AP High Alert: ఢిల్లీలో పేలుడుతో ఏపీలో హై అలర్ట్.. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం.. ప్రజలకు కీలక సూచనలు
High alert in AP | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో సంభవించిన పేలుడు ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది.

అమరావతి: ఢిల్లీలోని ఎర్రకోటలో పేలుడుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీఐజీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. దాంతో ఏపీలో ముఖ్యమైన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ సహా పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వస్తువులు కనిపించినా తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
విశాఖపట్నం: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం సిటీ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహన తనిఖీలు ముమ్మరం
నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి, అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలించారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారేమోనని గాలించారు.
కార్గో, కొరియర్ కార్యాలయాల పర్యవేక్షణ:
కార్గో సర్వీస్ సెంటర్‌లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి, పంపబడుతున్న పార్శిళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు. పోలీసు అధికారులు ఈ సందర్భంగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని మరియు పోలీసుల భద్రతా చర్యలకు పూర్తిగా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు ఏవైనా దృష్టికి వస్తే, తక్షణమే డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలని ప్రజలకు విశాఖపట్నం సీపీ సూచించారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విసృతంగా తనిఖీలు.
ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో అప్రమత్తమై ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు విజయవాడ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు. సీపీ ఆదేశాలు మేరకు డి.సి.పి పర్యవేక్షణలో ఏ.సి.పి.లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలిసి పోలీస్ కమీషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిదిలోని అన్నీ లాడ్జిలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
పోలీసు అదికారులు లాడ్జీలలోని ప్రతి గదిని తనిఖీ చేసి, లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలలో ని రిజిస్టర్ ను పరిశీలించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సి.సి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.






















