Love OTP Review - 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
Love OTP Review Telugu: అనీష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'లవ్ ఓటీపీ'. రాజీవ్ కనకాల ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
అనీష్ తేజేశ్వర్
అనీష్ తేజేశ్వర్, రాజీవ్ కనకాల, జాన్విక కళాకేరి, ఆరోహి నారాయణ్, ప్రమోదిని, నాట్య రంగ, తులసి తదితరులు
Love OTP Movie Review In Telugu: అనీష్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'లవ్ ఓటీపీ'. శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఇందులో హీరో తల్లిదండ్రులుగా ప్రమోదిని, రాజీవ్ కనకాల నటించారు. ఆరోహి నారాయణ్, జాన్విక కళాకేరి హీరోయిన్లు. నవంబర్ 14న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Love OTP Movie Story): అక్షయ్ (అనీష్) క్రికెటర్. తొలుత రంజీకి, అక్కడ నుంచి జాతీయ జట్టుకు ఆడాలనేది అతని కల. తండ్రి (రాజీవ్ కనకాల) పోలీస్. ఆయనకు భయపడి అమ్మాయిలు, ప్రేమ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. అటువంటి అబ్బాయిని ప్రేమలో పడేస్తుంది సన (ఆరోహి నారాయణ్). తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను ప్రేమిస్తాడు అక్షయ్. బ్రేకప్ చెప్పాలని అనుకున్నా... చెబితే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆగుతాడు. సన టార్చర్ భరించలేక బాధ పడుతున్న అక్షయ్ జీవితంలోకి నక్షత్ర (జాన్విక కళాకేరి) వస్తుంది. ఆమెనూ ప్రేమిస్తాడు.
నక్షత్రతో అక్షయ్ ప్రేమలో పడిన సంగతి సనాకు తెలిసిందా? లేదా? తన కంటే ముందు అక్షయ్ మరొక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, ఆమెతోనూ - తనతోనూ ఇద్దరితో ఒకేసారి ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని నక్షత్రకు తెలిసిందా? లేదా? అక్షయ్ నిజంగా ప్రేమిస్తున్నది ఎవరిని? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Love OTP Review Telugu): రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' కథ గుర్తుందా? విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమిస్తాడు. ఆ తర్వాత భూమా (రష్మిక) ప్రేమించాల్సి వస్తుంది. టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి భూమా బయటకు రావాలనుకున్నా కుదరదు. సేమ్ టు సేమ్... 'లవ్ ఓటీపీ'లోనూ టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అయితే... ఇక్కడ అబ్బాయికి అమ్మాయి టార్చర్ చూపిస్తుంది. రెండిటిలో క్లైమాక్స్ వేర్వేరు. అయితే ఫస్టాఫ్ చాలా వరకు 'ది గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ అన్నట్టు 'లవ్ ఓటీపీ' ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ తీసిన స్టైల్ వేరు. హీరో కమ్ డైరెక్టర్ అనీష్ వినోదాత్మకంగా తీశాడు.
ఇంటర్వెల్ వరకు 'లవ్ ఓటీపీ' నవ్విస్తుంది. గర్ల్ ఫ్రెండ్ టార్చర్ పెట్టే సీన్స్ చాలా బాగా వచ్చాయి. తండ్రి రాజీవ్ కనకాలకు కొడుకు భయపడే సన్నివేశాలు సైతం. ఇంటర్వెల్ తర్వాత కాసేపు కామెడీ ఉన్నప్పటికీ... ఎక్కువగా ఎమోషనల్ మోడ్‌లోకి వెళ్లారు. దాంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇద్దరితో సేమ్ టైంలో ప్రేమ వ్యవహారం నడపడం, ఇరువురి భామల కౌగిలిలో హీరో నలగడం వంటివి 'బద్రి'తో పాటు కొన్ని తెలుగు సినిమాల్లో చూశాం. అందువల్ల, ఆ సీన్స్ ఎగ్జైట్ చేయలేదు. కానీ ఎండింగ్ చెప్పిన పాయింట్ బావుంది.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
'లవ్ ఓటీపీ' వంటి సినిమాకు ఎక్సట్రాడినరీ మ్యూజిక్ అవసరం. అయితే సాంగ్స్ & ఆర్ఆర్ ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కెమెరా వర్క్ ఓకే. రైటింగ్ పరంగా అనీష్ యూత్ కంటెంట్ ఎక్కువ ఇచ్చారు. ఓటీటీలోకి సినిమా వచ్చాక వైరల్ అవ్వడం గ్యారెంటీ. రాజీవ్ కనకాల, ప్రమోదినీ తప్ప తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు కనిపించలేదు. తెలుగు రిలీజ్ ప్లాన్ చేసినప్పుడు ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నటీనటులతో పాటు డబ్బింగ్ పరంగా కూడా కేర్ తీసుకోలేదు. దాంతో కన్నడ డబ్బింగ్ అన్నట్టు తెరపై సన్నివేశాల్లో స్పష్టంగా తెలుస్తుంది.
కథానాయకుడిగా అనీష్ చక్కగా నటించారు. స్నేహితుడిగా నాట్య రంగ కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. ఆరోహి నారాయణ్ ఓకే. ఆమెను గర్ల్ ఫ్రెండ్ అంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. నక్షత్రగా జాన్విక అందంగా కనిపించడంతో పాటు నటిగా మెప్పించారు. తండ్రిగా రాజీవ్ కనకాల నటన ఆకట్టుకుంటుంది. ప్రమోదిని ఓకే. జాన్విక తల్లి పాత్రలో తులసి కనిపించారు. మిగతా ఆర్టిస్టుల్లో తెలుగోళ్లు తక్కువ.
'లవ్ ఓటీపీ'... న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ టార్చర్, హీరో సిట్యువేషన్స్ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్ కొంచెం డల్ అయ్యింది. మళ్ళీ క్లైమాక్స్ పాయింట్ యువతను ఆలోచింపజేసే విధంగా ఉంది. అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...




















