Konda Movie Review - 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Konda Telugu Movie Review: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కొండా సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. కొండా మురళి, సురేఖ జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రమిది.
రామ్ గోపాల్ వర్మ
త్రిగుణ్, ఇర్రా మోర్, పృథ్వీరాజ్ తదితరులు
సినిమా రివ్యూ: కొండా
రేటింగ్: 2/5
నటీనటులు: త్రిగుణ్, ఇర్రా మోర్, ప్రశాంత్ కార్తీ, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, '30 ఇయర్స్' పృథ్వీరాజ్, ఎల్బీ శ్రీరామ్, తులసి, పార్వతి అరుణ్ తదితరులు
మాటలు: భరత్ కుమార్ పోగుల
సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి
సంగీతం: డి.ఎస్.ఆర్
సహ నిర్మాత: సుమంత్ నార్ల
నిర్మాత: కొండా సుష్మిత పటేల్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేదీ: జూన్ 23, 2022
రాయలసీమ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' తీశారు. ముంబై మాఫియా నేపథ్యంలో 'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలు తీశారు. బెజవాడ రౌడీయిజం నేపథ్యంలోనూ సినిమా తీశారు. సమాజంలో సంచలనం రేకెత్తించిన సంఘటనలు, నిజ జీవిత వ్యక్తులపై సినిమాలు తీయడం వర్మకు అలవాటు. తెలంగాణ నేపథ్యంలో ఆయన తీసిన సినిమా కొండా. మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Konda Movie Story): సమాజంలో అన్యాయం జరిగితే సహించలేని వ్యక్తి కొండా మురళి (త్రిగుణ్). కాలేజీలో అతనికి విప్లవ భావాలు ఉన్న ఆర్కే (ప్రశాంత్ కార్తీ) పరిచయమవుతాడు. కాలేజీలో పరిచయమైన సురేఖ (ఇర్రా మోర్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దళం సభ్యులతో ఆర్కేకు పరిచయాలు ఉన్నాయి. అతడూ దళంలో సభ్యుడు. ఆర్కేతో పాటు కొండా మురళి కూడా దళం కార్యకలాపాల్లో పాల్గొంటాడు. కొందరిని చంపుతాడు. కొండా మురళిని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవాలని, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయాలని నల్ల సుధాకర్ (పృథ్వీ) ప్రయత్నిస్తాడు. అయితే... నల్ల సుధాకర్ గురించి తెలుసుకున్న కొండా మురళి దూరం జరుగుతాడు. ఆ తర్వాత కొండా మురళిని చంపించాలని నల్ల సుధాకర్ ప్లాన్స్ వేస్తాడు. వాటి నుంచి కొండా మురళి ఎలా బయటపడ్డాడు? ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: బయోపిక్స్ తీయడంలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక శైలి. బయోపిక్‌లో ఎంత విషయం ఉంది? ఆయన చూపించినది నిజమా? కాదా? అనేది పక్కన పెడితే... ఆ బయోపిక్ చుట్టూ నెలకొన్న వివాదాలు సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేవి. 'కొండా' విషయంలోనూ కొంత వివాదం నడిచింది. ప్రీ రిలీజ్ వేడుకలో ఎర్రబెల్లి దయాకర్ రావుపై కొండా దంపతుల కుమార్తె, సుష్మిత పటేల్ ఆరోపణలు చేశారు. అయితే... వర్మ గత సినిమాలకు వచ్చిన క్రేజ్ ఈ సినిమాకు రాలేదు. వివాదాలు, విమర్శలు పక్కన పెట్టి సినిమా ఎలా ఉండనే విషయానికి వస్తే...
సినిమా ఎలా ఉంది? (Konda Review): ప్రజలకు తెలిసిన విషయాలను, కథను ఆసక్తికరంగా చెప్పడం అంత సులభం ఏమీ కాదు. ఏమాత్రం ఆసక్తి సన్నగిల్లినా సరే ప్రేక్షకులు ఫోన్ లేదా పక్క చూపులు చూసే అవకాశం ఉంది. 'కొండా' సినిమా విషయంలో అదే జరిగింది. ఒకప్పటి వర్మ కనిపించలేదు. ఒక విధమైన కెమెరా యాంగిల్స్, నేపథ్య సంగీతానికి అలవాటు పడిన వర్మ చాలా సన్నివేశాల్లో కనిపించారు. కథలో ఉన్న ఫైర్ స్క్రీన్ మీదకు రాలేదు.
ఇంటర్వెల్ ముందు, తర్వాత సన్నివేశాలను ఉన్నంతలో వర్మ బాగా తీశారు. అక్కడ ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. 'కొండా' టైటిల్ సాంగ్, 'సురేఖమ్మ...' పాటలో వర్మ మార్క్ కనిపించింది. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిర్మాణ, సాంకేతిక విలువలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. నక్సలిజం నేపథ్యంలో సన్నివేశాలను మరీ సిల్లీగా తీశారు.
నటీనటులు ఎలా చేశారు?: వర్మ హీరోలా త్రిగుణ్ నటించారు. ఇంతకు ముందు సినిమాల్లో చేసిన పాత్రలకు, ఈ సినిమాలో పాత్రకు వ్యత్యాసం ఉండటంతో కొత్త త్రిగుణ్ కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఇంటెన్స్ చూపించారు. ఇర్రా మోర్ నటన ఆకట్టుకోవడం కష్టం. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా... కమర్షియల్ హంగులు అనుకున్నా... 'తెలంగాణ పోరి' పాట సురేఖ నిజ జీవిత వ్యవహార శైలికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆర్కే పాత్రలో ప్రశాంత్ కార్తీ, భారతక్కగా పార్వతి అరుణ్ పర్వాలేదు. 'జబర్దస్త్' రామ్ ప్రసాద్ సీరియల్ రోల్ చేశారు. పృథ్వీరాజ్, ఎల్బీ శ్రీరామ్, తులసి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: వెండితెరపై కొండా దంపతుల జీవితాన్ని ఆకట్టుకునేలా వర్మ చెప్పలేదు. కథలో మలుపులు సైతం ఆసక్తికరంగా లేవు. ఇంటర్వెల్ ముందు, తర్వాత సన్నివేశాలకు తోడు 'కొండా...' టైటిల్ సాంగ్, 'సురేఖమ్మ...' పాట బాగున్నాయి. సహజత్వానికి దగ్గరగా, తనదైన శైలిలో సినిమా తీశారు వర్మ.
Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?