంక చోప్రా నటించిన భారీ బడ్జెట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
న్యూటన్ థామస్ సిగెల్, జెస్సికా యు, రుసో బ్రదర్స్
రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : సిటాడెల్
రేటింగ్ : 3/5
నటీనటులు : రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా, స్టాన్లే టుక్సి, లెస్లే మ్యాన్‌విల్లే, ఓసీ ఇఖిలే, యాష్లే కమ్మింగ్స్ తదితరులు
ఛాయాగ్రహణం : న్యూటన్ థామస్ సిగెల్, మైకేల్ వుడ్
సంగీతం : అలెక్స్ బెల్చర్
దర్శకత్వం : న్యూటన్ థామస్ సిగెల్, జెస్సికా యు, రుసో బ్రదర్స్
నిర్మాణం : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
ఎపిసోడ్స్ : 2 (వారానికి ఒకటి చొప్పున విడుదల అవుతాయి)
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
Citadel Series Review: ప్రియాంక చోప్రా నటించిన భారీ బడ్జెట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. ఎందుకంటే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన రాజ్, డీకే ఇండియన్ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంగ్లిష్ వెర్షన్‌కు ‘అవెంజర్స్’, ‘కెప్టెన్ అమెరికా’ సినిమాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ హాలీవుడ్ వెర్షన్ తెరకెక్కించారు. ఇందులో మొదటి రెండు ఎపిసోడ్లు ప్రస్తుతం ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి?
కథ (Citadel Series Story): మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా) గ్లోబల్ స్పై ఏజెన్సీ సిటాడెల్‌కు చెందిన టాప్ ఏజెంట్లు. ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తే అది తమ కోసం వేసిన ట్రాప్ అని తెలుస్తుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో మేసన్ తన గతాన్ని మర్చిపోతాడు. ఆ సమయంలోనే సిటాడెల్ కూడా అంతం అయిపోతుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత సిటాడెల్ ఏజెంట్ల వివరాలు, న్యూక్లియర్ కోడ్స్ ఉన్న ఒక బ్లాక్ బాక్స్ సీఐఏకి దొరికిందని ‘మాంటికోర్’ అనే టెర్రరిస్ట్ సంస్థకు తెలుస్తుంది. వారు కూడా ఆ బాక్స్ కోసం ఎప్పటినుంచో వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఈ గేమ్‌లోకి మేసన్ కేన్ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నాదియా ఏం అయింది? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ: ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో రెండు ఎపిసోడ్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్లలో కథ కొంచెమే రివీల్ చేశారు. ఒక కుట్ర కారణంగా సమూలంగా అంతం అయిన ఒక స్పై ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు ప్రపంచాన్ని కాపాడటానికి మళ్లీ ఎలా కలిశారన్నది ఈ ఎపిసోడ్లలో చూపించారు. అసలు ప్రమాదం ఏంటి? సిటాడెల్‌లో ఉన్న డబుల్ ఏజెంట్ ఎవరు? ఇలా చాలా ప్రశ్నలు ఈ రెండు ఎపిసోడ్లు చూశాక మనకి తలెత్తుతాయి. తర్వాతి ఎపిసోడ్ల కోసం ఎదురు చూసేలా చేస్తాయి. నిజానికి మేకర్స్‌కు కావాల్సింది కూడా ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే. అందులో మాత్రం సక్సెస్ అయ్యారు.
ఒక్కో ఎపిసోడ్ నిడివి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి రెండు ఎపిసోడ్లను గంటన్నర లోపే స్ట్రీమ్ చేయవచ్చు. మొదటి సన్నివేశం నుంచే కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తారు. పాత్రల పరిచయానికి ప్రత్యేకంగా సమయం తీసుకోకుండా కథలో భాగంగానే పాత్రల పరిచయం జరిగేంత టైట్‌గా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు.
ఈ సిరీస్‌లో కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అవే కథకు పెద్ద ప్లస్ పాయింట్. మొదటి ఎపిసోడ్‌లో ట్రైన్‌లో వచ్చే యాక్షన్ సీన్, రెండో ఎపిసోడ్ చివర్లో యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. దాదాపు రూ.2,500 కోట్ల బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆ ఖర్చు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీలైనంత పెద్ద స్క్రీన్ మీద ఈ సిరీస్‌ను చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... సిరీస్ ప్రధానంగా రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రాల పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇప్పటి వరకైతే వీరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. మిగతా నటులందరూ తమ పరిధి మేర నటించారు.
Also Read: పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఎలా ఉంది?
ఓవరాల్‌గా చెప్పాలంటే... స్పై, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ‘సిటాడెల్’ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ గురించి కూడా మొదటి ఎపిసోడ్‌లో చిన్న టీజ్ ఇచ్చారు.
Also Read: ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?