Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?
Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
పరశురామ్ పెట్ల
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అచ్యుత్ కుమార్, దివ్యాంశ కౌశిక్ తదితరులతో పాటు అతిథి పాత్రలో రష్మిక
Vijay Deverakonda's Family Star Movie Review: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఫ్యామిలీ స్టార్'. బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం' తర్వాత వాళ్లిద్దరూ చేసిన చిత్రమిది. ఇందులో 'సీతా రామం', 'హాయ్ నాన్న' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'దిల్' రాజు నిర్మాత. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Family Star Movie Story): గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) మిడిల్ క్లాస్ కుర్రాడు. కుటుంబ బాధ్యతలను బరువు అనుకోకుండా... అన్నా వదినలు, పిల్లల కోసం బతికే యువకుడు. వాళ్లింట్లో పెంట్ హౌస్ అద్దెకు తీసుకుంటుంది ఇందు (మృణాల్ ఠాకూర్). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. ఇంట్లో అందరితో కలివిడిగా కలిసిపోతుంది. తొలుత ఇందుకు దూరంగా ఉన్నప్పటికీ... మెల్లగా ప్రేమలో పడతాడు గోవర్ధన్. తన ప్రేమను చెప్పాలని అనుకున్న సమయానికి ఇందు చేసిన ఓ పని వల్ల బాగా హార్ట్ అవుతాడు. అసలు, ఇందు ఏం చేసింది? హర్ట్ అయిన గోవర్ధన్ ఏం చేశాడు? ఇద్దరూ అమెరికా ఎందుకు వెళ్లారు? మిడిల్ క్లాస్ కుర్రాడితో డబ్బున్న అమ్మాయి ప్రేమ కథలో మనస్పర్థలు, అడ్డంకులు ఏం వచ్చాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Family Star Review): ఇటీవల హీరో అంటే లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టు దర్శక రచయితలు వాళ్ల క్యారెక్టర్లు డిజైన్ చేస్తున్నారు. స్టార్ హీరోలను కామన్ మ్యాన్ క్యారెక్టర్లలో చూపించడం అరుదు అయిపోయింది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండను మిడిల్ క్లాస్ కుర్రాడిగా చూపిస్తూ పరశురామ్ 'ఫ్యామిలీ స్టార్' తీశారు. టీజర్, ట్రైలర్, పాటలు చూసినప్పుడు... కథ కంటే ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా కనిపించింది. మరి, 'ఫ్యామిలీ స్టార్'లో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? రొమాన్స్ ఎలా ఉంది? కామెడీ సంగతి ఏంటి? అనేది చూస్తే...
కథలోకి వెళ్లడానికి 'ఫ్యామిలీ స్టార్' దర్శకుడు పరశురామ్ పెట్ల కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈతరం ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో విజయ్ దేవరకొండ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన్ను మిడిల్ క్లాస్ కుర్రాడిగా చూపించడానికి కష్టపడ్డారు. ఆ మిడిల్ క్లాస్ సీన్స్ కంటే హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు బావున్నాయి. హీరో కుటుంబ నేపథ్యం, బ్రదర్స్ మధ్య రిలేషన్ కొత్తగా ఏమీ లేదు. రొటీన్ అని చెప్పాలి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటీ కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు ఫ్యామిలీని పక్కనపెట్టి హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు దర్శకుడు. క్లైమాక్స్‌కు ఓ 20 నిమిషాల ముందు వరకు విలన్ ఎవరూ లేరు. అప్పటి వరకు మూవీ రన్ టైమ్ బిగ్గెస్ట్ విలన్ రోల్ ప్లే చేసింది. 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో కొన్ని ఎమోషన్స్ కామన్ పీపుల్, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు నచ్చుతాయి. 'గీత గోవిందం'లో బ్యాక్ టు బ్యాక్ సన్నివేశాలతో ఫన్ / ఎమోషన్ వర్కవుట్ చేసిన పరశురామ్... 'ఫ్యామిలీ స్టార్'లో ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ సన్నివేశాలతో ఎంగేజ్ చేయలేదు. ట్రాక్ తప్పారు. సంభాషణల్లో కొన్ని తప్పితే పెద్దగా మెరుపులు లేవు. రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో ఉంటుందీ 'ఫ్యామిలీ స్టార్'.
గోపీసుందర్ పాటల్లో 'మధురము కదా...' బావుంది. 'కల్యాణీ వచ్చా వచ్చా'కు సరైన ప్లేస్‌మెంట్ లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఫైట్ మాస్టర్లను మెచ్చుకోవాలి. ఫ్యామిలీ టచ్ పోకుండా డీసెంట్ ఫైట్స్ తీశారు.
'గీత గోవిందం', 'ఖుషి' తర్వాత మరోసారి ఆ తరహా మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయారు. క్యారెక్టర్ వరకు చక్కగా చేశారు. విజయ్ జోడీగా మృణాల్ ఠాకూర్ బావుంది. పాటల్లో గానీ, పతాక సన్నివేశాల్లో గానీ ఆమె నటన అలా చూస్తూ ఉండిపోవచ్చు. జగపతి బాబు, దివ్యాంశ కౌశిక్, రవిబాబు, అచ్యుత్ కుమార్ తదితరులవి అతిథి పాత్రలే. తమ పరిధి మేరకు చేశారు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ శ్రీను, సెకండాఫ్‌లో 'వెన్నెల' కిశోర్ కాసేపు నవ్వించారు.
Also Read: ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?
'ఫ్యామిలీ స్టార్' కథలో కొత్తదనం లేదు. సినిమా చూసేటప్పుడు ఇంతకు ముందు చూసినవి గుర్తుకు వస్తాయి. కథలో పాత వాసనలు ఉన్నాయి. పరశురామ్ పాత కథను కొత్త సీసాలో చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల, కథ కంటే ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి. సినిమా నిదానంగా మొదలైంది. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. చివరి 20 నిమిషాలు ఎంగేజ్ 'నెక్స్ట్ ఏంటి?' అని చూసేలా తీశారు. అసలు అంచనాలు లేకుండా వెళితే... మధ్యలో కొన్ని మూమెంట్స్, కామెడీ సీన్లు ఎంజాయ్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్, మహిళలకు నచ్చే కంటెంట్ అయితే ఉంది.
Also Read: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?