Agent Movie Review - 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?
Agent Movie Review In Telugu : అఖిల్ అక్కినేని హీరోగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
సురేందర్ రెడ్డి
అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య తదితరులు
సినిమా రివ్యూ : ఏజెంట్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు
కథ : వక్కంతం వంశీ
మాటలు : భార్గవ్ కార్తీక్
ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్)
నిర్మాత : రామబ్రహ్మాం సుంకర
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని (Akhil Akkineni) చెప్పేశారు. అంతే కాదు... 'ఏజెంట్' (Agent Movie) కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా అయిపోయారు. సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చారు. ఆయనకు తోడు మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన, సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమా (Agent Review) ఎలా ఉంది?
కథ (Agent Movie Story) : రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్ అక్కినేని)కి 'రా' ఏజెంట్ అవ్వాలని కోరిక. ఇంట్లో చెప్పకుండా మూడుసార్లు ఎగ్జామ్ రాస్తాడు. ఆ మూడుసార్లూ ఇంటర్వ్యూలో రిజక్ట్ అవుతాడు. లాభం లేదనుకుని 'రా' చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్ హ్యాక్ చేస్తాడు. రిక్కీ చేసిన పని వల్ల మహాదేవ్ దృష్టిలో అయితే పడతాడు గానీ జాబ్ రాదు. ఈ లోపు వైద్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు రిక్కీ. ఏజెంట్ అయ్యే ఒక్క లక్షణం కూడా రిక్కీలో లేదని చెప్పేసి వెళ్ళిన మహాదేవ్... గతంలో ఆయన కోసం పని చేసి, ఆ తర్వాత రెబల్ కింద మారి దేశానికి పెను ముప్పుగా మారిన గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా)ను చంపడానికి రిక్కీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? మిషన్ మొదలైన తర్వాత మహాదేవ్ ఆదేశాలను పక్కన పెట్టిన రిక్కీ ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? సెంట్రల్ మినిష్టర్ జయకిషన్ (సంపత్ రాజ్)ను ఎందుకు చంపాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Agent Movie Review Telugu) : రా ఏజెంట్స్ (గూఢచారి) నేపథ్యంలో వచ్చే చిత్రాలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయనే విమర్శ ఉంది. ప్రతి సినిమాలో దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనుకాడని హీరో, ఇండియా నాశనమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే శత్రుమూకలు, వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా పని చేసే 'రా' (ఇంటిలిజెన్స్) వంటి సంస్థలు!
'రా' సినిమాల్లో కథలు, కథాంశాలు ఒకేలా ఉన్నప్పటికీ... థియేటర్లలో చివరి వరకూ కూర్చోబెట్టే ఒకే ఒక్క ఎమోషన్ దేశభక్తి. ప్రేక్షకుడిలో దేశభక్తిని బలంగా బయటకు రప్పించగలిగితే చాలు... సినిమా హిట్టే. అందుకు రీసెంట్ 'పఠాన్' ఉదాహరణ. ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే... 'ఏజెంట్'లో కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్లు చూస్తే షారుఖ్ మూవీ గుర్తుకు వస్తుంది. 'పఠాన్' విడుదల కంటే ముందు 'ఏజెంట్' స్టార్ట్ చేశారు. యాదృశ్చికమో, మరొకటో... రెండు సినిమాల్లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి.
గూఢచారి నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ పక్కన పెట్టేసి... 'ఏజెంట్'ను చూసినా ఆకట్టుకోవడం కష్టమే. దేశభక్తితో కాదు, భారత ఇంటిలిజెన్స్ వ్యవస్థ మీద మరీ చిన్నచూపుతో సినిమా తీశారనిపిస్తుంది. మన 'రా' (రీసెర్చ్ అండ్ ఏనాలసిస్ వింగ్) ఎలా పనిచేస్తుంది? అని మినిమమ్ రీసెర్చ్ కూడా దర్శక, రచయితలు చేసినట్టు లేరు. కామెడీ కాకపోతే... 'రా' హెడ్ ఆఫీసులో జరిగే ప్రతి విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ చూసినట్టు దేశద్రోహులు చూడటం ఏమిటి? 'రా' ఆఫీస్ ముందు ఏకంగా హెలికాఫ్టర్ వేసుకుని దిగటం ఏమిటి? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని ఎంత సరిపెట్టుకుందామని కొన్ని అంశాలు అసలు మింగుడుపడవు. ఎట్ లీస్ట్... దీని కంటే ముందు రా నేపథ్యంలో వచ్చిన యాక్షన్ సీన్లు కాకుండా కథలపై ఫోకస్ చేస్తే ఇంకా మంచి కథ వచ్చేది!
అఖిల్ అక్కినేనిని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇది స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. కానీ, కథ ఆ స్టైలును వెనక్కి లాగింది. పరమ రొటీన్, లాజిక్ లెస్, సోల్ లెస్, ఎమోషన్ లెస్ కథతో సినిమా తీశారు. ఏ దశలోనూ ఈ కథ, సన్నివేశాలు మనలో దేశభక్తిని బయటకు తీసుకు రావు. భావోద్వేగానికి గురి చేయవు. హీరో మిషన్ ఎగ్జైటింగ్ అనిపించలేదు.
పాటలు, నేపథ్య సంగీతం సోసోగా ఉన్నాయి. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా, స్టైలిష్ గా ఉంది. నిర్మాత అనిల్ సుంకర ఖర్చుకు అసలు వెనుకాడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తూ ఉంటుంది. ఫస్టాఫ్ పర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, సెకండాఫ్ ఇబ్బంది పెడుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఒక్కటీ కొంచెం కొత్తగా ట్రై చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని బావున్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : 'ఏజెంట్' కోసం అఖిల్ అక్కినేని పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. ప్యాక్డ్ బాడీ, హెయిర్ స్టయిల్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నటుడిగానూ కొత్తగా కనిపించారు. మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పేది ఏముంది? పాత్ర పరిధి మేరకు చేశారు. నటుడిగా ఆయన అనుభవం, ఇమేజ్ వల్ల క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. డెవిల్ పాత్రలో డినో మోరియా నటన రెగ్యులర్ అయినప్పటికీ... సెట్ అయ్యింది.
సాక్షి వైద్య క్యారెక్టర్ మూడు పాటలు, నాలుగైదు సన్నివేశాలు మాత్రమే పరిమితం అయ్యింది. నటిగా ఉన్నంతలో పర్వాలేదు. డ్రస్సింగ్, యాటిట్యూడ్ మోడ్రన్ గా ఉన్నాయి. కమర్షియల్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంటారు. సాక్షి వైద్య పాత్రకు తెలంగాణ యాస పెట్టడం సెట్ కాలేదు. అది ఫోర్స్డ్ గా ఉంది. మురళీ శర్మ, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళీ, భరత్ రెడ్డి తదితరులకు నటించే అవకాశం రాలేదు. రెండు మూడు సీన్లు చేసుకుంటూ వెళ్ళారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు ఉంది. కథలో, సన్నివేశాల్లో ఆమెకు ఇంపార్టెన్స్ లేదు. ప్రేక్షకులకు తెలిసిన ముఖ్యలు కొన్ని కనిపిస్తాయి. అయితే, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు గుర్తుండటం కష్టమే.
Also Read : 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : ఇప్పటి వరకు వెండితెరపై గూఢచారి నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో సన్నివేశాలను మరోసారి చూసిన ఫీలింగ్ ఇచ్చే సినిమా 'ఏజెంట్'. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మెషన్ పరంగా అఖిల్ అదరగొట్టినా... సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. అఖిల్ ఫ్యాన్స్, యాక్షన్ ఫిల్మ్ లవర్స్ తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వెళితే మంచిది. అఖిల్ కోరుకున్న యాక్షన్ ఇమేజ్, సాలిడ్ సక్సెస్ 'ఏజెంట్' ఇవ్వడం కష్టమే.
Also Read : 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?