Cardamom After Meals : భోజనం తర్వాత యాలకులు తింటే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే.. నోటి దుర్వాసన నుంచి బరువు తగ్గే వరకు
Cardamom Uses : యాలకులకు ఆయుర్వేదంలో మంచి ప్రాధన్యత ఉంది. అయితే వీటిని భోజనం తరువాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. వాటి వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.

Cardamom After Meals : భోజనం చేసిన తర్వాత చాలామంది స్వీట్స్ లేదా మౌత్ ఫ్రెషనర్స్ తీసుకుంటారు. మౌత్ ఫ్రెషనర్(Mouth Freshner)గా సోంపు లేదా యాలకులు తింటారు. ఇవి మంచి రుచిని ఇవ్వడమే కాదు.. జీర్ణక్రియను సులభతరం చేస్తాయని చెప్తోంది ఆయుర్వేదం. సోంపు గురించి ఎక్కువమందికి తెలిసినా యాలకుల గురించి పెద్దగా తెలియదు. ఆయుర్వేదం ప్రకారం యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అని అంటారు. ఎందుకంటే దాని సుగంధ వాసన చాలా శక్తివంతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే దీనిని భోజనం చేసిన తర్వాత తింటే మంచిదని చెప్తున్నారు.
యాలకులను చాలామంది వంటల్లో స్వీట్స్‌లో ఉపయోగిస్తారు. ఆరోగ్యం కోసం అనేక విధాలుగా ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి భోజనం తిన్న తర్వాత యాలకులు నమలడం. యాలకుల లక్షణాల చరిత్ర ఆయుర్వేద పుస్తకాలలో కూడా ఉంది. అందుకే యాలకుల సారాన్ని వంటకాలు, మందులలో ఉపయోగిస్తున్నారు. మరి భోజనం తర్వాత వీటిని తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చూసేద్దాం.
నోటి దుర్వాసన మాయం
యాలకులను ఎప్పటినుంచో సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉండే సుగంధ నూనెలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి శ్వాసను తాజాగా ఉంచుతాయి. భోజనం చేసిన తర్వాత యాలకులు నమలడం వల్ల వెల్లుల్లి లేదా ఉల్లిపాయ వంటి వాటి వాసన పోతుంది. నోటి పరిశుభ్రత కూడా మెరుగుపడుతుంది.
జీర్ణక్రియకు కూడా..
యాలకులలో కనిపించే సినియోల్, ఇతర నూనెలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. అందుకే తిన్న తర్వాత యాలకులు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది పొట్టలోని కండరాలను కూడా సడలిస్తుంది. దీనివల్ల భారీ భోజనం తర్వాత కలిగే కడుపులో మంట లేదా బరువుగా అనిపించే సమస్య తగ్గుతుంది.
డీటాక్స్ చేసేందుకు
యాలకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. శరీర జీవక్రియ కూడా సమతుల్యంగా ఉంటుంది. అంటే యాలకులు చిన్న మసాలా అయినా శరీరాన్ని శుభ్రపరచడానికి, శక్తిని కాపాడటానికి సహాయపడుతుందని చెప్తారు.
బరువు తగ్గించడానికై
యాలకుల రుచిలో కొద్దిగా తీపిగా ఉంటాయి. మంచి సువాసన ఇస్తాయి. లంచ్ తర్వాత దానిని నమలడం వల్ల షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. దీని సువాసన మనస్సును శాంతింపజేస్తుంది. ఒత్తిడి, విసుగు తగ్గుతుంది. దీనివల్ల అతిగా తినడం మానేస్తారు. ఈ రెండూ కూడా బరువు అదుపులో ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తాయి.
యాలకులతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్‌గా వీటిని భోజనం తర్వాత తీసుకోవాలని చెప్తున్నారు. ఆఫీస్‌కి వెళ్లేవారు కూడా ప్యాకెట్లో లేదా బ్యాగ్‌లో ఓ రెండు యాలకులు వేసుకుని వెళ్లి.. భోజనం తర్వాత తినొచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయకుండా మంచి ఫలితాలు ఇచ్చే చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని గుర్తించుకోవాలి. అలాగే వైద్యుల సలహాలు తీసుకుని కంటిన్యూ చేయడం మరీ మంచిది.






















