Chor Bazaar Movie Review: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?
ఆకాష్ పూరి లేటెస్ట్ మూవీ చోర్ బజార్ ఎలా ఉందంటే?
జీవన్ రెడ్డి
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సంపూర్ణేష్ బాబు తదితరులు
సినిమా రివ్యూ: చోర్ బజార్
రేటింగ్: 1.5/5
నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సంపూర్ణేష్ బాబు తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాణ సంస్థ: ఐవీ ప్రొడక్షన్స్
దర్శకత్వం: జీవన్ రెడ్డి
విడుదల తేదీ: జూన్ 24, 2022
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం చోర్ బజార్. జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డైమండ్ రాబరీ నేపథ్యంలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నామనే ఫీలింగ్‌ను ఈ సినిమా ట్రైలర్ కలిగించింది. మరి సినిమా ఎలా ఉంది?
కథ: హైదరాబాద్‌లో దొంగ సామాన్లు అమ్మే ఏరియా చోర్ బజార్. ఆ ఏరియా మొత్తం బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) కంట్రోల్‌లో ఉంటుంది. సిమ్రన్ (గెహనా సిప్పీ) అనే మూగమ్మాయిని బచ్చన్ ప్రేమిస్తాడు. తను కూడా బచ్చన్‌ను ఇష్టపడుతుంది. ఇంతలో హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ.200 కోట్ల విలువ చేసే నైజాం కాలం నాటి వజ్రం మిస్ అవుతుంది. ఆ వజ్రం ఏం అయింది? బచ్చన్ సాబ్ తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ని మూయించాలనుకుంటున్న గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) కథేంటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: దర్శకుడు జీవన్ రెడ్డి సినిమాను కొంచెం ఆసక్తికరంగానే ప్రారంభిస్తారు. డైమండ్ దొంగతనంతో ఇంట్రస్టింగ్‌గా ప్రారంభమైన సినిమా ఆ తర్వాత చప్పగా సాగుతుంది. ఎక్కడా సినిమా గ్రాఫ్ మిల్లీమీటర్ కూడా పైకి లేవకుండా జాగ్రత్తగా తీసినట్లు అనిపిస్తుంది. డైమండ్ నేపథ్యంలో ప్రారంభించిన సినిమాలో చాలా ఉపకథలను చొప్పించారు. హీరో, హీరోయిన్ల మూగ ప్రేమకథ, చోర్ బజార్ నేపథ్యం, మినిస్టర్ ట్రాక్, మరోవైపు ఉమెన్ ట్రాఫికింగ్... ఇలా చాలా పాయింట్లు టచ్ చేశారు. దీంతో సినిమా మొత్తం కిచిడి అయిపోయిన ఫీలింగ్ వస్తుంది.
వజ్రం దొంగతనం జరిగాక దాని చుట్టూ తిరిగే ఎపిసోడ్ చాలా సిల్లీగా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా కామెడీ చేసేసినట్లు అనిపిస్తే అది ఆడియన్స్ తప్పు కాదు. చోర్ బజార్ మూసేయించాలనే టార్గెట్‌తో పని చేసే సుబ్బరాజు ట్రాక్ సినిమాలో మరో బోరింగ్ ఎలిమెంట్. సినిమా మొత్తం చోర్ బజార్ మూసేయించాలనే లక్ష్యంతో పనిచేసి, చివర్లో ఆకాష్ పూరి చేతికి గన్ ఇచ్చి ‘మనలో మనకి ఎన్నయినా ఉంటాయి. బయట వాళ్లు రాకూడదు.’ అనడాన్ని బట్టి సినిమాను ఎంత సీరియస్‌గా తీశారో అర్థం చేసుకోవచ్చు. సునీల్, సుబ్బరాజు, సంపూర్ణేష్ బాబు వంటి ఆర్టిస్టులను పెట్టుకుని కూడా వారికి తగ్గ పాత్రలు రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సునీల్ తెలంగాణ యాస ఇబ్బంది పెడుతుంది.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన పాటల్లో ‘జడ’, ‘నూనుగు మీసాల’ చూడబుల్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం సోసో గానే ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఆకాష్ పూరి గత చిత్రాల్లానే ఇందులో కూడా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా నటనలో చాలా మెరుగవ్వాల్సి ఉంది. పూరి హీరోల ఛాయలు ఆకాష్ పెర్ఫార్మెన్స్‌లో ఎప్పటినుంచో కనిపిస్తాయి. ముందు దాని నుంచి బయటకు రావడానికి ఆకాష్ ప్రయత్నించాలి. మూగ పాత్రలో కనిపించిన గెహనా సిప్పీ పర్వాలేదనిపించింది. నిరీక్షణ ఫేమ్ అర్చన మెప్పిస్తారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... రెండు గంటల పాటు ఈ చోర్ బజార్‌ను భరించడం చాలా కష్టం.
Also Read: 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Also Read: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?