Thammudu Review 2025 - 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?
Thammudu Movie Review Nithiin: నితిన్ వరుస ఫ్లాపులకు 'తమ్ముడు' బ్రేక్ వేసిందా? లేదా? శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూడండి.
శ్రీరామ్ వేణు
నితిన్, లయ, సప్తమి గౌడ, వర్షా బొల్లమ్మ, సౌరబ్ సచదేవ్, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, 'టెంపర్' వంశీ తదితరులు
Nithiin's Thammudu Movie Review: 'తమ్ముడు' విడుదల సందర్భంగా నిర్మాతలు 'దిల్' రాజు, శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో 'గేమ్ చేంజర్' డిస్కషన్ ఎక్కువ నడిచింది. నితిన్ సినిమా పక్కకు వెళ్లింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ 'బాయ్ కాట్ ఎస్వీసీ' ట్రెండ్ చేయడం, శిరీష్ సారీ చెప్పడం తెలిసిన విషయాలే. ఆ ఇష్యూ పక్కన పెడితే... అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో దర్శకుడు శ్రీరామ్ వేణు తీసిన 'తమ్ముడు' ఎలా ఉంది? వరుస ఫ్లాప్స్ నుంచి నితిన్ బయట పడతారా?
విశాఖలో ఒక భారీ అగ్నిప్రమాదం జరుగుతుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. అజర్వాల్ (సౌరబ్ సచ్‌దేవ్) అందుకు కారణం. ముఖ్యమంత్రికి భారీగా లంచం ఇస్తాడు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రెండేసి లక్షలు ఇచ్చి ఇష్యూ లేకుండా చేయాలని చూస్తాడు. మధ్యవర్తిగా వ్యవహరించిన మంత్రి ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్ మేనేజ్ చేయమని చెబుతాడు.
ప్రభుత్వ అధికారులను భయపెట్టి బెదిరించి తనకు అనుకూలంగా రిపోర్ట్ రెడీ చేయిస్తాడు అజర్వాల్. అయితే... ఝాన్సీ కిరణ్మయి (లయ) డబ్బుకు, భయానికి లొంగదని పేరుంది. కుటుంబంతో కలిసి అంబర్ గొడుగులో అమ్మవారి జాతరకు వెళ్తుంది ఝాన్సీ. వాళ్లందరినీ చంపేయమని మనుషులను పంపిస్తాడు అజర్వాల్.
ఝాన్సీ కుటుంబానికి, అజర్వాల్ మనుషులకు మధ్య అడ్డుగోడగా జై (నితిన్) ఉంటాడు. అతడొక ఇంటర్నేషనల్ ఆర్చరీ ప్లేయర్. గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అతను ఝాన్సీ కోసం అంబర్ గొడుగు ఎందుకు వచ్చాడు? తమ్ముడు జైను ఝాన్సీ ఎందుకు గుర్తు పట్టడం లేదు. అక్కా తమ్ముళ్ల మధ్య దూరం రావడానికి, పెరగడానికి కారణం ఏమిటి? అక్క చేత తమ్ముడు అని పిలిపించుకోవాలని అంబర్ గొడుగు వచ్చిన జై, చివరకు ఆ మాట విన్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: మాట పోతే మనిషి బతికినా చచ్చినట్టే లెక్క, మనిషి పోయినా ఇచ్చిన మాట నిలబడితే ఆ మనిషి బతికినట్టే - తమ్ముడు ట్రైలర్‌లో నితిన్ చెప్పిన మాట. నిజమే... సినిమా రిజల్ట్ విషయంలోనూ అంతే! కథలో కొత్తదనం లేకున్నా కథనం కట్టిపడేసేలా ఉంటే సినిమా నిలబడినట్టే. కథ ఎంత బావున్నా, కథలో విషయం ఉన్నా కథనం, క్యారెక్టర్లు కనెక్ట్ అయ్యేలా లేకపోతే సినిమా పోయినట్టే. ఇప్పుడీ లెక్క ఎందుకంటే...
తమ్ముడు కోసం శ్రీరామ్ వేణు రాసుకున్న కథలో కొత్తదనం లేదు. పోనీ కథనంలో, క్యారెక్టర్లలో కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయా? అంటే... అవేవీ లేవు. కమర్షియల్ సినిమాకు అవసరమైన సెటప్ అయితే తమ్ముడులో కుదిరింది. కానీ క్యారెక్టర్స్ డిజైన్, స్క్రీన్ ప్లేలో ఎంగేజ్ చేసే అంశాలు కుదరలేదు. కార్తీ 'ఖైదీ' స్పూర్తితో ఈ సినిమా.డిజైన్ చేసినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. యాక్షన్ బ్లాక్స్ బాగా డిజైన్ చేశారు... అలాగే రాశారు. అయితే ఆ యాక్షన్ సీన్స్ కనెక్ట్ చేసే స్ట్రాంగ్ ఎమోషన్ మిస్ అయ్యింది. 'ఎంసీఏ'లో వదిన - మరిది మధ్య బాండింగ్ చూపించిన శ్రీరామ్ వేణు... ఈసారి అక్క తమ్ముడు మధ్య బాండింగ్ ఎంపిక చేసుకున్నారు. అంతే తేడా!
ఆర్చరీ ప్లేయర్ కింద మొదలైన హీరో ప్రయాణం అంబర్ గొడుగు వెళ్లడానికి, కథ హీరో గోల్డ్ మెడల్ నుంచి అక్కను కాపాడే మిషన్ మీదకు షిఫ్ట్ కావడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. షిఫ్ట్ అయ్యాక అసలు సమస్య మొదలైంది. రత్నగా సప్తమి గౌడ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన తీరులో లోపం ఉంది. అలాగే, స్వస్తిక విజయన్ రోల్ కూడా! వాళ్లకు పెట్టిన యాస కూడా బాలేదు. దాంతో డిస్ కనెక్ట్ అవుతాం. వర్ష బొల్లమ్మ, నితిన్ మధ్య ట్రాక్ కూడా సరిగా రాయలేదు. దాంతో యాక్షన్ సీన్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యేలా నిలిచాయి. ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవాయిడ్ చేయాల్సింది. అవి టూ మచ్ అనిపించాయి.
శ్రీరామ్ వేణు రచనలో లోపాలను సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కంటెంట్ ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఇచ్చారు. భూ అంటే భూతం సాంగ్ ఒక్కటీ సరైన ప్లేస్‌లో పడలేదు. మిగతావి ఓకే. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఖర్చుకు వెనుకాడలేదు. భారీగా తీశారని తెరపై కనిపించింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్‌లో క్వాలిటీ లోపించింది.
నటుడిగా కొత్తగా చేయడానికి జై క్యారెక్టర్ స్కోప్ ఇవ్వలేదు. పాత్ర పరిధి మేరకు నితిన్ నటించారు. నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన లయ... క్లోజప్ షాట్స్‌లో ఇచ్చిన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చాలు... ఆవిడ ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనేది మరోసారి చెప్పడానికి! సప్తమి గౌడ క్యారెక్టర్ సరిగా కుదరలేదు ఆవిడ నటన కూడా బాలేదు. వర్ష బొల్లమ్మ ఓకే. విలన్ పాత్రలో సౌరబ్ సచ్‌దేవ్ అద్భుతమైన నటన కనబరిచారు. మిగతా క్యారెక్టర్లలో చాలామంది కనిపించినా... థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేవి తక్కువ.
ఖైదీ ఫార్మాట్ కథకు సిస్టర్ సెంటిమెంట్ యాడ్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన ప్రయత్నమే తమ్ముడు. యాక్షన్ తప్ప ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్స్ ఏమీ లేవు. విజయం కోసం నితిన్ మరో ప్రయత్నం చేయక తప్పదు. ఆడియన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్లలో కూర్చోవడం కష్టం.





















