A Quiet Place Day One Review: ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ రివ్యూ - శబ్దం చేస్తే చంపేసే జీవులు ఎలా పుట్టాయ్? ప్రీక్వెల్ కూడా అలరించిందా?
A Quiet Place Day One Movie Review: ‘ఏ క్వైట్ ప్లేస్’ పేరుతో ఇప్పటికే ఇంగ్లీష్‌లో రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే ఫ్రాంచైజ్‌లో ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ ఎలా ఉందో చూసేయండి.
మైఖేల్ సార్నోస్కి
లుపితా న్యోంగో, జోసెఫ్ క్విన్
Theaters
A Quiet Place Day One Movie Review In Telugu: మామూలుగా ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ అయినా, ప్రీక్వెల్ అయినా.. దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. అలాంటి భారీ అంచనాల మధ్య విడుదలయిన ఇంగ్లీష్ ప్రీక్వెల్ ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ (A Quiet Place: Day One). ‘ఏ క్వైట్ ప్లేస్’ సినిమాను చాలామంది చూసే ఉంటారు. ఆ తర్వాత దానికి సీక్వెల్ కూడా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిందే ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’. ఈ సినిమాల్లో మనుషులు మాట్లాడకూడదు, ఎలాంటి శబ్దాలు చెయ్యకూడదు కూడా. ఒకవేళ మాట్లాడితే చావు కన్ఫర్మ్. ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ స్టోరీ లైన్ కూడా అదే. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
కథ..
‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ కథ విషయానికొస్తే.. సమీరా అలియాస్ సామ్ (లుపితా న్యోంగ్) ఒక క్యాన్సర్ పేషెంట్. తను న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. తన పిల్లి ఫ్రోడో కూడా ఎప్పుడూ తనతో పాటే ఉంటుంది. ఇతర పేషెంట్స్ మ్యాన్హాటన్‌కు ఔటింగ్‌కు వెళ్తున్నారని, తను కూడా వస్తే బాగుంటుందని సామ్‌ను ఒప్పిస్తాడు ర్యూబెన్ (అలెక్స్ వాల్ఫ్). అక్కడికి వెళ్లిన తర్వాత సామ్‌కు పిజ్జా తినాలనిపిస్తుంది. దీంతో ర్యూబెన్‌ను తీసుకొని బయటికి వెళ్తుంది. అదే సమయంలో కొన్ని గ్రహంతరవాసులు వచ్చి ర్యూబెన్‌ను తినేస్తాయి. దీంతో ఆ సిటీ అంతా గందరగోళంగా మారుతుంది. ఇది చూసిన సామ్.. అక్కడే కళ్లు తిరిగి పడిపోతుంది.
శబ్దం చేస్తే ఆ గ్రహంతరవాసులు చంపేస్తాయని ప్రజలకు అర్థమవుతుంది. అయితే గ్రహంతరవాసులు నీటిలో ఈదలేవని తెలుసుకున్న పోలీసులు.. ప్రజలను కాపాడడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఒకేసారి ప్రజలు అంతా పరుగులు పెట్టడంతో ఆ గ్రహంతరవాసులు వారిని అటాక్ చేస్తాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సామ్.. వేరేదారిలో పరిగెడుతుంది. ఆ క్రమంలో ఫ్రోడో తన చేయి జారిపోతుంది. తప్పిపోయిన ఫ్రెడోను తిరిగి సామ్ దగ్గరకు చేరుస్తాడు ఎరిక్ (జోసెఫ్ క్విన్). ఈ ప్రమాద సమయంలో ఎరిక్, సామ్ ఒకరికొకరు తోడుగా ఉంటారు. చివరికి వీరిద్దరూ ఆ గ్రహంతరవాసుల నుంచి తప్పించుకోగలరా? ఫ్రోడోను కాపాడుకోగలరా? చివరికి ఏం జరుగుతుంది? అనేది తెరపై చూడాల్సిన కథ.
నటనతో మెప్పించింది..
సర్వైవల్ డ్రామాలను తెరకెక్కించడంలో హాలీవుడ్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’తో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. కానీ కొందరు ప్రేక్షకులకు మాత్రం ఈ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ముందు రెండు సినిమాలే ఎక్కువ బాగున్నాయని అనిపించే అవకాశం కూడా ఉంది. కానీ చాలావరకు ఈ సినిమాను హిట్ దిశగా నడిపించే ప్రయత్నం చేసింది లుపితా న్యోంగో. తను పెద్దగా మాట్లాడకపోయినా.. కళ్లతోనే తను ఏం చెప్పాలనుకుంటుందో ఆడియన్స్‌కు అర్థమయ్యేలా చేసింది. దీంతో లుపితా నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కొన్ని సీన్స్‌లో లుపితా నటన చూసి భయమేస్తుంది కూడా. తన నటన.. జోసెఫ్ క్విన్‌పై ప్రేక్షకుల ఫోకస్ వెళ్లకుండా చేసింది.
అంతా సైలెన్స్..
తను రాసుకున్న కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగాడు మైఖేల్ సార్నోస్కి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే అయితే ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం సౌండ్ డిజైన్. థియేటర్లలో ఈ మూవీ చూస్తున్న ప్రేక్షకులు.. సైలెన్స్‌తో కూడా భయపడేలా చేశాడు సౌండ్ ఇంజనీర్. గ్రహంతరవాసుల కంటే, వాటి వల్ల వచ్చే నిశ్శబ్దమే.. ఆడియన్స్‌ను ఎక్కువగా భయపెడుతుంది. ముఖ్యంగా ఆ సౌండ్ క్లాలిటీని, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీని థియేటర్లలో చూడడమే కరెక్ట్. అక్కడక్కడా ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ బోర్ కొట్టినట్టు అనిపించినా.. ఆడియన్స్‌ను ఎగ్జైటింగ్‌గా ఎదురుచూసేలా చేసే అంశాలు కూడా చాలా ఉన్నాయి.
ఇబ్బందికరమైన సీన్స్..
వింత జీవులను క్రియేట్ చేయడం, గ్రహంతరవాసులను గ్రాఫిక్స్‌లో సృష్టించడం హాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. అందుకే ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’లో గ్రహంతరవాసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ గ్రహంతరవాసులను క్లోజ్‌గా చూపించినప్పుడు, అవి మనుషులను వేటాడుతున్నప్పుడు చూడడానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇక ఇలాంటి ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీలో ఎమోషన్స్ కూడా యాడ్ చేశాడు దర్శకుడు మైఖేల్. ఆ ఎమోషన్స్‌ను ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేసిన క్రెడిట్ లుపితాకే దక్కుతుంది.
Also Read: కూతురిని చంపాలనుకునే తల్లిదండ్రులు - మైండ్‌తోనే అన్నీ కంట్రోల్ చేసే ఆమె.. తన చావును తప్పించుకోగలదా?