3BHK Movie Review - '3 బీహెచ్‌కే' రివ్యూ: మిడిల్ క్లాస్ ఎమోషన్ టచ్ చేసిన సిద్ధార్థ్... సొంత ఫ్లాట్ కోసం ఎన్ని కష్టాలో... సినిమా ఎలా ఉందంటే?
3BHK Review In Telugu: తండ్రీ కుమారులుగా శరత్ కుమార్, సిద్ధార్థ్ నటించిన సినిమా '3 బీహెచ్‌కే'. సొంత ఫ్లాట్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది.
శ్రీ గణేష్
సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీథా రఘునాథ్, చైత్ర జే ఆచార్, యోగిబాబు తదితరులు
Siddharth's 3BHK Movie Review In Telugu: సిద్ధార్థ్ హీరోగా రూపొందిన సినిమా '3 బీహెచ్‌కే'. హీరో తల్లిదండ్రులుగా దేవయాని, శరత్ కుమార్ నటించారు. చైత్ర జె ఆచార్ హీరోయిన్. హీరో చెల్లెలుగా మీథా రఘునాథ్ కనిపించారు. తమిళ, తెలుగు భాషల్లో జూలై 4న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? మధ్య తరగతి కుటుంబ జీవన విధానం, సొంత ఇంటి కోసం కనే కలలు మీద తీసిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (3 BHK Movie Story): వాసుదేవ్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) దంపతులకు ఇద్దరు పిల్లలు... ప్రభు (సిద్ధార్థ్), ఆర్తి (మీథా రఘునాథ్). సొంత ఫ్లాట్ కొనుక్కోవాలనేది వాళ్ళ కల.
ప్రభు పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి బీటెక్ పూర్తి చేసే వరకు... తర్వాత ప్రభు పెళ్లి వరకు... వాసుదేవ్ కుటుంబం కొన్నిసార్లు ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకున్నా ఎందుకు వాయిదా పడింది? ప్రభుతో వాసుదేవ్ కొన్నాళ్లు మాట్లాడటం ఎందుకు మానేశాడు? ఐశ్వర్య (చైత్ర జే ఆచార్)తో ప్రభు ప్రేమ, పెళ్లి కథ ఏమిటి? ఇల్లు కొన్నారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (3 BHK Review Telugu): ప్రతి మధ్య తరగతి కుటుంబం కల తమకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండటం! కొన్నేళ్ల క్రితం ఇండిపెండెంట్ హౌస్ కోసం ట్రై చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనాలని ట్రై చేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్ మీద కథతో సిద్ధార్థ్ సినిమా తీశారు.
నాన్న ఎందుకో వెనకబడ్డాడు... ఒక వేదిక మీద తనికెళ్ళ భరణి చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సొంత ఇల్లు / ఫ్లాట్ - ఆ ఒక్క ఎమోషన్ పక్కన పెడితే... '3 బీహెచ్‌కే' ఇల్లు కొనాలని ప్రయత్నించి తప్పనిసరి పరిస్థితుల్లో శరత్ కుమార్ ఆగిన ప్రతిసారీ 'నాన్న ఎందుకు వెనకబడ్డాడు' అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఫ్లాట్ పక్కన పెడితే... మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? అనేది తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు శ్రీ గణేష్.
'3 బీహెచ్‌కే'లో శ్రీ గణేష్ చూపించిన ఎమోషన్ గానీ, ఆ సీన్స్ గానీ అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. పిల్లల చదువు కోసం స్థోమతకు మించి ఖర్చు చేసే తండ్రులను, తోబుట్టువుల కోసం త్యాగాలు చేసే బ్రదర్ అండ్ సిస్టర్స్ మనం చాలా సినిమాల్లో చూశాం. అమ్మాయి భవిష్యత్ బావుంటుందని పెద్దింటి సంబంధం ఇచ్చి చేయడం, తర్వాత అత్తింటిలో చిన్న చూపు చూశారని పిల్లలు ఫీల్ అవ్వడం కూడా కొత్త కాదు. సినిమా అంతటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేస్ చేసే ఇష్యూలు ఉన్నాయి. ఒక్క సినిమాలో చాలా ఎమోషన్స్ చెప్పాలని ట్రై చేశారు. దాంతో ఒక ప్రాబ్లమ్ తర్వాత మరొక ప్రాబ్లమ్ స్క్రీన్ మీదకు రావడంతో ఇంటర్వెల్ వరకు 'ఏంటీ కష్టాలు? వీటికి అంతు ఉండదా?' అనిపిస్తుంది.
సగటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ హీరో క్యారెక్టర్ ఒక్కటీ కాస్త డిఫరెంట్‌గా ఉందని అనుకోవడానికి లేదు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'నీదీ నాదీ ఓకే కథ' గుర్తు ఉందా? కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని తండ్రి కలలు కంటాడు. తనకు చదువు ఎక్కడం లేదని కొడుకు చెబుతాడు. చివరకు క్యాబ్ డ్రైవర్ అవుతాడు. సేమ్ టు సేమ్... '3 బీహెచ్‌కే' తండ్రి చెప్పింది చేస్తూ వెళతాడు హీరో. చివరకు తనకు నచ్చింది చేస్తాడు. సక్సెస్ అవుతాడు. అక్కడ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సినిమాకు ఎండ్ కార్డు వేశారు.
సాధారణ కథ, నత్త నడకన సాగిన కథనం మధ్యలో ఆర్టిస్టుల నటన సన్నివేశాలను చూసేలా చేశాయి. మరీ కష్టాలు ఎక్కువ చూపించడం, నిదానంగా కథను ముందుకు తీసుకు వెళ్లడం వల్ల విపరీతంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ వర్క్ మెచ్చుకోవాలి. ప్రతి సీన్ రియాలిటీకి దగ్గర ఉందంటే అందుకు కారణం ప్రొడక్షన్ వర్క్ పరంగా కేర్ తీసుకోవడమే. దినేష్ కృష్ణన్, జితిన్ స్టానిస్లాస్ కెమెరా వర్క్ బావుంది. తెలుగు డైలాగులు బాగా రాశారు రాకేందు మౌళి.
Also Read: 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?
బాయ్ నెక్స్ట్ డోర్, మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయారు. నటన కంటే ఎక్కువగా లుక్ పరంగా వేరియేషన్స్ చూపించినందుకు అప్రిషియేట్ చేయాలి. శరత్ కుమార్ లుక్ పరంగా వేరియేషన్ చూపించడం ఒక్కటే కాదు... నటుడిగానూ జీవించారు. చైత్ర జే ఆచార్ క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ తక్కువ. తన పాత్ర పరిధి మేరకు చేశారు. ఆమె కంటే సిస్టర్ రోల్ చేసిన మీథా రఘునాథ్ ఎక్కువ గుర్తు ఉంటారు. యోగిబాబు కనిపించింది రెండు సన్నివేశాలే. కానీ, నవ్వించారు.
'3 బీహెచ్‌కే'లో శరత్ కుమార్ ద్రావిడ్ ఫ్యాన్. సిద్ధార్థ్ ధోని ఫ్యాన్. ఒక సన్నివేశంలో 'నాన్న నేను ధోని ఫ్యాన్' అని చెబుతాడు హీరో. మరి, ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ద్రావిడ్‌లా ఆడితే కుదరదని, ధోని తరహాలో ఫాస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలని... టెస్ట్ మ్యాచ్ కాకుండా టీ20 తరహాలో సాగే సినిమా తీయాలని దర్శకుడు గ్రహించలేకపోయారు. సగటు కమర్షియల్ సినిమాల మధ్యలో కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే కథ, కథనంతో సినిమా తీశారు. అయితే ఈ '3 బీహెచ్‌కే' సినిమా చూసేందుకు ఓపిక కావాలి. అంత నిదానంగా సాగుతుంది.





















