Uppu Kappurambu Review - 'ఉప్పు కప్పురంబు' రివ్యూ: స్మశానంలో స్థలం కోసం గొడవ... Prime Videoలో కీర్తీ సురేష్, సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Uppu Kappurambu On Prime Video: కీర్తీ సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఉప్పు కప్పురంబు'. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అని ఐవి శశి
కీర్తీ సురేష్, సుహాస్, బాబూ మోహన్, శత్రు, 'శుభలేఖ' సుధాకర్, రవితేజ నన్నిమాల తదితరులు
Ama
Keerthy Suresh's Uppu Kappurambu Review In Telugu: సుహాస్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఉప్పు కప్పురంబు'. బాబూ మోహన్, శత్రు, రామేశ్వరి, 'శుభలేఖ' సుధాకర్ ఇతర ప్రధాన తారాగణం. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం అని ఐవి శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ పతాకంపై రాధిక లావూ నిర్మించిన ఒరిజినల్ చిత్రమిది. జూలై 4 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది చూస్తే...
కథ (Uppu Kappurambu Movie Story): అపూర్వ (కీర్తీ సురేష్)ది చిట్టి జయపురం. తండ్రి ('శుభలేఖ' సుధాకర్) మరణం తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన ఊరి పెద్ద బాధ్యత తప్పక స్వీకరిస్తుంది. వెంటనే ఆమె ముందు పెద్ద సమస్య వచ్చి పడుతుంది.
చిట్టి జయపురం ఆనవాయితీ ప్రకారం ఊరికి ఉత్తరం వైపు ఉన్న స్మశానంలో పార్థీవ దేహాలను పూడ్చి పెడతారు. మూడు వందల ఏళ్ల నుంచి మరణించిన వ్యక్తులు అందరినీ ఖననం చేయడంతో స్మశానంలో స్థలం ఉండదు. నలుగుర్ని పూడ్చి పెట్టడానికి మాత్రమే చోటు ఉందని చెబుతాడు చిన్నా (సుహాస్). అతని చిన్నతనంలో తండ్రి మరణిస్తాడు. అప్పటి నుంచి స్మశానంలో బాధ్యతలు చూసేది, అక్కడ కాపలా కాసేది అతడే.
ఊరిలో జనాలు అందరూ మరణించిన తర్వాత తమను ఆ స్మశానంలో పూడ్చి పెట్టాలని కోరుకుంటారు. ఊరి పెద్ద పదవి మీద కన్నేసిన భీమయ్య (బాబూ మోహన్), మధుబాబు (శత్రు) అయితే అపూర్వను ఇరుకున పెట్టాలని చూస్తారు. సమస్యల నుంచి అపూర్వ ఎలా గట్టెక్కింది? స్మశానంలో స్థలం కోసం వేసిన వేలం పాట ఎటువంటి ఆందోళనలకు కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 
విశ్లేషణ (Uppu Kappurambu Review Telugu): 'ఉప్పు కప్పురంబు'లో స్మశానంలో స్థలం కోసం వేలం పాట జరిగిన సన్నివేశంలో 'నన్ను తింగరోడు అంటున్నారు. కానీ, ఊరిలో అందరూ తింగరోళ్లే' అని రవితేజ నన్నిమాల అంటారు. చూసే ఆడియన్స్ రియాక్షన్ కూడా ఎగ్జాట్‌లీ సేమ్ ఉంటుంది. సినిమా మొదటి గంట వినోదం కోసం చేసిన ప్రయత్నాలు తింగరి తింగరిగా, గందరగోళంగా ఉంటాయి.
'ఉప్పు కప్పురంబు'కు వసంత్ మారిగంటి కథ రాశారు. క్లుప్తంగా చెప్పాలంటే... ఓ తింగరి అమ్మాయి లేని పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఎంత ఇబ్బంది పడింది? కాటికాపరి సాయంతో ఊరి సమస్యను ఎలా పరిష్కరించింది? అనేది సినిమా. కథలో విషయం ఉంది. తల్లీ కొడుకుల మధ్య సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా రాశారు. కానీ, దర్శకత్వంలో తడబాటు కనిపించింది.
కీర్తీ సురేష్ లాంటి నటి చేత నటనలో తింగరితనం చూపిస్తే సరిపోయేదానికి చేష్టల్లో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అని ఐవి శశి. ఆ చేష్టలు ఓవర్ ది బోర్డు వెళ్లాయి. ఆ కారణం చేత మొదటి గంట టూ మచ్ అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ కామెడీ ఆకట్టుకోవడం కష్టం. బండి ఇబ్బందిగా ముందుకు కదులుతుంది. కామెడీ నుంచి ఎమోషన్ మీదకు ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు కథలో సీరియస్‌నెస్ పెరిగింది. పాటల్లో భావోద్వేగం పడింది. సన్నివేశాల మీద ఆడియన్స్ దృష్టి నిలిచింది.
'ఉప్పు కప్పురంబు'కు పాటలు బలంగా నిలిచాయి. స్వీకార్ అగస్తి మంచి బాణీలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ ఓకే. సినిమా అంతా పల్లెటూరిలో సాగుతుంది. ఆ వాతావరణాన్ని తెరపైకి చక్కగా తెచ్చారు. రాధికా లావూ ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి.
Also Read: విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ: కొత్త పెళ్లి కూతుళ్లే టార్గెట్... అమ్మవారి శాపమా? ఆస్తుల కోసం కుట్రా?
'ఉప్పు కప్పురంబు'లో కీర్తీ సురేష్ లుక్ బావుంది. లంగా వోణీలు ధరించి, కళ్ళజోడు పెట్టి పల్లెటూరి అమ్మాయిగా చక్కగా కనిపించారు. ఫస్టాఫ్‌లో బాడీ లాంగ్వేజ్ సర్‌ప్రైజ్ చేసినా... పతాక సన్నివేశాల్లో ఆమె నుంచి ఆడియన్స్ ఆశించే నటన ఇచ్చారు. సుహాస్ మరోసారి తన పాత్రలో ఒదిగిపోయారు. మొదట నవ్వించిన ఆయన... చివరకు వచ్చేసరికి కంటతడి పెట్టించారు. బాబూ మోహన్ కొంత విరామం తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఆయనతో పాటు తనదైన కామెడీ టైమింగ్, నటనతో మెప్పించారు శత్రు. సినిమా అంతటా మెడ పక్కకు పెట్టుకుని ఒకే బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేసిన రవితేజ నన్నిమాలను అభినందించాలి. స్మశానంలో శిలాఫలకాల మీద పేర్లు చెక్కే పాత్రలో అతడు నటించారు. మిగతా క్యారెక్టర్లు ఓకే.
'ఉప్పు కప్పురంబు'లో చివరి అరగంట బావుంది. ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళితే... కులాలు, వర్గాల పేరుతో కొట్టుకుంటున్న మనుషులంతా ఒక్కటే కుటుంబమనే చక్కటి సందేశాన్ని ఇచ్చింది. అయితే... సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ లౌడ్, ఓవర్ ది బోర్డు సీన్స్ కోరుకునే ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తాయి. ఓటీటీలో ఉంది కనుక కీర్తీ సురేష్, సుహాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్ట్రీమింగ్ చేయడం మంచిది.





















