Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?
OTT Review - Monster Movie : లక్ష్మీ మంచు మలయాళ చిత్రసీమకు పరిచయమైన చిత్రం 'మాన్‌స్టర్'. మోహన్ లాల్ హీరోగా నటించారు. సినిమా తెలుగు వెర్షన్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.
వైశాఖ్
మోహన్ లాల్, హానీ రోజ్, లక్ష్మీ మంచు
సినిమా రివ్యూ : మాన్‌స్టర్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : మోహన్ లాల్, హానీ రోజ్, లక్ష్మీ మంచు, సుదేవ్ నాయర్, సిద్ధిఖీ తదితరులు
ఛాయాగ్రహణం : సతీష్ కురుప్
సంగీతం : దీపక్ దేవ్
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్
దర్శకత్వం : వైశాఖ్
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ (Mohanlal). ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమా 'మాన్‌స్టర్' (Monster Movie). అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తెలుగమ్మాయి, నటి లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ఈ సినిమాతో మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది (Monster Review)?
కథ (Monster Movie Story) : భామిని (హానీ రోజ్) భర్త అనిల్ చంద్ర (సుదేవ్ నాయర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బిజినెస్ చేయాలని కొచ్చిలో షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకుంటారు. ఉద్యోగం కంటే వ్యాపారం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడంతో రిసెషన్ టైమ్‌లో ఆఫీసు వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేస్తారు. సరిగ్గా అదే సమయంలో యాక్సిడెంట్ కావడంతో ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది. దాంతో భామిని షీ టాక్సీలో క్యాబ్ డ్రైవర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
ఓ రోజు లక్కీ సింగ్ (మోహన్ లాల్)ను భామిని పికప్ చేసుకుంటుంది. అతడి చూపు, మాట తేడాగా ఉంటాయి. మొదట భామినికి లైన్ వేస్తాడు. ఆమెకు పెళ్ళైందని, ఆ రోజు ఆమె పెళ్ళి రోజు అని తెలిసినా వదలడు. ఇంటికి వెళతాడు. భామిని లేని సమయం చూసి ఆమె భర్తను తుపాకీతో షూట్ చేస్తాడు. భర్తను హత్య చేసిందని పోలీసులు భామినిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? భామిని ఇంట్లో పని చేసే దుర్గ (లక్ష్మీ మంచు) ఏం చేసింది? లక్కీ సింగ్ అసలు పేరు శివదేవ్ సుబ్రమణ్యం అని పోలీసులు ఎందుకు చెబుతున్నారు? రెబెక్కా, కేథరిన్ అలెగ్జాండ్రా ఎవరు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Monster Movie Telugu Review) : 'మాన్‌స్టర్' క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కానీ, చూసే ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు. ఇందులో క్రైమ్ ఉంది. కానీ, అది ఏంటనేది గంటన్నర తర్వాత గానీ తెలియదు. అప్పటి వరకు సినిమాను భరించాలి. టూ మచ్ రొటీన్ సీన్స్ చూడాలి. సీరియల్ తరహాలో సాగుతుంది.
హరియాణాలో 2011లో జరిగిన ఘటన ఆధారంగా 'మాన్‌స్టర్' తెరకెక్కించారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ప్రజలు వాళ్ళను కొట్టి మరీ పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనేది సినిమా. అదే ఈ కథకు మెయిన్ పాయింట్. ఇంతకు మించి చెబితే కథలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ బావున్నా... తీసిన తీరు అసలు బాలేదు. గంటన్నర తర్వాత సినిమా చూడటం స్టార్ట్ చేసినా... చివరి అర గంటలో కథ మొత్తం అర్థం అయిపోతుంది. ఆ చివరి అరగంటలో లక్ష్మీ మంచు క్యారెక్టర్ ట్విస్ట్, ఆవిడ పెర్ఫార్మన్స్ హైలైట్.
'మాన్‌స్టర్'లో ప్రేక్షకులకు కొత్త లక్ష్మీ మంచు కనిపిస్తారు. మోహన్ లాల్‌తో ఆవిడ ఫైట్ చేశారు. విలనిజం చూపించారు. హానీ రోజ్‌తో లిప్ లాక్ చేశారు. నటిగా వైవిధ్యం కనబరిచారు. స్క్రీన్ స్పేస్ తక్కువైనా ప్రేక్షకులు లక్ష్మీ మంచు క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలా 'మాన్‌స్టర్' ఉంటుంది. హానీ రోజ్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ. ఆమె పెద్దగా ప్రభావం చూపించిన సన్నివేశాలు తక్కువ. లక్కీ సింగ్ పాత్రలో మోహన్ లాల్ వినోదం పండించాలని చూశారు. కానీ, వర్కవుట్ కాలేదు. ఆయన అభినయం కూడా చివరి అరగంటలో బావుంటుంది.
Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : క్రైమ్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన గంటన్నర సీరియల్ 'మాన్‌స్టర్'. కాన్సెప్ట్ ఓకే గానీ... కంటెంట్ వీక్. అసలు కథ, ట్విస్టులు గంటన్నర తర్వాతే ఉంటాయి. కొత్త లక్ష్మీ మంచును చూడాలనుకుంటే చివరి అరగంట చూస్తే చాలు.