Andhra King Taluka Movie Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' రివ్యూ: అభిమాని హీరో అయితే... ఫ్యాన్స్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉందా?
Andhra King Taluka Review Telugu: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉందంటే?
మహేష్ బాబు పి
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు
Ram Pothineni's Andhra King Taluka Review In Telugu: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' హిట్ తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన చిత్రమిది. అభిమాని బయోపిక్ అంటూ ప్రచారం చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఏముంది? అనేది చూస్తే...
కథ (Andhra King Taluka Movie Story): ఆంధ్ర కింగ్ సూర్య (ఉపేంద్ర)కు వరుసగా తొమ్మిది ఫ్లాపులు వస్తాయి. దాంతో ఆయన వందో సినిమా చిక్కుల్లో పడుతుంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడు కోట్లు కావాలని, తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ పెట్టేశానని, డిస్ట్రిబ్యూటర్లు - ఫైనాన్షియర్ల నుంచి రూపాయి అప్పు పుట్టలేదని ఆ సినిమా నిర్మాత చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఓ అభిమాని నుంచి మూడు కోట్లు సూర్య అకౌంటులో పడతాయి.
సూర్యకు రాజమండ్రి సమీపంలోని లంక గ్రామాల్లోని గూడిపల్లి లంకకు చెందిన సాగర్ (రామ్ పోతినేని) వీరాభిమాని. లంక నుంచి పడవల్లో పొరుగూరు వెళ్లి చేతి పనులు చేసుకుని రాత్రికి మళ్లీ ఊరు వెళ్లడం గ్రామస్తులకు అలవాటు. అయితే మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) కుమార్తె, కాలేజీలో తన జూనియర్ (భాగ్యశ్రీ బోర్సే)ను ప్రేమిస్తాడు సాగర్. విషయం తెలిసి సాగర్ ఊరిని, అతడిని అవమానిస్తాడు పురుషోత్తం. లంకలో థియేటర్ కట్టి సూర్య వందో సినిమా విడుదల చేసి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు సాగర్. మరి సూర్య వందో సినిమా ఆగిందని తెలిసి ఏం చేశాడు? మూడు కోట్ల డబ్బు సాగర్ దగ్గరకు ఎలా వచ్చింది? సాగర్ తనను మోసం చేశాడని మహాలక్ష్మి ఎందుకు ఫీలైంది? అభిమాని కోసం సూర్య ఏం చేశాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Andhra King Taluka Review Telugu): హీరోల కోసం సొంత కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఆస్తులు, లక్షలకు లక్షలు ఖర్చు చేసిన అభిమానులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. 'నేనింతే'లో పూరి జగన్నాథ్ అటువంటి అభిమాని (సాయిరామ్ శంకర్ చేసిన పాత్ర)ని చూపించారు. హీరో కోసం కోట్లకు కోట్లు ఓ ఫ్యాన్ ఇచ్చాడని నమ్మాలంటే... అభిమానిపై హీరో చూపించిన ప్రభావం చాలా బలంగా ఉండాలి. హీరోపై పిచ్చి ప్రేమకు చూపించిన కారణం కన్వీన్సింగ్‌గా ఉండాలి. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో అది మిస్ అయ్యింది.
అభిమాని కథను చెప్పాలనే దర్శకుడు మహేష్ బాబు పి ఆలోచన బావుంది. కానీ ఆ ఆలోచన కథగా మారే క్రమంలో కాస్త తడబాటు కనిపించింది. ఆయన ప్రయత్నంలో నిజాయితీ ఉంది. కానీ కథనంలో వేగం లేదు. అభిమానులు కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషన్ లేదు. అభిమాని - హీరో కథలో అభిమాని ఎక్కువ, హీరో తక్కువ కనిపించాడు. పేరుకు హీరో ప్రస్తావన కొన్ని సన్నివేశాల్లో వస్తుంది. కానీ ఇంపాక్ట్ అనేది మిస్ అయ్యింది. దాంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిడివి ఎక్కువ అవుతుంది. స్టోరీ పాయింట్ ఓకే. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా స్టార్ట్ టు ఎండ్ ఎంగేజ్ చేసేలా సినిమాను తీయలేదు. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్‌లో క్లైమాక్స్ బావుంది. అక్కడ ఎమోషన్ వర్కవుట్ అయ్యింది.
దర్శకుడిగా మహేష్ బాబు మేకింగ్ బావుంది. రచయితగా కొన్ని డైలాగులు బాగా రాశారు. సంభాషణల్లో సహజత్వం కనిపించింది. అయితే సన్నివేశాలను క్లుప్తంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. హీరో - ఫ్యాన్ & లవ్ ట్రాక్... రెండిటిలోనూ బిలీవబిలిటీ లేదు. కుమార్తె ప్రేమ విషయం తెలిసి తండ్రి రియాక్ట్ కావడంలో గానీ, హీరో ఎదుగుదలలో గానీ రొటీన్ ప్యాట్రన్ ఫాలో అయ్యారు.
వివేక్ - మెర్విన్ సంగీతం ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఎక్కడ ఆర్ఆర్ అవసరమో అక్కడ వినిపించింది. అనవసరమైన హీరో ఎలివేషన్స్ దర్శకుడు మహేష్ రాయలేదు. సంగీత దర్శకులూ ఎలివేట్ చేసే ప్రయోగాలు చేయలేదు. పాటల్లో 'నువ్వుంటే చాలే' బావుంది. సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ నూని రాజమండ్రి పరిసర ప్రాంతాలను కొత్తగా చూపించారు. కలర్ ప్యాట్రన్, విజువల్స్ నీట్‌గా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చు చేసిన సంగతి తెరపై కనపడుతోంది.
Also Read: 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
సాగర్ పాత్రలో రామ్ పోతినేని లుక్ బావుంది. కంటెంట్, స్క్రీన్‌తో సంబంధం లేకుండా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఆడియన్స్ చూసేలా సాగింది రామ్ నటన. ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రజెన్స్ కూడా. రామ్, భాగ్యశ్రీ పెయిర్ బావుంది. వాళ్ళిద్దరి సన్నివేశాలు బాగా వచ్చాయి.
ఉపేంద్ర స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో ఆయన బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. హీరో తండ్రిగా రావు రమేష్, హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మవి రొటీన్ రోల్స్. కానీ వాళ్ళ నటన వల్ల కొన్ని సన్నివేశాలు నిలబడ్డాయి. సత్యను కామెడీ కోసం కాకుండా కేవలం ఒక పాత్రలో చూపించిన సినిమా బహుశా ఈమధ్య కాలంలో ఇదే అయ్యి ఉంటుంది. రాహుల్ రామకృష్ణ, శివారెడ్డి, రాజీవ్ కనకాల, తులసి, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
కిందకు పడిన ప్రతిసారీ పైకి లేచి నిలబడాలని హీరో (ఉపేంద్ర) చెప్పిన మాటతో అభిమాని (రామ్ పోతినేని) స్ఫూర్తి పొందుతాడు. 'పడు పడు లేచి మళ్ళీ పడు... నిలబడు' - సినిమాలో ఓ పాట ఇది. అందుకు తగ్గట్టు సినిమా సాగింది. కొన్నిసార్లు డౌన్ అయినట్టు అనిపించినా చివరకు లేచి నిలబడింది. రామ్ పోతినేని నటన, దర్శకుడు మహేష్ బాబు ప్రయత్నంలో నిజాయతీ కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒక్కసారి చూసి రావచ్చు.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?





















