(Source: ECI | ABP NEWS)
World Thrombosis Day : రక్తం గడ్డ కడితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయ స్థితి రాదట
Blood Clots : శరీరంలో రక్తం గడ్డకడితే ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

World Thrombosis Day 2025 : శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్లడ్ లోపల ఈజీగా ఫ్లో అవ్వడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అలాంటిది రక్తం గడ్డ కడితే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదూ. ఇలా రక్తం గడ్డ కట్టడాన్నే( Blood Clots) థ్రాంబోసిస్ అంటారు. ఇలా రక్తప్రసరణ ఆగిపోతే చాలాప్రమాదమని చెప్తూ.. దీని గురించిన అవగాహన కల్పిస్తూ ప్రతి ఏటా ప్రపంచ థ్రాంబోసిస్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. థ్రాంబోసిస్ గురించిన పూర్తి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
థ్రాంబోసిస్ డే ఎప్పటి నుంచి చేస్తున్నారంటే.. (Thrombosis Day History)
థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టడం వల్ల కాళ్లు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు ప్రమాదంలో పడిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాపాయం కలిగిస్తుంది. ఈ విషయాన్నే గుర్తించి.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ థ్రాంబోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డా. రూడాల్ఫ్ విర్‌చోవ్ (Rudolf Virchow) అనే శాస్త్రవేత్త జయంతిని గుర్తు చేస్తూ.. 2014లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ థ్రాంబోసిస్ అండ్ హీమోస్టాసిస్ దీనిని ప్రారంభించింది.
థ్రాంబోసిస్ డే ప్రాముఖ్యత (Thrombosis Day Significance)
థ్రాంబోసిస్తో ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. రక్తం గడ్డ కట్టడం వల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే థ్రాంబోసిస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తొలిదశలో గుర్తిస్తే కలిగే లాభాలు వివరించేందుకు, సరైన జీవనశైలిని పాటించే విధంగా ప్రజలను ప్రోత్సాహిస్తూ థ్రాంబోసిస్ డే నిర్వహిస్తున్నారు.
రక్తం గడ్డ కట్టడానికి కారణాలు ఇవే (Thrombosis Causes)
రక్తం గడ్డ కట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల, గర్భధారణ లేదా బర్త్ కంట్రోల్ మాత్రలు వాడినప్పుడు, అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడేవారిలో ఈ సమస్య వస్తుంది. స్మోకింగ్ చేసేవారు, సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకునేవారికి కూడా ఈ ప్రమాదం ఉంది. క్యాన్సర్, హార్ట్ డిసీజ్ ఉన్నవారికి కూడా ఈ సమస్య రావచ్చు.
రక్తం గడ్డ కడితే కనిపించే లక్షణాలివే..(Thrombosis Symptoms)
థ్రాంబోసిస్ వల్ల కాళ్లలో నొప్పి, వాపు లేదా వేడి అనిపించడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఛాతి నొప్పి లేదా గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. చర్మం రంగు మారుతుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. మీ సమస్యకు తగ్గట్లు వైద్యులు మందులు సూచిస్తారు. లేదా చికిత్స చేస్తారు.
రక్తం గడ్డకట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే (Precautions)
రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజూ కనీసం 30 నిమిషాలు అయినా నడవాలి. వ్యాయామం చేస్తే మరీ మంచిది. ఎక్కువసేపు కూర్చోకూడదు. మధ్యలో లేస్తూ ఉండాలి. శరీరానికి తగినంత నీరు అందించాలి. పొగ, మద్యానికి దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువసేపు జర్నీ చేసేవారు.. కాళ్లు కదిలించటం, స్ట్రెచింగ్ చేయడం చేస్తే మంచిది.
రక్తం గడ్డకట్టడం ఎంత ప్రమాదమో చూశాము. మరి అది దరిచేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా మీపైనే ఉంటుంది. మీరు విస్మరించే పనులే.. మిమ్మల్ని ప్రమాదానికి చేరువ చేస్తాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నిపుణుల సూచనలు ఫాలో అవ్వడం చాలా మంచిది.






















